మొన్న Dr.Ram గారు చెప్పినట్టుగా చిన్ననాటి సంగతులు ఎన్నిసార్లు తలుచుకున్నా మధురంగానే వుంటాయి. అప్పుడు మనం ఎంత కష్టపడ్డా ఇప్పుడు గడుపుతున్న జీవితం కన్నా ఆ రోజులే చాలా బాగుంటాయి. ఏదైనా అనుభవించేటప్పుడు కన్నా, గుర్తు చేసుకునేటప్పుడే ఆ రోజుల విలువ తెలుస్తుంది.
మేము ఆరుగురు పిల్లలం, అమ్మా నాన్న. మాకు ఆస్తిపాస్తులు ఏమి లేవు. ఏరోజు వస్తువులు ఆ రోజే తెచ్చుకునే వాళ్ళం. కాక పోతే వూరి మొత్తానికి మేము ఒక్కళ్ళమే బ్రాహ్మలం కాబట్టి, ప్రతి సంవత్సరం కోతల సమయంలో ప్రతీ రైతూ వారి వారి పంట ఇంటికి రాగానే అందులోనుండి కొంత మాకు పంపేవారు.
ఆ విధంగా మాకు జొన్న, సజ్జ, వరిగ, శనగ, పెసర, మినుము, కంది, ఇలా కొన్ని రకాల ధాన్యాలు వాళ్లకి తోచినంత ఇస్తూవుండేవాళ్ళు. మా అమ్మ ఎక్కువగా జొన్న అన్నం వండేది (మా ఇంట్లో వరి అన్నం చాలా రేర్ గా వండేది అమ్మ) దాంట్లోకి దోసకాయ పప్పు చేసేది, ఆ రుచి ఇప్పటికి గుర్తే. సజ్జపిండిలో పచ్చిమిరప కారం ఉప్పు వేసి తప్పాలచెక్కలు చేసేది, వాటి రుచే రుచి. ఇప్పుడు అలాంటి వంటలు చేసే ఓపిక/వీలు వుండట్లేదు. ఒక వేళ శ్రమకోర్చి చేసినా తినేవాళ్ళు లేరు. ఎంతసేపటికి పిజాలు, బర్గర్, ఛాట్ అంటూవూంటారు ఈ కాలం పిల్లలు. ఇప్పటికే ఇలా వుంది, ఇక ముందు తరం వాళ్ళకి చపాతీ, పూరి లాంటీ రోజు వారి ఐటమ్స్ కూడా తెలియకుండాపోతాయేమో అని అనిపిస్తోంది.
మన ఈ software life లో పడి కొన్ని పండగలు కూడా మిస్ అవుతున్నాం. అందులో అట్లతద్ది ఒకటి. మా చిన్నప్పుడు ఈ పండగని ఎంతో సరదాగా చేసుకొనేవాళ్ళం, ముందు రోజే చెట్లకి వున్న గోరింటాకు కోసుకొచ్చి రుబ్బి పెట్టే వాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలకి. తద్దె రోజు పొద్దున్న ఐదింటికే అమ్మ మమ్మల్ని నిద్ర లేపేది. సుర్యోదయానికి ముందే చద్దన్నం, కందిపచ్చడి, ఆవకాయ, గడ్డపెరుగు వేసి అన్నం పెట్టేసేది.
ఆ ఒక్కరోజు మాత్రం మాకు తమలపాకులు వేసుకునే అవకాశం వుండేది. ఇక దొరికిందే ఛాన్సు అని మేము మేకలు నమిలినట్టు బోలెడు ఆకులు వేసుకునే వాళ్ళం. ఆ రోజు మాత్రం మాకు ఏపనులు చెయ్యాల్సిన అవసరం వుండేది కాదు. మా పెరట్లో రెండు పెద్ద వేపచెట్లు వుండేవి, తెల్లవారేటప్పటికి ఆ రెండు చెట్లకి ఉయ్యాలలు వేసేవాళ్ళు అన్నయ్యలు. ఇంక పొద్దున్న ఎనిమిదింటికి మొదలు పెట్టిన ఆటలు సాయంత్రం చీకటిపడేదాకా ఆడుతూనే వుండేవాళ్ళం. ఇంట్లో ఎవరేం చేస్తున్నారో పట్టకుండా ఉయ్యాలలు వూగుతూనే వుండేవాళ్ళం.
