పాములనాయుడు కి ఎన్నో రోజుల నుండి మొబైల్ కొనాలని ఆశ. ఎందుకంటే తన ఫ్రెండ్ జక్రయ్య ఎప్పుడు మొబైల్ లో మాట్లాడుతూ తెగ ఫోజులు కొడుతూండటం చూసి ఎలాగైనా తను కూడా మొబైల్ కొనాలని నిశ్చయించుకున్నాడు పాముల్నాయుడు. ఇక ఆలశ్యం చేయకుండా మొబైల్ కొనేసాడు. ఇక అప్పటి నుండి మొదలయ్యాయి కష్టాలు మన పానా కి…
ఏనాడైతే కొన్నాడో ఆ రోజు నుండి శని పట్టుకుంది. ఆరోజు ఫస్ట్ కాల్ శుభప్రదంగా వుంటుందని సాయిబాబా గుడికి కాల్ చేద్దామని నంబర్ నొక్కాడు. మన పానా ఫోన్ రింగ్ అవుతూండగానే సాయిబాబా దండకం చదువుకుంటూ అవతల వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయాగానే…
ఆ హలో నమస్కారమండీ… ఈ రోజు ఎన్నింటిదాకా వుంటారు మీరు అని అడిగాడు.
అవతలి వ్యక్తి, ఆ సాయంత్రం దాకా. తర్వాత ఆ అవతలి వ్యక్తి అడిగాడు మన పానా ని, సార్ ఎన్నింటికి వస్తారు, ఎందుకంటే ఇక్కడ ఏర్పాట్లు చెయ్యాలి కదా.
ఏర్పాట్లా…..! ఓహో పూజ గురించేమో అనుకొని సాయంత్రం ఆరింటికి వస్తాం అన్నాడు.
సరే సార్ కాని ఆరు దాటితే ఇక్కడ నేను వుండను వేరే అతను వస్తాడు డ్యూటీకి అనగానే మన పానా కి ఏమి అర్ధం కాలేదు. అదేంటండి మీరే కదా అక్కడ ప్రధాన పూజారి అని అన్నాడు… పూజారా…??? ఏందయ్యో నేను ఎవరనుకుంటున్నా….??
పానా కి ఏమి అర్ధం కాలేదు సార్ ఇది సాయిబాబా గుడేనా అని అడిగాడు(అవతలి వ్యక్తి ఎవరో అడిగి తెలుసుకోవాలనే ఆలోచన అప్పుడు వచ్చింది మన హీరో కి). కాదయ్యో ఇది శ్మశానం కదూ, నేను కాటికాపరి కదూ అన్నాడు. మన వాడికి మతి పోయి తనని తాను లక్షబూతులు తిట్టుకొని ఫోన్ పెట్టేసాడు… అలా ఫస్ట్ కాల్ ప్రహసనం సాగింది…
ఇలా లాభం లేదనుకొని ఆ రొజు ముహూర్తం బాలేదనుకొని ఆరోజుకి వదిలేసి మొబైల్ ని మూట కట్టేసి బీరువాలో పెట్టేసాడు మన పానా.. మర్నాడు ముహూర్తం చూసి అలాగే వర్జ్యంకూడ చూసి సెల్ ఫోన్ బీరువాలో నుండి తీసాడు. తీసితీయగానే ఫోను రింగ్ అయ్యింది. పానా ఎక్కడలేని ఆనాందంతో ఫోను తీసి హలో అన్నాడు…
అవతలి నుండి ఒక అందమయిన గొంతు నవ్వూతూ హలో అంది..
పానా ఇక ఆనందానికి అవధులు లేవు. ఆ గొంతు వినే సగం పడిపోయాడు. హలో ఎవరూ అన్నాడు..
నా పేరు శ్రీవీరవెంకటసూర్యకాంతనాగరాజసాయిదుర్గవిజయకనకమహలక్ష్మి … అని చెప్పగానే పానా బ్రెయిన్ పూర్తిగా పోయింది.. రెండు నిమిషాలు పట్టింది తిరిగి మామూలు మనిషి అవడానికి. మళ్ళి పొరబాటున ఎవరండి అని అన్నాడు అంతే ఆలస్యం అడిగిందే తడవుగా మళ్ళీ ఆవిడగారు మొదలుపెట్టి చెప్పారు నా పేరు శ్రీవీరవెంకటసూర్యకాంతనాగరాజసాయిదుర్గవిజయకనకమహలక్ష్మి …
ఆపేరువినగానే, వామ్మో ఏందమ్మా ఇంతపేరు అంటే… హిహిహిహి అది మాఅమ్మమ్మ పెట్టిన పేరండి. నాకు చాలా ఇష్టమైన పేరు. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నాపేరు పూర్తిగా పిలవండీ నాకుచాలా హేపీగావుంటుంది అంది. నీ హేపి తుంగలొ తొక్క దానిసంగతి తరువాత చూద్దాం, ముందు నాసంగతిచూడు అన్నాడు.
