Pavani5’s Weblog

ఆగష్టు 7, 2008

సినీమాయ…

ప్రచురించిన వర్గము Uncategorized — pavani5 @ 5:10 పూర్వాహ్నం

 మన సినిమాలలో కొన్ని సీన్లు చూస్తే భలే నవ్వు వస్తుంది, కాస్త విచిత్రంగా కూడ ఉంటుంది. హీరో  కధాపరంగా బీదవాడు అయినా స్ర్కీన్ మీద మాత్రం బైక్ లేకుండా అడుగుబైట పెట్టడు. హీరోయిన్ బర్త్ డే వచ్చిందంటే నెక్లెస్ కాని కనీసం ఒంటిపేట  బంగారు గొలుసు కాని ప్రెజెంట్ చేస్తాడు. అయ్యగారికి ఉద్యోగం సద్యోగం ఏది లేకపోయినా, అంత డబ్బు ఎలా వస్తుందో తెలీదు. పోని ఇంట్లో వాళ్ళు ఇస్తారా అంటే, ఇల్లు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు కనపడరు. కనీసం వాళ్ళ గురించి కూడా ఎక్కడా ప్రస్తావించడు. ఎక్కడ తింటాడో  ఎక్కడ  పడుకొంటాడో  తెలియదు.
    ఒక సీన్లో వేసిన  బట్టలు ఇంకో సీన్లో వెయ్యడు, ఆబట్టలు అన్నీఎక్కడ పెడతాడో  తెలియదు.  మనకైతే అన్ని బట్టలు పెట్టుకోవాలంటే కనీసం నాలుగు బీరువాలు కావాలి. అమ్మ అయ్య  లేకపోయినా దేవుడిచ్చిన  చెల్లొ  తమ్ముడో  ఉంటారు.  వాళ్ళకోసం ఈయనగారు ప్రాణం ఇస్తారు.  ఏ అమ్మాయైనా కనపడితే…. అది ఎంత  అందంగాఉన్నా సరే  హీరోయిన్ కాక పోతే అమ్మా చెల్లెమ్మా అంటాడు. ఎంతవికారంగా ఉన్నా  హీరోయిన్ తో మాత్రం అయి లవ్ యు అంటాడు.
     సార్ కి వారంరోజులనించి తిండి లేకపోయినా  భలే హెల్దీగా ఉంటాడు. అదే మనమైతేనా  ఒక్కరోజు ఉపవాసం ఉంటే  తెల్లారేసరికి  ఈసురో వాసుదేవా అంటూ  వేళ్ళాడ బడి పోతాం.  ఎక్కడా స్కూల్లో కాలేజీ లో కాని చదివినట్టు కనపడదు  కాని అవసరాన్నిపట్టి అయ్యగారు ఇంగ్లీష్ గడ్డగడ్డ గడా మాట్లాడతాడు.  మనం వుసూరుమంటూ చిన్నప్పటి నించి డిగ్రీ దాకా చదివినా ఆఇంగ్లీష్  రాదు. ఇక దొరగారి పక్కన స్నేహితుడు  ఒకడుంటాడు వాడికి  ఎక్క్డడాలేని నిజాయతి, హీరోకి ఏ చిన్న కష్టం వచ్చినా ఆయనగారు  విలవిల లాడి పోతాడు. తనసుఖం తను చూసుకోకుండా  హీరో కోసమే త్యాగం చేసే ధన్యజీవి.
    ఇద్దరూ కలిసి సిగరెట్లు కాలుస్తూ రోడ్డుమీద వెళ్ళేవాళ్ళని కామెంట్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూంటారు. ఎవరికి  ఏమైనాపట్టించుకోరు కానీ అదే హీరోయిన్ పేరెంట్స్ కి మాత్రం  ఏచిన్న కష్టం వచ్చినా తెగబాధ పడి పోయి అందులో ఇన్ వాల్వ్ అయిపోయి  వాళ్ళకి న్యాయం జరిగె దాకా వదలరు. పాటల విషయానికి వస్తే మన హీరో ఎప్పుడు ఎక్కడ సంగీతం, కవిత్వం నేర్చుకుంటాడో తెలియదు కాని రాగ తాళ యుక్తంగా పాటలు పాడేస్తారు. ఆ పాటలకి తగ్గట్టు డ్యాన్స్ లు.
   హీరో ఎంత బక్కపల్చగా, పొట్టిగా వున్నాకూడా, విలన్ ఎంత బండగా వున్నా కూడా హీరో గారు ఒక్కతన్ను తన్నాడంటే విలన్ విల విలలాడుతూ కుప్పకూలిపోవలసిందే. అంత ఫైటింగ్ ఎప్పుడు నేర్చుకుంటాడో అర్ధం కాదు. ఎంత మంది వచ్చినా అలుపు ఆయాసం లేకుండా ఒక్క దెబ్బ తగిలించుకోకుండా అవతలి వాళ్ళని చితకొట్టి చింతకాయ పచ్చడి చేసేస్తాడు. ఎప్పుడైనా ఖర్మకాలి ఏకొండ మీదనుండో పడిపోతే మనమైతే సున్నంలోకి ఎముకలేకుండా అయిపోతాం కాని మన హీరో గారికి మాత్రం నుదిటి మీద చిన్న ప్లస్ మార్క్ వస్తుంది అంతే. ఆ ప్లస్ మార్క్ చూసే హీరోయిన్ ఢమేల్ మని పడిపోతుంది……. షరా మామూలే పాట పక్కనే హిమాలయాలు. మనం ఎంత వ్యయప్రాయసలు పడితేగాని వెళ్ళలేము కాని వాళ్ళు అలా కళ్ళు మూసుకుంటే చాలు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఆ మంత్రం ఏదో మనకీ తెలిస్తే బాగుండు… :-)
   ఇక మన హీరోయిన్ గారయితే ప్రపంచంలో వున్న కరువుంతా తన దగ్గరే వున్నట్టుగా పాపం చిన్నప్పుడు ఎప్పుడో కుట్టించుకున్న గౌను వేసుకొని తిరుగుతుంది. అందుకేనేమో ఎవరో ఒక గీత రచయిత రాసారు ’ చిన్నగౌను వేసుకున్న పెద్దపాప’ అని ఏదో సినిమాలో. అలాంటి బట్టలు వేసుకొని ఇంట్లొ అందరి ముందు బానే తిరుగుతుంది. కానీ హీరో ముందుకి వచ్చేసరికి మాత్రం ఎక్కడ లేని సిగ్గు వచ్చేస్తుంది. ఆ సిగ్గు ఇంత చిన్న బట్టలు వేసుకోవలసి వచ్చినందుకో లేక ఇవి మాత్రం ఎందుకు వేసుకోవలసి వచ్చిందిరా అనా అర్ధం కాదు. అమ్మాయిగారు మాట్లాడుతుంటే నోట్లో చూయింగం పెట్టుకొని నములుతున్నట్టే వుంటుంది కాని ఒక్క డైలాగ్ కి కూడా లిప్ మూమెంట్స్ కలవవు.
   ఏంటో ఈ సినీమాయలు అబ్బో చూడతరమా……