నా వీరబాదుడు మీకు బోర్ కొడుతోందేమో….! కాని నాకు మాత్రం చిన్నప్పటి విషయాలు గుర్తుకొస్తే మీతో పంచుకోవాలనిపిస్తుంది. అందుకే ఇలా మీ మెదడు తింటున్నాను. సహనంతో చదువుతారని ఆశిస్తూ… మళ్ళీ మరోసందర్భంలో కలుస్తాను.
ఏప్రియల్ 17, 2008
నా వీరబాదుడు – 4
ఏప్రియల్ 12, 2008
టీ.వి ఎమర్జన్సీ
నమస్కారం నేను వామన రావు న్యూస్ @ 7am కి స్వాగతం.
వార్తల్లోని ముఖ్యాంశాలు:
మరో రెండు వారాల్లో రాజకీయ ప్రవేశం చేయనున్న అంజన్ కుమార్..
ప్రేమ కోసం మౌనవ్రతం చేస్తున్న మూగ బాలిక..
ఇంద్ర బాబు రాష్ట్రంలో వడగాలి పర్యటన..
రాజధాని లో కలకలం సృష్టించిన రాగి చెంబు..
ఐదు పెళ్ళిళ్ళు చేసుకొని, దర్జాగా ఆరో పెళ్ళికి తయారైన నిత్యపెళ్ళికొడుకు..
ప్రపంచ చిత్రాలన్నీ తోసిరాజని విజయఢంకా మోగిస్తున్న సినిమా “తొడ గొట్టు”..
వంగుళ్ళు- దూకుళ్ళులో త్రుటిలో చేజారిన నేషనల్ ఛాంపియన్ కప్..
వార్తల్లోకి తొంగి చూస్తే….
రాజకీయాల్లోకి వస్తాను వస్తాను అంటూ అభిమానుల్ని వూరించి, ఎప్పటిలాగానే మళ్ళి వాయిదావేసిన అంజన్ కుమార్. మరో రెండు వారాల్లో తమ పార్టీ గుర్తు వెల్లడిస్తామని మరవింద్ కుమార్ అంటున్నారు.
ఇప్పుడొక చిన్న బ్రేక్ తీసుకొని వెంబడే వస్తాం, చూస్తూనే వుండండి నిరంతర వార్తా గంగ టి.వీ ఎమర్జన్సీ ..(జీవితాంతం మనకి బ్రేక్ వుండదు)
add 1: ( ఈ యాడ్ పోష్ట్ చివరిలో మీకోసం)
వెల్ కం బ్యాక్ టూ న్యూస్ ..
ప్రేమ కోసం మూగ బాలిక చేస్తున్న మౌనవ్రతం. మూగబాలిక మౌనవ్రతం ఏంటని అనుకుంటున్నారా..?? ఆ వివరాల్ని మనకి వివరించడానికి చప్పుడు పాలెం నుండి మా విలేకరి గొట్టం గోవిందం లైన్ లో వున్నారు.
హలో గో.గో..
హలో వామనా..
హలో గో.గో వినిపిస్తోందా..
హలో వాము హలో
ఆ చెప్పండి గోట్టం, అక్కడ తాజా పరిస్థితిని వివరించండి ..
………………………
వాము ఇక్కడ అంతా గందరగోళంగా వుంది. వూరి జనం అంతా బాలిక ఇంటి దగ్గరే వున్నారు. తిండి తీర్ధం లేకుండా. ఎవరిని కదిలించినా కూడా కళ్ళనీళ్ళ పర్యంతం అవుతున్నారు. (మాట్లాడడానికి అమ్మాయి నిరాకరించడంతో) మనం ఇప్పుడు అమ్మాయి తల్లితో మాట్లాడుదాం.
గో.గో: అమ్మా చెప్పండి అసలు ఈ గొడవకి కారణం ఏంటి..?