ఆవిడగారు సిగ్గు పడుతు చెప్పండి సార్ ఏమిటి మీప్రాబ్లెం అంది. నేను చెప్పేదేంది నువ్వే కదా ఫోన్చేసింది… ఆ మర్చిపోయాను సార్, మీ మొబైల్ బిల్ నాలుగు వేల ఏడు వందల డెభైనాలుగు రూపాయలు వుంది, లాస్ట్ డేట్ కూడా అయిపోయింది. ఇవ్వాళ్ళ పే చెయ్యకపోతే రేపు మీ ఫోన్ కట్ అవుతుంది.
ఏందీ నేను ఫోన్ బిల్లు కట్టాలా… ఏందమ్మో నేను ఫోన్ కొన్నదే నిన్న, దాని శిగతరగ ఏదో కొత్త ఫోన్ ముందుగా దేవుని దీవెన తీసుకుందామని నిన్న చేసిందే ఒక్క ఫోన్ అది కూడా యాడికో శ్మశానానికి పోయింది. దానికి నాలుగు వేల ఏడు వందల డెభైనాలుగు రూపాయలా… మతి వుండే మాటాడుతున్నావా..??
అయ్యో సార్ మీరు ఈ ఫోన్ తీసుకొని ఆరు నెలలు అయ్యింది కదండీ… ఈ బిల్ల్ లాస్ట్ మంత్ కట్టాల్సింది.
ఏంది ఆరు నెలలా…..! ఎవరు చెప్పారు నీ అమ్మ మొగుడు. చెప్పిన సోదంతా విని మళ్ళీ అదే వాగుతావ్.
అయ్యో అలాగా సార్ మీపేరు చెప్పండి…
అమ్మా…..
సార్ కాల్ మీ శ్రీవీరవెంకటసూర్యకాంతనాగరాజసాయిదుర్గవిజయకనకమహలక్ష్మి …
నా బొంద అదే అదే చూడు తల్లీ నాపేరు పాముల నాయుడు…
ఏంటి సారు ఆ పేరు… అంటే మీరు పాములు పట్టుకుంటుంటారా….??
ఏందమ్మో నువ్వు పెట్టుకోలా కొండవీటి చాంతాడంత పేరు, అయినా పని చూడమ్మా…
కానీ సార్ ఇక్కడ పవన్ అని వుందే… ఒకసారి మీఅడ్రస్ చెప్పండి సార్…
అన్నికాయితాలు ఇచ్చిచచ్చాను కదమ్మా ఫోన్ తీసుకునేటప్పుడు. మళ్ళి ఇప్పుడు ఈ సోది ఏంది…
సార్ ఒక్కసారి చెప్పండి …
చూసుకో చెప్తున్నా… ఇంటి నంబరు 420, వీధి నంబరు 210, పీతగుంట్ల పాలెం, చాలామ్మ…
సార్ సారీ సార్ ఒక్కసారి మీ నంబర్ ఇదేనా చూడండి… **********
అమ్మా నా నంబర్ అది కాదు, ముందు నంబర్ సరిగ్గా చూసుకొని చేసుకోండి ఫోన్లు.. ఇంత సేపూ నా బుర్ర తినేసి ఇప్పుడు సారి అంటావా… పెట్టెహె సోది…..
ఇక లాభం లేదనుకొని ఫోన్ తీసుకొని తప్పు చేసాననుకొన్నాడు పానా. ఇంతలో మళ్ళీ ఫోన్ రింగ్ అయ్యింది కానీ పానా కి ఫోన్ తీయాలనిపించలేదు. ఫోన్ అంటే నే విరక్తి వచ్చేసింది పాపం. కానీ మళ్ళీ ఏదో చిన్న ఆశ ఈ సారైనా సరైన కాల్ వస్తుందేమో అని… ఆ ఆశతో మళ్ళీ ఫోన్ తీసాడు, హలో అన్నాడు…
హలో యాదయ్యా నేను ఇక్కడ సికింద్రాబాదు లో వున్నాను, కుకట్ పల్లి వెళ్ళాలి అర్జెంట్ గా ఆటో తీసుకొని వస్తావా…??