ఆగష్టు 3, 2008

ఆశా నిరాశేనా…

ప్రచురించిన వర్గము Uncategorized — pavani5 @ 5:08 అపరాహ్నం

 నాఆత్మకధ మీతో చెప్పాలని ఈరోజు ఎందుకో అనిపిస్తోంది. ఈమద్య స్లిమ్ గా ఫెయిర్ గా అవ్వాలనుకొని కొన్ని సౌందర్య సాధనాలు వాడాను వాటి ఫలితాలను మీకు చెప్పుకుంటాను.
   టీవీలో ’అందం’ సీరియల్ చూస్తుంటే…… మద్యలో బ్రేక్ లో వచ్చిన యాడ్స్ లో కోల్గేట్ యాడ్  చూసాను. డాక్టర్లందరు దంత సౌందర్యం కోసం కోల్గేట్ వాడమని సూచిస్తున్నారు. అది చూసి దీంతో అయినా నాపళ్ళు బాగుపడతాయని ఆశతో  వెంటనే వెళ్ళి  కోల్గేట్ పేస్ట్ తెచ్చాను. ఇక నాపళ్ళు మిలమిలలాడతాయని ఎంతో ఆనందంతో  ట్యూబ్ ఓపెన్ చేసాను. తీరాచూస్తే అది నాఒక్క పంటికి కూడా సరిపోలేదు. ఈరకంగా ఎన్ని పేస్టులు తెస్తే నాపళ్ళు బాగుపడతాయని నిరాశతో ఆప్రయత్నం మానుకొన్నా. దంత సౌందర్యం ఆరకంగా సమాధి అయ్యింది.
   కనీసం చర్మసౌందర్యం అయినా మెరుగు పరుచుకొందామని అదేదో ఫెయిర్ అండ్ లవ్లీ అని విన్నాను, సరే దీని సంగతి ఏమిటో చూద్దామని, పేస్ట్ ఒకటి తెస్తే చాల్లేదని, ఇవి నాలుగు తెచ్చాను  కాని అన్ని కలిపినా ముఖానికి ఒక పక్కకి కూడా రాలేదు. ఈరకంగా చర్మసౌందర్యం కూడ మట్టిలో కలిసి పోయింది.    ఎహె…. ఎందుకొచ్చిన గోల అని కొన్ని రోజులు మూసుకొని వూరుకొన్నా. నేను వూరుకొందామన్నా యాడ్స్ వూరుకోనిస్తాయా…??  ఈమద్యనే చూసా మన మాస్ట్రర్ బ్లాస్టర్ చెప్పిన  సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అనే మాటలు నన్ను బాగా ప్రభావితం చేసాయి. అందులోను ఈమద్య కాస్త నీరసంగా ఉంటోందేమో, దాంతో చెంగున ఎగురుకుంటు వెళ్ళి ఒక కిలో బూస్ట్ తీసుకువచ్చాను. కానీ దాన్ని పాలల్లొ కలపటానికి యజమాని కాసిని కూడా పాలు మిగల్చడు. దాంతో ఏదారిలేక కుడితిలో కలుపుకొని తాగాను ఉపయోగం ఏముంది…  అలాంటి కిలోలు ఎన్ని తెస్తె నాకు సరిపోతాయి…?  మనకి గడ్డే మేలు అనుకొని గడ్డిలో లేనిది దానిలో మాత్రం ఏముంటుందిలే అని దాన్ని కూడ తృణ ప్రాయంగా వదిలేసాను.
   ఆ ఇంకో విషయం మర్చిపోయాను, ఆమధ్య సంతూర్ సబ్బు కూడ తెచ్చాను. అది వాడితే చాలా చిన్నగా కనపడతామని అంటే. కాని దాన్ని ఈచర్మానికి ఎలా రుద్దాలో అర్ధంకాక, సరే నీళ్ళలో కలుపుకొని స్నానం చేద్దామనుకొన్నా. కాని చెరువులో  ఎన్నిసబ్బులు కలిపితే  మన స్నానానికి సరిపోతుంది.  ప్చ్….  హ… ఏమిటో ఈజీవితం, విరక్తి పుడుతోంది.
    చివరి ఆశగా  సోనా బెల్ట్ ఒక్కటివాడి కనీసం పొట్టయినా తగ్గిద్దామని  అనుకొన్నాను. ఎందుకంటే మనిషే కాదు బర్రె కూడ ఆశా జీవే కదండి. అయినా ఈసారి నా స్తోమత కూడా అలోచించకుండా పీనాసితనానికి పోకుండా ఓ పదిబెల్ట్ల్ల్ లు కలిపి వేసాను. అయినా కూడా నా ఆకారాన్ని వెక్కిరిస్తూ అది కాస్తా ఫట్ మని తెగింది. ఛి…ఛీ… అనుకొని, మనకి ఇవేవి సరిపడవు లే అని అనుకొని, ఈబర్రె జీవితంలో ఉన్నసుఖం ఎందులోను లేదని, హాయిగా నాగడ్డేదో నేను తింటూ నా నెమరేదో నేనెసుకొంటూ, అందంలో లేదు ఆనందం అనుకొని. ఇక సీరియల్స్ చూసినా యాడ్స్ మాత్రం చూడకూడదు అని నిశ్చయించుకున్నాను.

ఆగష్టు 2, 2008

HAPPY FRIENDSHIP DAY…

ప్రచురించిన వర్గము Uncategorized — pavani5 @ 5:02 అపరాహ్నం

“స్నేహం ” ఆమాటగురించి ఎంతమంది ఎన్నిరకాలుగా చెప్పినా తరగని మాధుర్యం స్నేహంలో ఉంది. అది మాటలకందని గొప్ప అనుభూతి. స్నేహం అనేది ఒక గ్రీటింగ్ కార్డ్ తోనో, లేక ఒక ఫ్రెండ్ షిప్ బ్యాండ్ తోనో, ఏబహుమతి తోనో ఏర్పడేది కాదు, వాటివల్లనిలిచేది కాదు.  కులం- మతం భాష - దేశం  ఆడ -మగ   చిన్నా-పెద్దా  తేడా లేనిది, ఏద్వేషం  లేనిది స్నేహం ఒక్కటే.  ఏస్వార్ధం లేని  అతీతమైన  బంధం స్నేహం  కాని కొంతమంది దానిని స్వార్ధానికి వాడుకుంటున్నారు ఈరోజుల్లో. డబ్బుతోముడిపెట్టి  నిజమైన స్నేహితులని  కష్టాలలోకి నెడుతున్నారు. ఇటువంటి పరిస్తితులలో మంచి స్నేహితులను పొందటం నిజంగా అదృష్టం,  కాని  కొంతమంది  సినిమాలు షికార్లు మాత్రమే స్నేహమని అనుకొంటారు.  మనసు లోతుల్లోని భావాలు ఎంతమంది చూడగలరు..?ఆడుకున్నా కొట్టుకొన్నాతిట్టుకొన్నా , బళ్ళో కలిసి పనిష్మెంట్ తీసుకున్నా, కాపీలు కొట్టినా, స్కూల్ బయట ఒక కాయ కొని రెండు కాయలు కొట్టేసినా, పానీపూరీ తిన్నా, రన్నింగ్ బస్ ఎక్కినా, పాటలు వింటూ డాన్స్ చేసినా ,బీటు కొట్టినా,చిన్న పాటి తగదాల తో విడిపోయి మళ్ళీ కలిసినా అది స్నేహితులకే చెల్లుతుంది. అలాంటి స్నేహంలో  వున్నగొప్పదనం  ఎంతమంది ఆస్వాదిస్తున్నారు.?   ఏ కష్టమొచ్చినా  స్నేహితుడు అందించే  హస్తం  ఎంత ధైర్యాన్నిస్తుంది,  జీవితంలో ముందుకు సాగటానికి ఆధైర్యంఎంతో చేయూతనిస్తుంది. ఇవ్వాళ్ళ స్నేహితులిగా వున్నవాళ్ళు రేపు ద్వేషంతొ కొట్టుకొంటున్నారు చంపుకొంటున్నారు…… వద్దు, ఇటువంటి  స్నేహం వల్ల మనస్తాపాలే కాని మానసోల్లాసం లేదు. కొందరు ప్రేమ కోసం స్నేహాన్ని అడ్డం పెట్టుకుంటారు ఇది  ఎంత వరకూ సమంజసం? పారదర్సకమైన స్నేహాన్ని మలినం చేయద్దు , స్వచ్చమైన స్నేహాన్ని ఆహ్వానిద్దాం.

అందరికి స్నేహితుల రోజు శుభాకాంక్షలు… :-) :-)