తల్లి: కొడకా ఏం చేతు దానికి పోయేరోగం అచ్చింది. ముందుగాల్ సంది సెప్తున్నా ఇనలే.
గో.గో: అమ్మా అసలు మూగ అమ్మాయి మౌనవ్రతం ఏంటి..?
తల్లి: మా పిల్ల రోజు ఆకలేస్తే “మె మె మ్మ – బె బె బ్బ” అంటుండే బిడ్డ, రెండు దినాల సంది గది కూడ అంటలేదు. ఎంత చెప్పినా ఇంటలేదు.
ఆ పోరడు యాడుండాడో ఏమో.
వాము అదీ సంగతీ ఆ అబ్బాయి కనపడితే మక్కెలు విరగొడ్తామని వీళ్ళు అంటున్నారు, కనపడితే ఎక్కడ మక్కెలు విరగొడ్తారో అని వాడు పారిపోయుంటాడు.
మరింత తాజా సమాచారంతో మళ్ళీ మీముందుంటాను. కెమేరామెన్ డబ్బాతో గొట్టం గోవిందం..
థ్యాంక్యూ గొట్టం,
ఇంద్రబాబు నిన్న రాష్ట్రంలో వడగాలి పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రసవిస్తూ సారి ప్రసంగిస్తూ ఆయన అధికారంలోకి వస్తే ప్రజలని, రాష్ట్రాన్ని అభివృధి బాటలో నడిపిస్తానని వాగ్దానం చేసారు.
* ఓటరుకి ఒక ఇల్లు
* ఒక కారు
* ఒక టి.వీ
* ప్రతీ నర్సరీ అబ్బాయికి, అమ్మాయికి ఒక లాప్ టాప్
వీటితో పాటుగా ఒక భూతద్దం ( దాంతో అవన్ని చూసుకోవడానికి)
ఇప్పుడొక చిన్న బ్రేక్..
news 60sec
< మురికిపాలెంలో భూతగాదాల్లో దాయాదుల పోరు
< పుల్లేటికూరులో ఒక అమ్మాయి కోసం అన్నదమ్ముల పోరు
< చెత్తచెరుకుపాడు దగ్గర్లో రెండు సైకిళ్ళు ఢీకొని హరీమన్న కుక్క ప్రాణాలు
వెల్ కం బ్యాక్ టూ న్యూస్….
రాష్ట్రంలో ఒక రాగి చెంబు కలకలం సృష్టించింది. సచివాలయం దగ్గర న్యూస్ కవరేజ్ కి వెళ్ళిన టీ.వీ ఎమర్జన్సీ విలేకర్లకి బోర్లించివున్న ఒక రాగిచెంబు కనపడింది, అది ఎవరిదా అని అరా తీస్తే ఎవరూ మాది కాదంటే మాది కాదన్నారు. అప్పుడు పోలీసులకి ఫోన్ చేయగా వారు బాంబ్ స్క్వాడ్ తో సహా వచ్చి తనిఖీలు నిర్వహించారు. కాని ఎక్కడా ఏ ఆధారాలు దొరకలేదు. ట్రాఫిక్ స్థభించి పోయింది, ఆ ప్రాంతమంతా ఆందోళనతో నిండిపోయింది. అలా నాలుగు గంటలు గడిచిన తర్వాత కలకలం రేపిన ఆ చెంబు ఒక ముష్టి వాడిదని తేలింది.
దాంతో అంతా వూపిరి పీల్చుకున్నారు.
నిన్నటిదాకా అతడొక మర్యాదస్తుడు నేడు అతడి నిజస్వరపాన్ని వెలుగులోకి తెచ్చిన టీ.వీ ఎమర్జన్సీ. ఐదు పెళ్ళిళ్ళు చేసుకొని ఆరవ పెళ్ళికి సిద్దపడ్డ ఆ నిత్య పెళ్ళికొడుకు అరాచకాన్ని టీ.వీ ఎమర్జన్సీ విలేకర్లు బయట పెట్టారు. అతడికి శిక్షపడేలా చేసారు. శిక్ష పడ్డ ఐదు నిమిషాల్లో బెయిల్ పై విడుదలై తన ఘనతను చాటుకున్న ఆ నిత్యపెళ్ళికొడుకు.