ఏందయ్యా నువ్వెవరూ…. ఈ యాదయ్య ఎవరూ…… ఈ ఆటో గోల ఏంది……
హలో నువ్వు యాదయ్యవి కావా….?? ఇది చిలకలగూడా కాదా….??
కాదు ఇది పీతగుంట్ల పాలెం…. నేను యాదయ్యను కాను…. పెట్టెయ్ ఫోన్..
ఆ ఫోన్ పెట్టీపెట్టక ముందే మళ్ళీ ఫోన్ రింగ్……. పానా కి ఫోన్ ఎత్తికొట్టాలన్నంత కోపం వచ్చింది.. కానీ ఆఫోన్ కి పెట్టిన డబ్బులు కనపడ్డాయి కళ్ళముందు.. ఏమి చెయ్యలేక మళ్ళీ ఫోన్ తీసి హలో అన్నాడు ఏడుపు మొహం తో…
అవతలి వ్యకి హడావిడిగా… సార్ సార్ మీరు అర్జెంటుగా బయలుదేరి ఇక్కడికి రావాలి.
పానా గుండెలు జారి పోయాయి ఆ వ్యక్తి హడావిడి చూసి.. యవరయ్యా నువ్వు ఏమయింది…? యాడికి రావాల నేను…?
సార్ ఇక్కడ మీ ఆవిడకి పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. తొందరగా రండి మీరు…….
మా ఆవిడకా … యాక్సిడెంటా…..
అవునండి, ఆవిడ ప్రాణాపాయ స్తితిలో వున్నారు. అపోలోలో చేర్చాము, ఆవిడ బ్యాగులో మీ నంబర్ చూసి మీకు ఫోన్ చేస్తున్నాను మీరు తొందరగా రండి…
నీ అబ్బరేయి… నాకింకా పెళ్ళే కాలేదురా. నంబర్ చూసుకొని చెయ్యండిరా. పెట్టెయి ఫోన్….
దాంతో పానా ఒకటే నిశ్చయించుకున్నాడు. తెల్లారగానే మొబైల్ తీసుకెళ్ళి ఆ జక్రయ్యకి గిఫ్ట్ గా ఇద్దామని. అప్పుడు కాని వాడి తిక్క కుదరదని అనుకొని మళ్ళి ఆ ఫోన్ ని బీరువాలో పెట్టాడు. అంతకు ముందు నుండి పొయ్యిమీద మసిలి పోతున్న నీటిని తీసుకొని హాయిగా స్నానం చేసి, బువ్వ తిని బజ్జున్నాడు…
జులై 31, 2008
పాములనాయుడు… సెల్ ఫోన్…
జులై 28, 2008
పధకం శ్రీ…
మన ప్రభుత్వం మనకి ఈమద్య చాలా పధకాలు ప్రకటిస్తోంది వాటిలో కొన్ని …
ఆంధ్రరాష్ట్ర్ర ప్రజల ఆరోగ్యదృష్ట్యా ఆరోగ్య శ్రీ…(చాలా ఆరోగ్యంగా వున్నారు ప్రజలు డెంగ్యూ, మలేరియాలతో…)
పేదప్రజల కోసం చౌక శ్రీ … (ఇంతకు ముందు ముప్పై రూపాయలు వుండే కంది పప్పు ఇప్పుడు నలభై నాలుగురూపాయలు ఎంత చౌకో…)
గూడు లేని ప్రజల కోసం రాజీవ్ శ్రీ…(రాజీవ్ గృహకల్ప …. కట్టడం ఎప్పటికయ్యోనో…)
రైతుల కోసం మందు శ్రీ …(మందులు చేల కన్నా రైతులు ఎక్కువగా వాడుతున్నారు…)
పిల్లల కోసం చదువు శ్రీ…(ఈపధకం వల్ల తల్లిదండ్రులకి బాగా ఖర్చుపెట్టే అవకాశం ఎంతో…)
శ్రామికుల కోసం సారా శ్రీ …(దీనివల్ల తాగి తూగటం తప్ప ఉపయోగం ఏమిటో…)
మహిళల కోసం పావలా శ్రీ…(ఈ పావలా వెనక కధ ఉహు…)
వృద్దుల కోసం పింఛను శ్రీ…(ఈపధకం కోసం తిరిగి తిరిగి వృద్దుల పాట్లు ఎన్నని…)
ప్రయాణీకులకోసం ఆటో శ్రీ…(మార్చిన ఆటో మీటర్ల వల్ల ఎవరికి లాభం…)
యువతకోసం పబ్బు శ్రీ…(పబ్బు కల్చర్ అసలు అర్దం కావట్లేదు…)
ప్రతిపక్షాల కోసం తిట్లు శ్రీ…(ఇవి మాత్రం అక్షయ పాత్రలాగ ఎప్పటికి అయిపోవు…)
కేంద్రంకోసం రుణం శ్రీ…(కేంద్రానికి రుణం ఇస్తారని కాదు తీసుకుంటారని…)
వంటింటికోసం గ్యా శ్రీ…(బుక్ చేసాక నెల రోజులకి వస్తే గ్రేటే…)
కరెంటు కోసం వరుణ శ్రీ(అబ్బో ఎన్నియాగాలో….)