జులై 31, 2008

పాములనాయుడు… సెల్ ఫోన్…

ప్రచురించిన వర్గము Uncategorized — pavani5 @ 2:51 అపరాహ్నం

పాములనాయుడు కి ఎన్నో రోజుల నుండి మొబైల్ కొనాలని ఆశ. ఎందుకంటే తన ఫ్రెండ్ జక్రయ్య ఎప్పుడు మొబైల్ లో మాట్లాడుతూ తెగ ఫోజులు కొడుతూండటం చూసి ఎలాగైనా తను కూడా మొబైల్ కొనాలని నిశ్చయించుకున్నాడు పాముల్నాయుడు. ఇక ఆలశ్యం చేయకుండా మొబైల్ కొనేసాడు. ఇక అప్పటి నుండి మొదలయ్యాయి కష్టాలు మన పానా కి…
ఏనాడైతే కొన్నాడో ఆ రోజు నుండి శని పట్టుకుంది. ఆరోజు ఫస్ట్ కాల్ శుభప్రదంగా వుంటుందని సాయిబాబా గుడికి కాల్ చేద్దామని నంబర్ నొక్కాడు. మన పానా ఫోన్ రింగ్ అవుతూండగానే సాయిబాబా దండకం చదువుకుంటూ అవతల వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయాగానే…
ఆ హలో నమస్కారమండీ… ఈ రోజు ఎన్నింటిదాకా వుంటారు మీరు అని అడిగాడు.
అవతలి వ్యక్తి, ఆ సాయంత్రం దాకా. తర్వాత ఆ అవతలి వ్యక్తి అడిగాడు మన పానా ని, సార్ ఎన్నింటికి వస్తారు, ఎందుకంటే ఇక్కడ ఏర్పాట్లు చెయ్యాలి కదా.
ఏర్పాట్లా…..! ఓహో పూజ గురించేమో అనుకొని సాయంత్రం ఆరింటికి వస్తాం అన్నాడు.
సరే సార్ కాని ఆరు దాటితే ఇక్కడ నేను వుండను వేరే అతను వస్తాడు డ్యూటీకి అనగానే మన పానా కి ఏమి అర్ధం కాలేదు. అదేంటండి మీరే కదా అక్కడ ప్రధాన పూజారి అని అన్నాడు… పూజారా…??? ఏందయ్యో నేను ఎవరనుకుంటున్నా….??
పానా కి ఏమి అర్ధం కాలేదు సార్ ఇది సాయిబాబా గుడేనా అని అడిగాడు(అవతలి వ్యక్తి ఎవరో అడిగి తెలుసుకోవాలనే ఆలోచన అప్పుడు వచ్చింది మన హీరో కి). కాదయ్యో ఇది శ్మశానం కదూ, నేను కాటికాపరి కదూ అన్నాడు. మన వాడికి మతి పోయి తనని తాను లక్షబూతులు తిట్టుకొని ఫోన్ పెట్టేసాడు… అలా ఫస్ట్ కాల్ ప్రహసనం సాగింది…
ఇలా లాభం లేదనుకొని ఆ రొజు ముహూర్తం బాలేదనుకొని ఆరోజుకి వదిలేసి మొబైల్ ని మూట కట్టేసి బీరువాలో పెట్టేసాడు మన పానా.. మర్నాడు ముహూర్తం చూసి అలాగే వర్జ్యంకూడ చూసి సెల్ ఫోన్ బీరువాలో నుండి తీసాడు. తీసితీయగానే ఫోను రింగ్ అయ్యింది. పానా ఎక్కడలేని ఆనాందంతో ఫోను తీసి హలో అన్నాడు…
అవతలి నుండి ఒక అందమయిన గొంతు నవ్వూతూ హలో అంది..
పానా ఇక ఆనందానికి అవధులు లేవు. ఆ గొంతు వినే సగం పడిపోయాడు. హలో ఎవరూ అన్నాడు..
నా పేరు శ్రీవీరవెంకటసూర్యకాంతనాగరాజసాయిదుర్గవిజయకనకమహలక్ష్మి … అని చెప్పగానే పానా బ్రెయిన్ పూర్తిగా పోయింది.. రెండు నిమిషాలు పట్టింది తిరిగి మామూలు మనిషి అవడానికి. మళ్ళి పొరబాటున ఎవరండి అని అన్నాడు అంతే ఆలస్యం అడిగిందే తడవుగా మళ్ళీ ఆవిడగారు మొదలుపెట్టి చెప్పారు నా పేరు శ్రీవీరవెంకటసూర్యకాంతనాగరాజసాయిదుర్గవిజయకనకమహలక్ష్మి …
ఆపేరువినగానే, వామ్మో ఏందమ్మా ఇంతపేరు అంటే… హిహిహిహి అది మాఅమ్మమ్మ పెట్టిన పేరండి. నాకు చాలా ఇష్టమైన పేరు. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నాపేరు పూర్తిగా పిలవండీ నాకుచాలా హేపీగావుంటుంది అంది. నీ హేపి తుంగలొ తొక్క దానిసంగతి తరువాత చూద్దాం, ముందు నాసంగతిచూడు అన్నాడు.
ఆవిడగారు సిగ్గు పడుతు చెప్పండి సార్ ఏమిటి మీప్రాబ్లెం అంది. నేను చెప్పేదేంది నువ్వే కదా ఫోన్చేసింది… ఆ మర్చిపోయాను సార్, మీ మొబైల్ బిల్ నాలుగు వేల ఏడు వందల డెభైనాలుగు రూపాయలు వుంది, లాస్ట్ డేట్ కూడా అయిపోయింది. ఇవ్వాళ్ళ పే చెయ్యకపోతే రేపు మీ ఫోన్ కట్ అవుతుంది.
ఏందీ నేను ఫోన్ బిల్లు కట్టాలా… ఏందమ్మో నేను ఫోన్ కొన్నదే నిన్న, దాని శిగతరగ ఏదో కొత్త ఫోన్ ముందుగా దేవుని దీవెన తీసుకుందామని నిన్న చేసిందే ఒక్క ఫోన్ అది కూడా యాడికో శ్మశానానికి పోయింది. దానికి నాలుగు వేల ఏడు వందల డెభైనాలుగు రూపాయలా… మతి వుండే మాటాడుతున్నావా..??
అయ్యో సార్ మీరు ఈ ఫోన్ తీసుకొని ఆరు నెలలు అయ్యింది కదండీ… ఈ బిల్ల్ లాస్ట్ మంత్ కట్టాల్సింది.
ఏంది ఆరు నెలలా…..! ఎవరు చెప్పారు నీ అమ్మ మొగుడు. చెప్పిన సోదంతా విని మళ్ళీ అదే వాగుతావ్.
అయ్యో అలాగా సార్ మీపేరు చెప్పండి…
అమ్మా…..
సార్ కాల్ మీ శ్రీవీరవెంకటసూర్యకాంతనాగరాజసాయిదుర్గవిజయకనకమహలక్ష్మి …
నా బొంద అదే అదే చూడు తల్లీ నాపేరు పాముల నాయుడు…
:-) ఏంటి సారు ఆ పేరు… అంటే మీరు పాములు పట్టుకుంటుంటారా….??
ఏందమ్మో నువ్వు పెట్టుకోలా కొండవీటి చాంతాడంత పేరు, అయినా పని చూడమ్మా…
కానీ సార్ ఇక్కడ పవన్ అని వుందే… ఒకసారి మీఅడ్రస్ చెప్పండి సార్…
అన్నికాయితాలు ఇచ్చిచచ్చాను కదమ్మా ఫోన్ తీసుకునేటప్పుడు. మళ్ళి ఇప్పుడు ఈ సోది ఏంది…
సార్ ఒక్కసారి చెప్పండి …
చూసుకో చెప్తున్నా… ఇంటి నంబరు 420, వీధి నంబరు 210, పీతగుంట్ల పాలెం, చాలామ్మ…
సార్ సారీ సార్ ఒక్కసారి మీ నంబర్ ఇదేనా చూడండి… **********
అమ్మా నా నంబర్ అది కాదు, ముందు నంబర్ సరిగ్గా చూసుకొని చేసుకోండి ఫోన్లు.. ఇంత సేపూ నా బుర్ర తినేసి ఇప్పుడు సారి అంటావా… పెట్టెహె సోది…..
ఇక లాభం లేదనుకొని ఫోన్ తీసుకొని తప్పు చేసాననుకొన్నాడు పానా. ఇంతలో మళ్ళీ ఫోన్ రింగ్ అయ్యింది కానీ పానా కి ఫోన్ తీయాలనిపించలేదు. ఫోన్ అంటే నే విరక్తి వచ్చేసింది పాపం. కానీ మళ్ళీ ఏదో చిన్న ఆశ ఈ సారైనా సరైన కాల్ వస్తుందేమో అని… ఆ ఆశతో మళ్ళీ ఫోన్ తీసాడు, హలో అన్నాడు…
హలో యాదయ్యా నేను ఇక్కడ సికింద్రాబాదు లో వున్నాను, కుకట్ పల్లి వెళ్ళాలి అర్జెంట్ గా ఆటో తీసుకొని వస్తావా…??
ఏందయ్యా నువ్వెవరూ…. ఈ యాదయ్య ఎవరూ…… ఈ ఆటో గోల ఏంది……
హలో నువ్వు యాదయ్యవి కావా….?? ఇది చిలకలగూడా కాదా….??
కాదు ఇది పీతగుంట్ల పాలెం…. నేను యాదయ్యను కాను…. పెట్టెయ్ ఫోన్..
ఆ ఫోన్ పెట్టీపెట్టక ముందే మళ్ళీ ఫోన్ రింగ్……. పానా కి ఫోన్ ఎత్తికొట్టాలన్నంత కోపం వచ్చింది.. కానీ ఆఫోన్ కి పెట్టిన డబ్బులు కనపడ్డాయి కళ్ళముందు.. ఏమి చెయ్యలేక మళ్ళీ ఫోన్ తీసి హలో అన్నాడు ఏడుపు మొహం తో…
అవతలి వ్యకి హడావిడిగా… సార్ సార్ మీరు అర్జెంటుగా బయలుదేరి ఇక్కడికి రావాలి.
పానా గుండెలు జారి పోయాయి ఆ వ్యక్తి హడావిడి చూసి.. యవరయ్యా నువ్వు ఏమయింది…? యాడికి రావాల నేను…?
సార్ ఇక్కడ మీ ఆవిడకి పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. తొందరగా రండి మీరు…….
మా ఆవిడకా … యాక్సిడెంటా…..
అవునండి, ఆవిడ ప్రాణాపాయ స్తితిలో వున్నారు. అపోలోలో చేర్చాము, ఆవిడ బ్యాగులో మీ నంబర్ చూసి మీకు ఫోన్ చేస్తున్నాను మీరు తొందరగా రండి…
నీ అబ్బరేయి… నాకింకా పెళ్ళే కాలేదురా. నంబర్ చూసుకొని చెయ్యండిరా. పెట్టెయి ఫోన్….
దాంతో పానా ఒకటే నిశ్చయించుకున్నాడు. తెల్లారగానే మొబైల్ తీసుకెళ్ళి ఆ జక్రయ్యకి గిఫ్ట్ గా ఇద్దామని. అప్పుడు కాని వాడి తిక్క కుదరదని అనుకొని మళ్ళి ఆ ఫోన్ ని బీరువాలో పెట్టాడు. అంతకు ముందు నుండి పొయ్యిమీద మసిలి పోతున్న నీటిని తీసుకొని హాయిగా స్నానం చేసి, బువ్వ తిని బజ్జున్నాడు… :-)