B-R-E-A-K
ఈవారంలో విడుదైన సినిమా “తొడగొట్టు” నిజంగానే తొడగొట్టింది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న అభిమానులని ఆనందపరిచింది. ప్రపంచ స్థాయిలో మొదటి ఐదు స్థానాల్లో పోటీ చేస్తున్న సినిమాల్లో ఇది ఒకటి. మొదటి వారంలోనే ఈసినిమా కలక్షన్స్ సినిమా ప్రొడ్యూసర్ నాలుగు అపార్ట్ మెంట్ లకి ఓనర్ని చేసింది. ఆ ఆనందంలో నిర్మాత మరవింద్ మూర్ఛపోయి ఇంకా తేరుకోలేదు.
ఇంటర్ నేషనల్ లెవల్ కి దూసుకుపోతుందనుకుంటున్న సమయంలో, గెలుపు ముంగిట చతికిలపడి తృటిలో విజయం చేజార్చుకుని ఏడుపు మొహం ఈడుపు కాళ్ళుతో ఇంటిదారి పట్టిన క్రీడాకారులు. దీని మీద ఫుల్ రిపోర్ట్ కాసేపట్లో….
ఈ విధంగా ఏ న్యూస్ ఛానల్ చూసినా అరగంటకొకసారి same news..
వాళ్ళు మాత్రం ఏం చేస్తార్లేండి 24hrs న్యూస్ చెప్పాలంటే అన్ని న్యూస్ ఎక్కడి నుండి వస్తాయి.
బ్లాగర్లందరికి “శ్రీ రామనవమి” శుభాకాంక్షలు…
ఏంటండీ ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నారు….???
ఓహ్ యాడ్ గురించా…
ఇదంతా చదివింతర్వాత కూడా ఇంకా యాడ్ కూడా చూడాలనుకుంటున్నారంటే… ఓకే మీ కోసం యాడ్.
” మీరందరు నా ఒక్కో పోష్ట్ రెండు మూడు సార్లు చదివి, చదివి వదిలేయకుండా తప్పకుండా ఎన్ని సార్లు చదివారో అన్ని సార్లు కామెంట్లు ఇస్తారు. తప్పకుండా ఇస్తారు దానికి మీరే -సాక్షి-”
ఏప్రియల్ 11, 2008
నా వీరబాదుడు – 3
ఇక రోజూ పొద్దున్నే అమ్మ ఆరింటికే నిద్ర లేపేది. నిద్ర లేవాలంటే ఎంత బద్దకమంటే……. కళ్ళు తెరవాలనిపించేది కాదు. కాని లేచిందాక అమ్మ వూరుకొనేది కాదు. అప్పుడప్పుడు దెబ్బలు కూడా పడేవనుకోండి. ఇక లేచి కాఫి పొడి తేవడానికి సీతారవమ్మ కొట్టుకు వెళడానికి బయటికి రాగానే పిచ్చుకల అరుపులు, కాకుల గోల, పశువుల అరుపులు వాతవారణాన్ని ఎంతో అహ్లాదపరిచేవి, ఇప్పుడు పిచ్చుక అరుపు విందామన్నా ఎక్కడా వినపడట్లేదు. ఒకపక్క ఆడవాళ్ళు బిందెలతో, మగవాళ్ళు కావిళ్ళతో నీళ్ళు తీసుకేళ్తూ చాలా హడావిడిగా వుండేది. పిచ్చుకలు అంటే గుర్తు వచ్చింది ఒకసారి నాకు ఒక పిచ్చుక గూడు దొరికింది దాన్ని ఎంతో జాగ్రత్తగా ఇంటికి తెచ్చాను. దాంతో చాలా రోజులు ఆడుకున్నాను.
ఇక మా వూరిలో పండగ వచ్చిందంటే ఆ హడావుడి అంతా ఇంతా కాదు. ఇప్పుడు వచ్చేది “శ్రీరామనవమి” కాబట్టి దాని గురించి చెప్పాలనుకుంటున్నా.