ఇన్నిపధకాలు మన కోసం పంచి తన కోసం పదవిశ్రీ ని మాత్రమే ఉంచుకొన్న మహానుభావుల్ని అభినందిస్తూ…..ఈపధకాలు అన్ని కూడ వాడుకుంటు మనం మాత్రం మన ఓటుశ్రీ ని వారికే వేసి గెలిపిద్దాం….
ఇది ఎవరిని కించపరుస్తూ రాసిందికాదు జస్ట్ ఫన్ కోసం
జులై 25, 2008
రాయని కధ…
అరోజు లేస్తూనే నాకోఆలోచన వచ్చింది ఒక కధ రాద్దామని. నాకు ఎన్నాళ్ళ నుండో కధలు రాసి గొప్ప పేరు తెచ్చుకోవాలని, స్కూల్లో కాలేజీల్లో వున్నప్పుడైతే ప్రతిసారి కధల పోటీలో పాల్గోని ఎలాగైనా ఫస్ట్ ప్రైజ్ కొట్టాలని చాలా దూరాశ(దురాశ). అప్పుడు రాసినవి అన్నీ నాకు నిరాశే మిగిల్చినయి. అందుకని చాలా గ్యాప్ ఇచ్చి మళ్ళి ఇప్పుడు రాద్దామని పట్టు వదలని విక్రమార్కి లా మొదలు పెట్టాను. ఇక పొద్దున్నే దడా బిడా పనులు చేసేసుకొని, ఏదో అన్నం సుద్ద పప్పు సుద్ద వండి పచ్చడి అనే పదార్ధాన్ని చేసి అక్కడ పడేసి, ఇక కధ రాయడానికి వుపక్రమించా.
మీకు తెలీదు కాబోలు ఈ మధ్యనే నేను టైపింగ్ నేర్చుకున్నానేమో, ఆ నేర్చుకున్న ఆనందలో ఉత్సాహంలో పిసి ఆన్ చేసి వర్డ్ ఓపెన్ చేసి ఓం ప్రధమంగా ’శ్రీరామా’ అని అక్షరాలు వెతుక్కొని వెతుక్కొని రాసేటాప్పటికి….. డింగ్……. అర్ధం కాలేదా పవర్ కట్ట్ అండి. ఈ కధ రాయాలి అనే ఆనందంలో టైం చూసుకోకుండా కూర్చున్నానేమో ప్రధమ విఘ్నం. ఏం చేస్తాం ఉసూరంటూ లేచా. సరే ఈ టైం లో ఏదో కాస్త నాలుగు ముద్దలు మింగితే ఆ పనన్నా అవుతుందని అన్నీ సర్దుకొని కంచం ముందు కూర్చున్నాను. ఆ సుద్దలు చూస్తే తినాలనిపించలేదు కాని ఏం చేస్తాం తప్పదు కదా. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అని ఇక అలానే ఏదో ఒకటిలే అనుకొని రెండు ముద్దలు మింగేటప్పటికి బెల్లు మోగింది. ఇప్పుడు ఎవర్రా వచ్చింది అనుకొని వెళ్ళి తలుపు తీసేసరికి పక్కింటి పావలా మణి వచ్చింది.
ఈవిడ ఇప్పుడెందుకొచ్చిందిరా భగవంతుడా అనుకుంటూ…. ఆ రండి రండి అన్నాను. ఆవిడేమో ఏమి లేదండి ఆఫీసు నుండి మా ఆయన భోజనానికి ఇంటికి వచ్చారు, రోజు రారు అందుకని నేను ఆయన కోసం వండలేదు వున్నది నేను తినేసాను. మీ ఇంట్లో ఏదయినా కూర వుంటే ఇస్తారా నేను అన్నం వండేస్తాను.. అని అన్నది.