జులై 28, 2008

పధకం శ్రీ…

ప్రచురించిన వర్గము Uncategorized — pavani5 @ 11:56 పూర్వాహ్నం

మన ప్రభుత్వం మనకి ఈమద్య చాలా పధకాలు ప్రకటిస్తోంది వాటిలో కొన్ని …
ఆంధ్రరాష్ట్ర్ర ప్రజల ఆరోగ్యదృష్ట్యా ఆరోగ్య  శ్రీ…(చాలా ఆరోగ్యంగా వున్నారు ప్రజలు డెంగ్యూ, మలేరియాలతో…)
పేదప్రజల కోసం చౌక  శ్రీ … (ఇంతకు ముందు ముప్పై రూపాయలు వుండే కంది పప్పు ఇప్పుడు నలభై నాలుగురూపాయలు ఎంత చౌకో…)
గూడు లేని ప్రజల కోసం రాజీవ్ శ్రీ…(రాజీవ్ గృహకల్ప …. కట్టడం ఎప్పటికయ్యోనో…)
రైతుల కోసం మందు శ్రీ …(మందులు చేల కన్నా రైతులు ఎక్కువగా వాడుతున్నారు…)
పిల్లల కోసం చదువు  శ్రీ…(ఈపధకం వల్ల తల్లిదండ్రులకి బాగా ఖర్చుపెట్టే అవకాశం ఎంతో…)
శ్రామికుల కోసం సారా శ్రీ …(దీనివల్ల తాగి తూగటం తప్ప ఉపయోగం  ఏమిటో…)
మహిళల కోసం పావలా శ్రీ…(ఈ పావలా వెనక కధ ఉహు…)
వృద్దుల కోసం పింఛను శ్రీ…(ఈపధకం కోసం తిరిగి తిరిగి వృద్దుల    పాట్లు ఎన్నని…)
ప్రయాణీకులకోసం ఆటో శ్రీ…(మార్చిన ఆటో మీటర్ల వల్ల ఎవరికి లాభం…)
యువతకోసం పబ్బు శ్రీ…(పబ్బు కల్చర్ అసలు అర్దం కావట్లేదు…)
ప్రతిపక్షాల కోసం తిట్లు శ్రీ…(ఇవి మాత్రం అక్షయ పాత్రలాగ ఎప్పటికి అయిపోవు…)
కేంద్రంకోసం రుణం శ్రీ…(కేంద్రానికి రుణం ఇస్తారని కాదు తీసుకుంటారని…)
వంటింటికోసం గ్యా శ్రీ…(బుక్ చేసాక నెల రోజులకి వస్తే గ్రేటే…)
కరెంటు కోసం వరుణ శ్రీ(అబ్బో ఎన్నియాగాలో….)
ఇన్నిపధకాలు మన కోసం పంచి తన కోసం  పదవిశ్రీ ని మాత్రమే ఉంచుకొన్న మహానుభావుల్ని అభినందిస్తూ…..ఈపధకాలు అన్ని కూడ వాడుకుంటు మనం మాత్రం మన ఓటుశ్రీ ని వారికే వేసి గెలిపిద్దాం….
ఇది ఎవరిని కించపరుస్తూ రాసిందికాదు జస్ట్  ఫన్ కోసం

జులై 25, 2008

రాయని కధ…

ప్రచురించిన వర్గము Uncategorized — pavani5 @ 1:45 అపరాహ్నం

అరోజు లేస్తూనే నాకోఆలోచన వచ్చింది ఒక కధ రాద్దామని. నాకు ఎన్నాళ్ళ నుండో కధలు రాసి గొప్ప పేరు తెచ్చుకోవాలని, స్కూల్లో కాలేజీల్లో వున్నప్పుడైతే ప్రతిసారి కధల పోటీలో పాల్గోని ఎలాగైనా ఫస్ట్ ప్రైజ్ కొట్టాలని చాలా దూరాశ(దురాశ). అప్పుడు రాసినవి అన్నీ నాకు నిరాశే మిగిల్చినయి. అందుకని చాలా గ్యాప్ ఇచ్చి మళ్ళి ఇప్పుడు రాద్దామని పట్టు వదలని విక్రమార్కి లా మొదలు పెట్టాను. ఇక పొద్దున్నే దడా బిడా పనులు చేసేసుకొని, ఏదో అన్నం సుద్ద పప్పు సుద్ద వండి పచ్చడి అనే పదార్ధాన్ని చేసి అక్కడ పడేసి, ఇక కధ రాయడానికి వుపక్రమించా.
    మీకు తెలీదు కాబోలు ఈ మధ్యనే నేను టైపింగ్ నేర్చుకున్నానేమో, ఆ నేర్చుకున్న ఆనందలో ఉత్సాహంలో  పిసి ఆన్ చేసి వర్డ్ ఓపెన్ చేసి ఓం ప్రధమంగా ’శ్రీరామా’ అని అక్షరాలు వెతుక్కొని వెతుక్కొని రాసేటాప్పటికి….. డింగ్……. అర్ధం కాలేదా పవర్ కట్ట్  అండి. ఈ కధ రాయాలి అనే ఆనందంలో టైం చూసుకోకుండా కూర్చున్నానేమో ప్రధమ విఘ్నం. ఏం చేస్తాం ఉసూరంటూ లేచా. సరే ఈ టైం లో ఏదో కాస్త నాలుగు ముద్దలు మింగితే ఆ పనన్నా అవుతుందని అన్నీ సర్దుకొని కంచం ముందు కూర్చున్నాను. ఆ సుద్దలు చూస్తే తినాలనిపించలేదు కాని ఏం చేస్తాం తప్పదు కదా. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అని ఇక అలానే ఏదో ఒకటిలే అనుకొని రెండు ముద్దలు మింగేటప్పటికి బెల్లు మోగింది. ఇప్పుడు ఎవర్రా వచ్చింది అనుకొని వెళ్ళి తలుపు తీసేసరికి పక్కింటి పావలా మణి వచ్చింది.
    ఈవిడ ఇప్పుడెందుకొచ్చిందిరా భగవంతుడా అనుకుంటూ…. ఆ రండి రండి అన్నాను. ఆవిడేమో ఏమి లేదండి ఆఫీసు నుండి మా ఆయన భోజనానికి ఇంటికి వచ్చారు, రోజు రారు అందుకని నేను ఆయన కోసం వండలేదు వున్నది నేను తినేసాను. మీ ఇంట్లో ఏదయినా కూర వుంటే ఇస్తారా నేను అన్నం వండేస్తాను.. అని అన్నది.
   ఆ మాట వినగానే నా మనసు ఆనందంతో గంతులేసింది, ళక్ ళక్ అనుకుంటూ పైకి మాత్రం అయ్యో దాన్దేముందండి, కూర ఏం భాగ్యం అన్నం కూడా ఇస్తా మళ్ళీ మీరేం వండుతారు… ఆయన ఆకలి తో వచ్చారు కదా తీసుకెళ్ళి వెంటనే పెట్టండి. అని నేను చేసిన సుద్దల గిన్నెలన్నీ ఇచ్చేశాను. ఆవిడ పాపం తెగ మొహమాట పడుతూ…. అయ్యో మీరు తింటున్నారు కదా.. మొత్తం ఇచ్చేస్తే మీకు….?
   అయ్యో నా భోజనం అయిపోయిందండి. పర్లెదు తీసుకెళ్ళండి అని చెప్పి ఆవిడని పంపించి చెయ్యి కడుకున్నా. ఇంతలో కరెంట్ వచ్చింది. మళ్ళీ వచ్చి పీసీ ఆన్ చేయబోతూ ఈసారైనా కధ ఏ అడ్డంకులు రాకుండా రాయగలిగితే ఉండ్రాళ్ళు చేయిస్తానని వినాయకుడికి దణ్ణం పెట్టుకొని వచ్చి కూర్చున్నా. ఇందాక శ్రీరామ రాసాను కదండి  కరెంట్ పోవడం వల్ల అది సేవ్ కాలేదు దాంతో మళ్ళి  శ్రీరామ రాసి మొదలు పెట్టాను…
   మళ్ళీ బెల్లు మోగింది, అబ్బా మళ్ళీ ఎవరొచ్చార్రా బాబు అనుకొని లేచి వెళ్ళి తలుపు తీసాను. ఎదురుగా  పాత బట్టలకి స్టీలు గిన్నెలు ఇచ్చే అమ్మాయి. చాలా రోజుల నుండి చాలా పాత బట్టలు  ఇంటినిండా పడి వున్నాయని మొన్న ఈ అమ్మాయి బజారులో కనపడితే ఇంటికి రమ్మని చెప్పాను. నా ఖర్మ కాలి అది  కూడా ఇప్పుడే వచ్చింది. వినాయకుడి ఉండ్రాళ్ళు పనిచెయ్యలా… ఆ అమ్మాయేమో గోల బుట్ట దించమ్మా అంటుంది. ఇక తప్పేటట్టు లేదని, బుట్ట దించి బట్టలన్నీ తెచ్చి దాని ముందు వేసా. ఆ బట్టలకి అదేమో చిన్న కాఫీ కాచే గిన్నె ఇస్తా అంటుంది నాకేమో కనీసం నాలుగు కిలోలు వుడికే గిన్నైనా కావాలి. నాక్కావలసిన గిన్నె కావాలంటే ఇంకా బట్టలు తెమ్మంటుంది అది. ఈ గోల తో ఒక గంట అయిపోయింది, చివరికి అది ఇవ్వకుండానే వెళ్ళింది. చచ్చినట్టు ఆ బట్టలన్నీ మళ్ళీ మూట కట్టి అటక మీద పారేసి, వచ్చి మళ్ళి పిసి ముందు కూర్చున్నా…
      ఇక ఇప్పుడు ఎవరు వచ్చేవాళ్ళు లేరు, ఒక పావు గంట ఆలోచించా ఏం రాద్దామా అని,  కాని మనకి కధలు ఏమోస్తాయి, చదవటం తప్ప రాయటం రాదే. నాలుగు అక్షరాలు రాయటం తీసివేయటం మళ్ళీ రాయటం మళ్ళీ తీసివేయటం మధ్యలో లేచి ఏదోవకటి తినటం తాగటం. ఇంతలో మళ్ళీ  బెల్లు. ఛీ దరిద్రం అనుకొని లేచి వెళ్ళి తలుపు తీసా, ఎదురింటావిడ గ్లాసుడు పాలు కావాలని. సరే కదాని ఇస్తే చిన్న కప్పుడు కాఫీపొడి కూడా ఇవ్వమ్మా అంది, ఆరెండూ తెస్తుంటే ఆ చేత్తోటే కాస్త పంచదార కుడా ఇవ్వమ్మా అంటూ దీర్ఘం తీసింది. ఇంతోటి దానికి కాఫీనే అడగొచ్చు కదా అనుకుంటూ అవన్నీ ఇచ్చి పంపేసాను ఆవిడని…
     టైం చూసేసరికి సాయంత్రం ఆరు. ఇక ఈపూటకి ఇంకెక్కడి కధ ఇంటి జనాలు వచ్చే టైం అవనే అయ్యింది. సాయంత్రం మళ్ళీ ఇంటిపనితోసరి వంటా తంటా. ఇలాగె ఈరోజు సరిపోయింది. ఇక కధ రాసేది ఎప్పుడు నాకు పేరు వచ్చేది ఎప్పుడు నాకల తీరేది ఎప్పుడు. ఈవిదంగా ఆలోచించి చించి నాబుర్ర పగిలిపోతోంది, ఇంతమంది రాస్తున్నారు నేనెందుకు రాయలేను. ఏది ఏలావున్నా రేపు కధ  రాసేతీరాలని ఆ రాత్రి పడుకునే ముందు గట్టిగా నిర్ణయించుకున్నాను.