ఓపిగ్గా చదవండి…
నవమి నాలుగు రోజులు వుంది అనంగానే, గుడి ముందర రెండు వీధుల దాకా పెద్ద పందిరి వేసేవాళ్ళు. అంతకన్నా ముందు గుడికి సున్నాలు కొట్టించండం, గుడి తలుపులకి, గడపలకి రంగులు వేయడంలో వూరి జనాలు హడావిడిగా వుండేవారు. ఇక మేము దేవుడి విగ్రహాలను శుభ్రపరచడంలో మునిగిపోయేవాళ్ళం.
ఎండు వరిగడ్డి తెచ్చి కాల్చి బూడిద చేసి, సీతరావమ్మ కొట్టులోంచి చింతపండు సన్ లైట్ సబ్బు తీసుకొచ్చి విగ్రహాలను శుభ్రం చేసి, సన్ లైట్ సబ్బుతొ దేవుడి వస్త్రాలను శుభ్రం చేసేవాళ్ళం (మార్చినప్పుడల్లా ఆ వస్త్రాలని వుతికేవాళ్ళం). ఆ రాత్రికి నాన్న దేవుళ్ళకి అలంకారం చేసేవారు.
తెల్లవారగానే నవమి రోజున కళ్యాణం. పొద్దున్నే ఐదింటికల్లా “ఐదు మానికల” పెసరపప్పు నానపోసి వడపప్పు చేసేవాళ్ళు ( అందులో ఉప్పు కారం మామిడి తురుం కలిపేవాళ్ళు) అది చూడగానే మాకు అదే తినాలనిపించేది కాని అమ్మ మడితో చేసిన ప్లేయిన్ వడపప్పు మాత్రమే పెట్టేది. ఐదు డ్రమ్ముల పానకం. ఆరోజు వూరి జనం మొత్తం గుడిదగ్గరే వుండేవాళ్ళు. కళ్యాణం తీర్ధ ప్రసాదాల కార్యక్రమాలు అయ్యేసరికి సాయంత్రం నాలుగు ఐదు అయ్యేది, ఇక అప్పుడు మాకు భోజనాలు.
ఇక రాత్రికి వూరేగింపు. ఆ వూరేగింపు రాత్రి పదింటికి మొదలైయ్యేది. పది అంటే మరీ నమ్మలేనట్టుగా వుంది కదండి, కాని మా వూళ్ళోవాళ్ళు ఎనిమిదింటికి మొదలు పెట్టేవారు వూరేగింపుకు కావలసిన బండీని తయారు చేయడం. బండీని ఒకరి తెచ్చి ఎద్దుల్ని ఇంకొకరు తెచ్చి బండీమీద బల్ల ఇంకొకరు తెచ్చి మొత్తానికి పదింటికల్లా తయారు చేసేవాళ్ళు.మేళతాళాలతో వూరేగింపు మొదలయ్యేది. ఆ బండీలో రెండు మూడుసార్లు నేను వెళ్ళేదాన్ని నాన్నతో.
ప్రతీవీధి దగ్గర ఆగుతూ అందరీ హారతులు అందుకొని తిరిగి గుడికి చేరుకోనేసరికి తెల్లవారి ఐదయ్యేది. ఆ బడలిక వూరందరికి రెండు రోజులదాకా వుండేది. తర్వాత ఐదవ రోజు వసంతాలు ఆడేవాళ్ళు. ఆ తర్వాత పదహారు రోజులదాకా ఆ పందిళ్ళు అలాగే వుంచేవాళ్ళు, అన్నిరోజులు ఆ పందిళ్ళలోనే మా ఆటలు.
నాకు గుర్తు వున్నంతమటుకు చెప్పానండి, బోర్ కొట్టించుంటే క్షమించండి. కాని ఆ రోజుల్లో పండగలు వస్తే బంధువులు అంతా కలిసి ఆనందంగా జరుపుకొనేవారు. ఇప్పుడు ఆ ఒక్కరోజు కూడ బంధువులని కలవడానికి టైం వుండట్లేదు, టైం వున్నా ఒకరికొకరికి పడదు. మళ్ళీ ఆ మంచి రోజులు వస్తాయో రావో. వస్తాయనే ఆశిద్దాం.