ఆ మాట వినగానే నా మనసు ఆనందంతో గంతులేసింది, ళక్ ళక్ అనుకుంటూ పైకి మాత్రం అయ్యో దాన్దేముందండి, కూర ఏం భాగ్యం అన్నం కూడా ఇస్తా మళ్ళీ మీరేం వండుతారు… ఆయన ఆకలి తో వచ్చారు కదా తీసుకెళ్ళి వెంటనే పెట్టండి. అని నేను చేసిన సుద్దల గిన్నెలన్నీ ఇచ్చేశాను. ఆవిడ పాపం తెగ మొహమాట పడుతూ…. అయ్యో మీరు తింటున్నారు కదా.. మొత్తం ఇచ్చేస్తే మీకు….?
అయ్యో నా భోజనం అయిపోయిందండి. పర్లెదు తీసుకెళ్ళండి అని చెప్పి ఆవిడని పంపించి చెయ్యి కడుకున్నా. ఇంతలో కరెంట్ వచ్చింది. మళ్ళీ వచ్చి పీసీ ఆన్ చేయబోతూ ఈసారైనా కధ ఏ అడ్డంకులు రాకుండా రాయగలిగితే ఉండ్రాళ్ళు చేయిస్తానని వినాయకుడికి దణ్ణం పెట్టుకొని వచ్చి కూర్చున్నా. ఇందాక శ్రీరామ రాసాను కదండి కరెంట్ పోవడం వల్ల అది సేవ్ కాలేదు దాంతో మళ్ళి శ్రీరామ రాసి మొదలు పెట్టాను…
మళ్ళీ బెల్లు మోగింది, అబ్బా మళ్ళీ ఎవరొచ్చార్రా బాబు అనుకొని లేచి వెళ్ళి తలుపు తీసాను. ఎదురుగా పాత బట్టలకి స్టీలు గిన్నెలు ఇచ్చే అమ్మాయి. చాలా రోజుల నుండి చాలా పాత బట్టలు ఇంటినిండా పడి వున్నాయని మొన్న ఈ అమ్మాయి బజారులో కనపడితే ఇంటికి రమ్మని చెప్పాను. నా ఖర్మ కాలి అది కూడా ఇప్పుడే వచ్చింది. వినాయకుడి ఉండ్రాళ్ళు పనిచెయ్యలా… ఆ అమ్మాయేమో గోల బుట్ట దించమ్మా అంటుంది. ఇక తప్పేటట్టు లేదని, బుట్ట దించి బట్టలన్నీ తెచ్చి దాని ముందు వేసా. ఆ బట్టలకి అదేమో చిన్న కాఫీ కాచే గిన్నె ఇస్తా అంటుంది నాకేమో కనీసం నాలుగు కిలోలు వుడికే గిన్నైనా కావాలి. నాక్కావలసిన గిన్నె కావాలంటే ఇంకా బట్టలు తెమ్మంటుంది అది. ఈ గోల తో ఒక గంట అయిపోయింది, చివరికి అది ఇవ్వకుండానే వెళ్ళింది. చచ్చినట్టు ఆ బట్టలన్నీ మళ్ళీ మూట కట్టి అటక మీద పారేసి, వచ్చి మళ్ళి పిసి ముందు కూర్చున్నా…
ఇక ఇప్పుడు ఎవరు వచ్చేవాళ్ళు లేరు, ఒక పావు గంట ఆలోచించా ఏం రాద్దామా అని, కాని మనకి కధలు ఏమోస్తాయి, చదవటం తప్ప రాయటం రాదే. నాలుగు అక్షరాలు రాయటం తీసివేయటం మళ్ళీ రాయటం మళ్ళీ తీసివేయటం మధ్యలో లేచి ఏదోవకటి తినటం తాగటం. ఇంతలో మళ్ళీ బెల్లు. ఛీ దరిద్రం అనుకొని లేచి వెళ్ళి తలుపు తీసా, ఎదురింటావిడ గ్లాసుడు పాలు కావాలని. సరే కదాని ఇస్తే చిన్న కప్పుడు కాఫీపొడి కూడా ఇవ్వమ్మా అంది, ఆరెండూ తెస్తుంటే ఆ చేత్తోటే కాస్త పంచదార కుడా ఇవ్వమ్మా అంటూ దీర్ఘం తీసింది. ఇంతోటి దానికి కాఫీనే అడగొచ్చు కదా అనుకుంటూ అవన్నీ ఇచ్చి పంపేసాను ఆవిడని…
టైం చూసేసరికి సాయంత్రం ఆరు. ఇక ఈపూటకి ఇంకెక్కడి కధ ఇంటి జనాలు వచ్చే టైం అవనే అయ్యింది. సాయంత్రం మళ్ళీ ఇంటిపనితోసరి వంటా తంటా. ఇలాగె ఈరోజు సరిపోయింది. ఇక కధ రాసేది ఎప్పుడు నాకు పేరు వచ్చేది ఎప్పుడు నాకల తీరేది ఎప్పుడు. ఈవిదంగా ఆలోచించి చించి నాబుర్ర పగిలిపోతోంది, ఇంతమంది రాస్తున్నారు నేనెందుకు రాయలేను. ఏది ఏలావున్నా రేపు కధ రాసేతీరాలని ఆ రాత్రి పడుకునే ముందు గట్టిగా నిర్ణయించుకున్నాను.