జులై 24, 2008

అతకని బతుకులు (ఓ హిట్ సినిమా…)

ప్రచురించిన వర్గము Uncategorized — pavani5 @ 1:55 అపరాహ్నం

ఆరోజు చొక్కలింగం గారి సినిమా విడుదల సందర్భంగా చాలా హడావిడిగా ఉంది. చాలా రోజుల తరువాత మంచి సినిమా చూడవచ్చని అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురుచుసారు. రిలీజుకి ముందునుండే టికెట్లు కొనేవాళ్ళు కొనేసుకున్నారు. కొననివాళ్ళు రిలీజురోజు ఉదయాన్నే లైను లో నిలబడి టిక్కట్లు తిసుకుని హడావిడిగా సినిమా హల్లోకివెళ్ళారు  తోసుకుంటు తొక్కుకుంటు. ఒక అరగంట పాటలు (తరువాత ఆ హాల్లో రిలీజు అయ్యే సినిమావి) మరొ అరగంట యాడ్సయిన తరువాత, తెరలెగిసింది దానితోపాటె చెవులు పగిలిపోయెంత సంగితం (సౌండ్). 
  ముందుగా మన హీరో గారి పేరు ఎర్ర అక్షరాలతో ఎంతో అందమైన గ్రాఫిక్స్త్ తో, ఆ వెంటనే హీరోయిన్ గారి పేరు నీలిరంగు అక్షరాలతో ఇంకా ఎంతో అందమైన గ్రాఫిక్స్ తో. ఈ సినిమాలో మన హీరోయిన్ గారు రెండు ఈగల్ని పెంచుకుంటారు వాటి పేర్లు వేయించారు మన ప్రొడ్యుసర్ గారు అర్ధం కాని గ్రాఫిక్స్ తో ఎంతో అందంగా, అలాగే హీరో గారు పెంచుకునే రెండు నీటి ఏనుగుల పేర్లని కూడా. ఇలా ఒక్కో పేరు ఒక్కో రంగు అక్షరాలతో అందమైన గ్రాఫిక్స్ తో చివరి లైట్ బాయ్ వరకు ఎవరిని వదలకుండా అందరి పేర్లు రాయించారు మన ప్రొడ్యుసర్ గారు. ఈ విధంగా టైటిల్స్ ముగిసాయి. ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు మన హీరో ఎంట్రన్స్ గురించి. ఇంతలో ’విశ్రాంతి’ అని వచ్చింది. ప్రేక్షకులకి అర్ధం కాలేదు ఏమయిందో, ఇంతలో మళ్ళీ మొదలైంది.
ఆ హాల్లో తరువాత రిలీజు అయ్యే సినమా యాడ్, ముందు సీటు పై కాళ్ళు పెట్టరాదని, హాలు నీట్ గా వుంచాలని, ఎవరి వస్తువులపై వారిదే బాధ్యత అని, ఈ విధమైన యాడ్స్ అయ్యాక  మళ్ళీ మొదలింది సినిమా. కనీసం ఇప్పుడైనా సినిమాలోని ఏ కారెక్టర్ అయినా కనపడకపోతారా అని ఎదురు చూసారు ప్రేక్షకులు, కాని తెర మీద శుభం కార్డు పడింది. ఇక మన ప్రేక్షకులకి తిక్కెక్కి ఏమి అర్ధం కాక ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూండగా తెర మీద ప్రొడ్యూసర్ గారు ప్రత్యక్షమయ్యారు. 
   అయ్యలారా… అమ్మలారా… అందరికి నమస్కారం. నేను ఖర్చు పెట్టినదాంట్లొ సగమైనా నాకు వచ్చేట్టు చేసుకోగలిగాను. దీనికి ఇంత సహకరించినందుకు మీకు నా ధన్యవాదాలు. ఇప్పుడు నేను మీకు నాలుగు ముక్కలు చెప్పదలుచుకున్నాను. అందులో ఒకటో ముక్క సెన్సార్ దగ్గర నాలుగు సీన్లు కటింగండి. ఆ తరువాత  రెండో ముక్క ప్రివ్యు వేసామండి, దానికి వచ్చిన వాళ్లంతా కులం పేరుతొ కొన్ని సీన్లు, జంతు ప్రేమికులు వచ్చి వాళ్ళు కొన్ని సీన్లు, పిల్లలతో చేయించామని కొన్ని సీన్లు, క్లాసికల్ డాన్సర్స్ ని కించపరిచేలా వున్నాయని కొన్ని సీన్లు, లెక్చరర్ లని కించపరిచేలా వున్నాయని కొన్ని సీన్లు, పోలీసులు లాయర్లు డాక్టర్లు వీళ్లని కించపరిచేలా వున్నాయని వాళ్ళు కొన్ని సీన్లు, ఈ విధంగా ఎవరికి అడ్డు వచ్చిన సీన్లు వాళ్ళు కత్తిరించుకుంటూ పోయారండి. కానీ ఆ విశ్రాంతి కార్డు ఈ శుభం కార్డుల్ని మాత్రం ఎవరూ కత్తిరించలేదు అందువలన మీకు అవైనా చూపించే భాగ్యం నాకు కలిగినందుకు నాకు ఎంతో ఆనందంగా వుంది.. ఇక ఈ దెబ్బతొ నేను సినిమా పేరెత్తితే ఒట్టు. ఇప్పుడు వచ్చిన ఈ డబ్బుల్తో మా వూరైన తిక్కావారి పాలెం వెళ్ళి నాకున్న రెండెకరాల పొలం చూసుకుంటూ బతికేస్తాను. నమస్కారమయ్య…

జులై 16, 2008

భూలోకసమారాధన…

ప్రచురించిన వర్గము Uncategorized — pavani5 @ 9:25 పూర్వాహ్నం

సత్యలోకంలో నిద్రిస్తున్న బ్రహ్మకి కుడివైపు వున్న తల నెప్పి రావడంతో నిద్ర మెళకువ వచ్చింది. కళ్ళు తెరుస్తూనే భారతీ భారతీ అంటూ పిలిచాడు…
పక్కనే వీణ తీగలు సరి చేసుకుంటున్న సరస్వతి చిరాకుగా ఆయన వంక ఏమిటి అన్నట్టు చూసింది…
శిరోభారము అధికముగా వున్నది, ఏమయినా కాస్త ఔషధము తెచ్చి మర్ధనం చేయమనగా…
శిరోభారము కాక ఇంకేముండును…? ప్రతి దినము ఒకే పనియైన విసుగురాక ఏమి వచ్చును.. స్వామి నేను చెప్పేడిది వినుడు, నాకునూ ఈ పూవ్వులో కూర్చొని కూర్చోని కాళ్ళు పీకుచున్నవి, ఈవీణ వాయించీ వాయించీ చేతులు పీకుచున్నవి. కనుక మనము ఒకసారి  భూలోకమునకేగుదుము.. అచట బోలెడు వింతలువిడ్డూరములు వున్నవట. కావున ఒక్కసారి పోయివత్తుము..
సరస్వతీ నీకు తెలియనిది ఏమున్నది… ఈ దినమున పది లక్షల మానవులని సృష్టించవలసి వున్నది, కావున మరొకసారి యేగెదము… అటుల మూతి ముప్పది వంకర్లు తిప్పకుము..
నాధా అటుల కాదు, మీరు ఈరకముగా రోజు ఇంతమంది మానవులని సృష్టించిన యెడల భూలోకము ఏమగును.. ఇప్పటికే అచట మానవులతో భూలోకము కిటకిటలాడుచున్నది.. కనుక ఈరోజుకి  సృష్టి ఆపివేసి, మనము భులోకపయనమగుదుము… అని పట్టుపట్టడంతో చేసేది లేక భూలోకానికి పయనమయ్యెను బ్రహ్మ సరస్వతిలు…
భూలోకమున వారిరువురు  చూడవలసిన ప్రదేసాలన్నియూ చూసెను. సరస్వతీ దేవి ఆనందానికి అవధులు లేవు. మానవుల ఆనందం చూసి సరస్వతికి కించిత్ ఈర్ష్య కూడా కలిగింది. ఈ విధంగా భూలోకమంతా సందర్శించి అమితానందంతో తిరిగి సత్యలోకం పయనమయ్యారు..
తిరిగి ఎవరి విధుల్లో వారు నిమగ్నమయ్యారు. అయినా కూడా సరస్వతిదేవికి ఏదో తీరని లోటు. సమయము చూసుకొని బ్రహ్మతో… స్వామీ..! అని పిలిచెను,
బ్ర  :  ఈ మారేమి…..?? (బ్రహ్మ కి గుండెల్లో గుండ్రాయి పడింది)
స  : ఏమి లేదు నాధ…. ఆలోచించగా ఆలోచించగా… భూలోకమునందు మానవులు ఎందుకు అంత ఆనందంగా వుంటున్నారో నాకు అర్ధమయింది…
బ్ర  :  ఎందుకూ….??
స  :  ఏమీ లేదు ప్రభు… మానవులు తరచూ వారి వారి గృహములందు చిన్న చిన్న వేడుకలు జరుపుకొనుచు, బంధుమిత్రులను ఆహ్వానించి, అందరూ కలిసి ఒకేచోట భుజించి, వారి వారి కష్టసుఖాలని ఒకరికి ఒకరు పంచుకొనుచు ఆనందించుచున్నారు.. మనకి ఆ భాగ్యము లేదే అని చింతించుచున్నాను..
బ్ర  : అయిన ఏమి చేయుదుమో వివరించుము వాణీ..
స  : స్వామీ…! మనమూ మన బంధుమిత్రులని పిలిచి అలాంటి వేడుక ఒకటి జరపవలెనని నాకు కోరికగా వున్నది…
బ్ర  :  దేవి మానవులు మనల్ని పూజిస్తూ వ్రతాలు చేసెదరు, అవి మనం ఏల చేసెదము…??
స  :  నాధా వ్రతములన్నీయూ మనము కనిపెట్టినవే కదా.. కావున మరొక వ్రతము కనిపెట్టెదము..
బ్ర  :  వాగ్దేవి లెస్స పలికితివి భూలోకమున ఒక చలనచిత్రము నందు చెప్పినట్టుగా ’ఎవరూ కనిపెట్టకుండా మాటలు ఎలా పుడతాయని’… ఎవరూ కనిపెట్టకుండా వ్రతాలెలా పుడతాయి… అయినచో అదేదో నీవే చెప్పు భారతీ…
స  :  అటులైనచో మనము ’భూలోక సమారాధన’ అని ఒక వ్రతము చేసెదము ప్రభు..
బ్ర  :  బాగున్నది.. వెంటనే ఆచరించెదము.. అయిన నారదుడుని వెళ్ళి అందరికి ఆహ్వానం అందించి రమ్మని పంపెదము..
స  :  అటులనే స్వామీ.. కానీ ఆదినమునకు కావలసిన క్షీరమంతయూ విష్ణుమూర్తీ అన్నయ్యను  .. మరియూ ఆ శ్రీధర అన్నయ్యను గంగను పంపమని చెప్పుము…
ఆ రోజు రానే వచ్చింది… సత్యలోకమంతా చాలా హడావిడిగా వుంది, శివపార్వతులు, వినాయకుడు (ఫ్యామిలీ), కుమారస్వామీ (ఫ్యామిలీ), లక్ష్మీనారాయణులు, ఇంద్రుడుశచీదేవి, దిక్పాలకులు, మిగతా బంధుమిత్రులతో కిటకిటలాడిపోతోంది. ఎలాగైతేనేం వ్రతం పూర్తిఅయ్యింది. అంతా కలిసి ఆనందంగా విందారగించారు. ఆ తరువాత బ్రహ్మసరసతులు అందరికి పట్టువస్త్రాలు చందనతాంబూలాదూలు సమర్పించుకున్నారు. అందరూ వారి వారి కొండలకు పయనమౌతూ బ్రహ్మసరస్వతులను ఎంతో కొనియాడారు.. లక్ష్మీ పార్వతులైతే ఏకంగా సరస్వతిని ఎత్తేసారు.. ఇంత మంచి ఆలోచన వచ్చినందుకు, ఇలాగే మేము కూడా చేయకుతూహల పడుతున్నామని చెప్తూ, ఈ పట్టు వస్త్రములు చాలా బాగున్నవి అని అన్నారు.
స  :  భూలోకమునందు కళామందిరమని ఒక వస్త్రాలయమున్నది, మొన్న మేము పోయినప్పుడు చూచి అచటనుండి తెప్పించితిమి. అని చెప్పగా…
లక్ష్మీ పార్వతులు సంతసించి ఈసారి ఎవరింట ఈ వేడుక జరుపుకుందమా అని అలోచించుకుంటు వుండగా అక్కడ శివ నారాయణులకి, దేవేంద్రులకు గుండెల్లో యధావిధిగా గుండ్రాళ్ళు పడ్డాయి..
ఈవిధంగా ’భూలోకసమారాధన’ సమాప్తం…

నీతి: పావని బ్లాగు ఓపెన్ చేస్తే ఇలాంటి తలనెప్పి తప్పదని… :-)

మే 24, 2008

ఇది ఎక్కడి పోలిక …??

ప్రచురించిన వర్గము Uncategorized — pavani5 @ 6:37 పూర్వాహ్నం

“చూడడానికి మడోన్నాలా కనపడతావు …
కానీ నీలో కనపడని మదర్ థెరిస్సా కూడా వుంది”
ఇది కంత్రీ సినిమా డైలాగ్. జస్ట్ ఇప్పుడే టీవీలో ఛానల్స్ మారుస్తుంటే నా ఖర్మ కాలి ఒక ఛానల్ లో చూసా. ఇది విని నాకు ఏడవాలో ఆనందపడాలో అర్ధం కాలేదు. కానీ కోపం మాత్రం వచ్చింది. అసలు ఆ డైలాగ్ రాయడంలో ఆ రైటర్ గారి ఆలోచన ఏమిటో అర్ధం కాలేదు. నేను ఆ సినిమా చూడలేదు. ఏ సిట్యుయేషన్ లో హీరో గారు హీరోయిన్ గారిని మదర్ తో పోల్చారో నాకు అర్ధం కాలేదు. మీకెవరికైనా అర్ధం ఐతే దయచేసి నాకు చెప్పండి..

మే 23, 2008

ఓలమ్మో ఓలమ్మో…

ప్రచురించిన వర్గము Uncategorized — pavani5 @ 9:41 పూర్వాహ్నం

హాయ్ హలో నమస్కారం ….
మీరంతా ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్న మీ అభిమాన కార్యక్రమం “ఓలమ్మో ఓలమ్మో” తో మీ ’అశాంతీ’ ఈవారం కూడా ఎంతో అందంగా మీముందుకు వచ్చింది. ఈవారం మనముందు perform చేయడానికి మన సెలబ్రిటీస్ అందరూ రెడిగా వున్నారు. ముందుగా మన జడ్జిస్ ని ఇన్వైట్ చేద్దాం. ముందుగా ఒకప్పటి ప్రముఖ తార ’నాసి’ గారు, ’డింగరాల జక్రయ్య’ గారు  మరొక తార ’పిడతల వెంకు’ (పిడతల రాధ గా ఫేమస్ అయిన దన్నుశ్రీ గారి అమ్మగారైన పిడతల వెంకాయమ్మ గారు. ఆవిడని అభిమానులు అందరూ పిడతల వెంకు అని ముద్దుగా పిలుచుకుంటారు. ఈవిడకి కూడా అభిమానులు వుంటారా…? అని మీకు డౌట్ రావచ్చు, దాంట్లో అతిశయం ఏమీ లేదు. ఈవిడ కూడా ఆమే శక్తి మేరకు తను నటించిన చిత్రాలలో ఎంతో పొదుపుగా  నూటయాభై గ్రాముల బట్టలు మాత్రమే వాడేవారు. ఆ విధంగా ఈవిడ కూడా ఎంతో మంది అభిమానులని సంపాదించుకోగలిగారు.) గారిని కూడా వేదికమీదికి సాదరంగా అహ్వానిస్తున్నాం. sir please welcome …. madam please welcome …….

మన ఫస్ట్ సెలబ్రిటి ’చున్ కౌర్’ మనముందు  perform చేయ్యడానికి రెడీగా వున్నారు, కానీ అప్పుడే కాదు వాళ్ళు వచ్చేలోపు మనం తీసుకుందాం ఒక చిన్న బ్రేక్……. వెంటనే వచ్చేస్తాం ఇక్కడే వుండండి …… చూస్తూనే వుండండి ’గమిని టీవీ’ ……

  B-R-E-A-K

వెల్ కం బ్యాక్ టూ “ఓలమ్మో ఓలమ్మో” ….
ఇప్పుడు మనముందు  perform చేయ్యడానికి వచ్చారు ’చున్ కౌర్’ గారు, చెప్పండి ఏ సాంగ్ perform చేస్తున్నారు ….??
నేను ’లక్ష్యం’ మూవి నుండి ’ఎవడు ఎవడు’ అనే సాంగ్ చేయబోతున్నానండి …
ఓ …. చాలా మంచి పాట అది … ఆల్ ది బెస్ట్ చున్ … స్టార్ట్ చేస్తావా ….
ఓకె ..
స్టార్ట్ మ్యూజిక్ …..
దడక …. దడక …. డిడుమ్ … డిడుమ్ …. ఠంగ్ … ఠంగ్ ……..

వెరుజొవుత్వ్వ్వ్త్ప్౪ఉత్రెత్వెర్వ్ర్[వ్త్వె

(ఈ విధంగా కాసేపు మన సెలబ్రిటి వూగి వూగి అభిమానుల్ని కూడా వూగించేసింది.. అది చూస్తే నాకు అమ్మోరు జాతర గుర్తొచ్చింది)
చప్పట్లు [మీరూ.. కొట్టండి కాస్త (నన్ను కాదండోయి)]
exellent performance చున్, చాలా బాగా చేసారు. సరే మన జడ్జెస్ ఏమంటారో చూద్దాం ..
madam నాసి గారు చెప్పండి …

చున్ నిజంగా చాలా exellent గా చేసారు. మంచి పాట ఎన్నుకున్నారు. మంచి మీనింగ్ మంచి మెసెజ్ వున్న పాట ఎంచుకున్నారు. నిజంగా మూవిలో యాక్టర్స్ చేసినట్లే అసలు ఎక్కడా మిస్ అవకుండా చేసారు. చాలా బాగుంది … గుడ్ కీపిటప్ …

madam  పిడత వెంకు గారు మీరు చెప్పండి …

ఫస్ట్ అఫ్ ఆల్ ఐ వాంట్ టూ సే ఎబౌట్ యువర్ కాస్ట్యూమ్స్ చున్. నైస్ సెలక్షన్. చున్ నాకు నీ డ్రస్ చాలా నచ్చింది. ఆ సాంగ్ కి బాగా సూట్ అయింది. (రెండు జతల బూతద్దాలు పెట్టుకొని చూసినా మనకి ఆ డ్రెస్స్ కనపడదు. ఈవిడకి ఎక్కడ కనపడిందో… అంటే అప్పట్లో ఆవిడ కూడా అలాంటి డ్రెస్స్ లే వేసిందేమో, అందుకే ఆవిడకి కనపడి వుంటుంది …)

sir ఇప్పుడు మీరు చెప్పండి  ’డింగరాల జక్రయ్య’ గారు …

చాలా బాగుందమ్మ, మంచి ఫీల్ తో చేసావు. మంచి ఎనర్జీటిక్ గా వుంది. కీపిటప్, ఇంకొంచం ప్రాక్టీస్ చెస్తే ఇంకా బాగుంటుంది …

చూసాం కద ఇప్పుడు మన జడ్జెస్ అభిప్రాయాల్ని …
మన చున్ కౌర్ కి వచ్చిన మార్కులని చూద్దాం ..

madam నాసి గారు …
80 …
 
madam  పిడత వెంకు గారు …
85 …

sir …
75 …

ఇప్పుడు ఎస్ ఎమ్ ఎస్ రిక్వెస్ట్ … మన ప్రేక్షకులని ఎస్ ఎమ్ ఎస్ అడుగుతావా చున్ …
చూసారు కదా నా performance … నచ్చింది కదా … నచ్చేవుంటుంది … తప్పక నాకు మీ ఓటింగ్స్ తెలిపి నన్ను ఫర్ దర్ రౌండ్ కి పంపిస్తారని ఆశిస్తున్నాను. నాకు ఓట్ చేయాలంటే …..
********  ******* ఈ నంబర్ కి  ఎస్ ఎమ్ ఎస్ చేయండి. థ్యాంక్యూ …(బ్లాగర్లు కూడా ఓట్ చేయాలంటే వారీకి ఓట్ చేసే సదుపాయం కల్పిస్తాం)

ఇప్పుడు నెక్ష్ట్  సెలబ్రిటి వస్తున్నారు … కాని ఇప్పుడే కాదు …వాళ్ళు వచ్చేలోపు మనం తీసుకుందాం ఒక చిన్న బ్రేక్……. వెంటనే వచ్చేస్తాం ఇక్కడే వుండండి …… చూస్తూనే వుండండి ’గమిని టీవీ’ ……

  B-R-E-A-K

వెల్ కం బ్యాక్ టూ “ఓలమ్మో ఓలమ్మో” ….
ఆ ’అపుల్స్ రాణి’ ఏ సాంగ్ perform చేస్తున్నారు ….??
నేనూ రీమిక్స్ సాంగ్ చెయబోతున్నా …
ఓకె సాంగ్ చెప్పరన్నమాట డైరెక్ట్ గా చేస్తారా … చేయండి …
ఆల్ ది బెస్ట్ బాగా చేయండి …
స్టార్ట్ మ్యూజిక్ …..

టట్టడాంయి ….   టట్టడాంయి ….   టట్టడాంయి ….  ట ట ట ట …. టాఆఆఆఆఆ …..

 వ్తిఒజ్తొత్వ్జ్ర్వ్పౌత్వె,వెపిరెఉత్వొఎజ్ద్స్ద్,అస్;ఎఇఒవెపుత్వెనస్ద్మ్;అస్కెఉత్ర్
మ్న్ల్స్క్జ్వ్పివుర్వెఅస్మ్;అస్కెవెఉత్వె;అస్ద్వ్రివెజ్గ్ ….. జ్ ర్ ర్ర్ ర్ ర్ ర్ ర్  ఢాం ….. (ఒక్కసారి అంతా నిశ్శబ్దం ఏం జరిగింది …..???)

 అరేరే ……… ఏంటి అపుల్ ఏమైంది ….. అలా పడిపోయావు…
:-( 

ఓకే జడ్జెస్ ఏమంటారో విందాం ….
madam నాసి గారు చెప్పండి …

ఏంటి అపుల్ నేను నీ నుంచి చాలా ఎక్స్ పెక్ట్ చేసాను, స్టాటింగ్ చాలా బాగా స్టాట్ చేసావు. అసలు ఇవ్వాళ్ళ నీకేమయింది ….?? ఐ… ఐ… ఫెల్ట్ రియల్లీ… ప్చ్ ….. (అంతకన్నా ఇంగ్లీషు రాదు మనకి)

ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు madam, నిన్నంతా ప్రాక్టీస్ చేస్తూనే వున్నాను. నైట్ ఫుడ్ కూడా తీసుకోకుండా ఫుల్ కాన్ సన్ ట్రేట్ చేసాను. (గంగ గోదావరీ జలాలు కూడా ఆ డ్యాన్సు చూడడానికి వచ్చేసాయి. ఆవిడ కళ్ళలో అని  అర్ధమయ్యేవుంటుదనుకుంటా ….! వాళ్ళు బాగా చెయ్యలేదని ఏడుస్తారో, పక్కవాళ్ళు బాగా చేస్తారేమో అని ఏడుస్తారో, లేక మనల్ని బాగా ఏడిపించలేకపోయారని ఏడుస్తారో నాకైతే తెలియదు. మీకెవరికయినా తెలిస్తే కాస్త నాక్కూడ చెప్పండి..)

madam  పిడత వెంకు గారు మీరు చెప్పండి …

అశాంతి నేనేం చెప్పలేకపోతున్నాను … అపుల్ మీఇఇఇ సాంగ్ ఓకె బట్ డ్రెస్స్ కూడా కాస్త హెవీగా వుంది( ఇందాక సెలబ్రిటి కంటే ఈవిడ కాస్త రెండు గ్రాముల బట్టలు ఎక్కువగా వేసుకున్నందుకు మన పిడత కి హెవీగా కనపడిందనుకుంటా…!) ఓకె ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ….

:-(

సార్ మీరూ …

అపుల్ తప్పు జరిగిపోయింతర్వాత బాధపడి ప్రయోజనం లేదు. ఇప్పుడు మనం ఏమి చేయలేము కదా.. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోండి. బెస్ట్ ఆఫ్ లక్ …

:-(

(అసలు వీళ్ళు పడేది నిజంగానేనా లేక ప్రేక్షకుల సానుభూతి కోసమా… ఎస్ ఎమ్ ఎస్ లు వస్తాయనా …?)

మన అపుల్ కి వచ్చిన మార్కులని చూద్దాం ..

madam  పిడత వెంకు గారు …
అదీ… అశాంతీ మేము డిసైడ్ చేసుకున్నాం లాస్ట్ లో చెప్తాం మార్క్స్ … (ఇదొక బోడి టెన్షన్ మళ్ళీ మనకి…)

ఒకే… జడ్జెస్ టెన్షన్ లో పెట్టారు … మన ప్రేక్షకులు రెడీగా వున్నారు ఓటింగ్ చేయడానికి (ఎవరున్నారో…)  ఎస్ ఎమ్ ఎస్ రిక్వెస్ట్ అడుగుతావా …!

:-(  నా ముందు performances అన్నీ మీరు చూసారు, మొదటి నుండి నాకు ఓటింగ్ చేసి నన్ను ఇంత దూరం తీసుకొచ్చారు (ఎవరేసారో …?? వాళ్లకి వాళ్ళే వేసుకుంటారేమో…!), ఇలాగే ఇప్పుడు కూడా నాకు ఓట్ చేసి నన్ను ఫర్ దర్ రౌండ్ కి ప్రమోట్ చేస్తారని ఆశిస్తున్నాను. నాకు ఓట్ చేయాలంటే …….
********  ******* ఈ నంబర్ కి  ఎస్ ఎమ్ ఎస్ చేయండి. థ్యాంక్యూ …

ఎంతో భారంగా గడిచింది ఈ performance, అపుల్ చాలా నిరాశ కి లోనైంది, తను టెన్షన్ లో వుంది. ఓకె లాస్ట్ సెలబ్రిటి వచ్చేలోపు ఒక చిన్న బ్రేక్ తీసుకొని వద్దాం …

                                        B-R-E-A-K

వెల్ కం బ్యాక్ టూ “ఓలమ్మో ఓలమ్మో” ….

ఇప్పుడు లాస్ట్ సెలబ్రిటి ’మనురాయ్’ వస్తున్నారు …
మను ఏ సాంగ్ చేయబోతున్నావు …??
నేను డైరెక్ట్ గా చేసి చూపిస్తాను, చెప్పను…
ఏంటి ఇవ్వాళ్ళ అందరు సస్పెన్స్ లో పెడుతున్నారు. సరె టైం వేస్ట్ చేయకుండా మన మను  performance చూద్దాం. ఆల్ ది బెస్ట్ మను…

స్టార్ట్ మ్యూజిక్ …..

డం డమా డం …. టం టం టం ……. బం బం బ బ బం ….. తం తం త త తం …
ఓ… పిడతా…………
ఔననవమ్మ ప్రతి మగ జన్మ విసుగెత్తకముందే …. ఓ పిడతా…. నా పిడతా……..!

స్జ్స్న్ద్స్జ్వెఉరొవిఎస్చ్,దస్చ్కెప్విర్వెనస్దివెవెవ’దివెర్య్చ్క్లుఇఒఅఅసుఇర్హ్
ల్చ్ల్వెర్వ్య్త్వ్హ్వ్ద్స్న్చ్లస్క్దివెయ్వెన్ల్ద్ద్వ్ర్వెవద్విర్……..

చప్పట్లే చప్పట్లు ……………. చప్పట్లే చప్పట్లు ……………చప్పట్లే చప్పట్లు

(మీరు కూడా కొట్టడానికి రెడి అయ్యే వుంటారు… నన్ను.. తొందరగా రాసేసి పారిపోతా….)

హా…. మను ఎంత బాగా చేసావు, చూడు జడ్జెస్ అందర్నీ ఏదో లోకానికి తీసుకెళ్ళిపోయావు. తొందరగా వారిని ఈ లోకంలోకి తీసుకొద్దాం. ఈ పాట కి ఒక స్పెషాలిటి వుంది, అదేంటో తెలుసా (ఒక లీటరు చొంగ కారూస్తూ మాట్లాడుతారు మన యాంకర్లు)
ఆ అశాంతి తెలుసు ఈ సాంగ్ మన పిడతల వెంకాయమ్మ గారి డాటర్ నటించిన పక్షిగోపి అనే సినిమాలో పాట..
అది సరే … ఆ సాంగ్ ని నువ్వు  madam గారి ముందే perform చేసావు, నువ్వు ఎలా ఫీల్ అయ్యావు……
నాకు చాలా హాపీగా వుంది. కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాను… కానీ madam గారి ముందు చేయడం నాకెంతో హాపీ గా వుంది. ఇక ఈ ఓలమ్మో ఓలమ్మో టైటిల్ నాకు రాకపోయినా నేను ఫీల్ అవను. ఈ సంతోషం ముందు ఆ బాధ చాలా చిన్నది అని నా ఫీలింగ్ …

ఓకే మన జడ్జెస్ ఏమంటారో చూద్దాం..

 madam నాసీ గారూ మీరు చెప్పండి ….

exellent performance మను. అసలు ఎంత బాగా చేసావంటే చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు. చాలా బాగా చేసావు..

సార్ మీరు చెప్పండి …
మను ఎక్స్ ప్రెషన్స్ చాలా బాగుంది. మంచి ఈజ్ తో చేసావు, చాలా బాగా చేసావు. గుడ్ కీపిటప్…

ఇప్పుడు మన పిడత గారు చెప్పాలి …
అక్చ్యులగ నేను చెప్పాలనుకున్నవన్నీ వాళ్ళు చెప్పేసారు. నా ఒపినియన్ కూడా అదే.. ఓకే..
(వాళ్లమ్మాయి కంటే బాగా చేసిందని ఎలా ఒప్పుకుంటుందిలేండి…)

ఇప్పుడు మార్క్స్ ….

సార్…
95….
నాసీ గారు …
95…
పిడత గారు…
65 …

హాపీ నా మను, ఇంక మన ప్రేక్షకులని ఎస్ ఎమ్ ఎస్ అడుగుతావా …….

చూసారు కదండి, మీకు నచ్చే వుంటుంది నా performance. సో.. నాకు ఓట్ చేసి నన్ను పైకి పంపించండి..(పైకి అంటే ఎక్కడికో…….?)
********  ******* ఈ నంబర్ కి  ఎస్ ఎమ్ ఎస్ చేయండి. థ్యాంక్యూ … (ఏదో మొబైల్స్ కొనుక్కునేది వీళ్ళకి  ఎస్ ఎమ్ ఎస్ చేయడానికే అన్నట్టు చెప్తారు..)

అయిపోయాయి అందరి performances.. ఇక ఒకళ్ళు మాత్రం వెయిటింగ్ మార్క్ కోసం.. పాపం మన అపుల్ ఎంతో టెన్షన్ గా ఎదురు చూస్తోంది…
జడ్జిస్ చెప్పండి…

50….   50…….. 60…… (ఈ మార్కులేవో అప్పుడే చెప్పొచ్చు కదా … దీనికి సస్పెన్స్ ఒకటి ఎందుకో)

ఓకే అపుల్ హాపీనా ……
:-( థ్యాంక్యూ ….

ఒకే ఇవ్వాల్టి రౌండ్ కాస్త సరదాగా కాస్త టెన్షన్ గా సాగింది.. ఇక రేపు ఎలిమినేషన్ రౌండ్. ఇంకా టెన్షన్ గా వుంటుంది. మిస్ కాకండి. టేక్ కేర్… గుడ్ నైట్… కీప్ స్మైలింగ్….

బ్లాగర్లు కూడా ఓట్ చేసి వాళ్ళని గెలిపించగలరు…! ఎందుకంటే ఎంతో మంచి మెసెజ్ మంచి మీనింగ్ వున్న పాటలు మనముందు ప్రదర్శించారు  కదండీ ……

పాత టపాలు »

WordPress.com లో Blog పెట్టుము.