జులై 24, 2008
అతకని బతుకులు (ఓ హిట్ సినిమా…)
ఆరోజు చొక్కలింగం గారి సినిమా విడుదల సందర్భంగా చాలా హడావిడిగా ఉంది. చాలా రోజుల తరువాత మంచి సినిమా చూడవచ్చని అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురుచుసారు. రిలీజుకి ముందునుండే టికెట్లు కొనేవాళ్ళు కొనేసుకున్నారు. కొననివాళ్ళు రిలీజురోజు ఉదయాన్నే లైను లో నిలబడి టిక్కట్లు తిసుకుని హడావిడిగా సినిమా హల్లోకివెళ్ళారు తోసుకుంటు తొక్కుకుంటు. ఒక అరగంట పాటలు (తరువాత ఆ హాల్లో రిలీజు అయ్యే సినిమావి) మరొ అరగంట యాడ్సయిన తరువాత, తెరలెగిసింది దానితోపాటె చెవులు పగిలిపోయెంత సంగితం (సౌండ్).
ముందుగా మన హీరో గారి పేరు ఎర్ర అక్షరాలతో ఎంతో అందమైన గ్రాఫిక్స్త్ తో, ఆ వెంటనే హీరోయిన్ గారి పేరు నీలిరంగు అక్షరాలతో ఇంకా ఎంతో అందమైన గ్రాఫిక్స్ తో. ఈ సినిమాలో మన హీరోయిన్ గారు రెండు ఈగల్ని పెంచుకుంటారు వాటి పేర్లు వేయించారు మన ప్రొడ్యుసర్ గారు అర్ధం కాని గ్రాఫిక్స్ తో ఎంతో అందంగా, అలాగే హీరో గారు పెంచుకునే రెండు నీటి ఏనుగుల పేర్లని కూడా. ఇలా ఒక్కో పేరు ఒక్కో రంగు అక్షరాలతో అందమైన గ్రాఫిక్స్ తో చివరి లైట్ బాయ్ వరకు ఎవరిని వదలకుండా అందరి పేర్లు రాయించారు మన ప్రొడ్యుసర్ గారు. ఈ విధంగా టైటిల్స్ ముగిసాయి. ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు మన హీరో ఎంట్రన్స్ గురించి. ఇంతలో ’విశ్రాంతి’ అని వచ్చింది. ప్రేక్షకులకి అర్ధం కాలేదు ఏమయిందో, ఇంతలో మళ్ళీ మొదలైంది.
ఆ హాల్లో తరువాత రిలీజు అయ్యే సినమా యాడ్, ముందు సీటు పై కాళ్ళు పెట్టరాదని, హాలు నీట్ గా వుంచాలని, ఎవరి వస్తువులపై వారిదే బాధ్యత అని, ఈ విధమైన యాడ్స్ అయ్యాక మళ్ళీ మొదలింది సినిమా. కనీసం ఇప్పుడైనా సినిమాలోని ఏ కారెక్టర్ అయినా కనపడకపోతారా అని ఎదురు చూసారు ప్రేక్షకులు, కాని తెర మీద శుభం కార్డు పడింది. ఇక మన ప్రేక్షకులకి తిక్కెక్కి ఏమి అర్ధం కాక ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూండగా తెర మీద ప్రొడ్యూసర్ గారు ప్రత్యక్షమయ్యారు.
అయ్యలారా… అమ్మలారా… అందరికి నమస్కారం. నేను ఖర్చు పెట్టినదాంట్లొ సగమైనా నాకు వచ్చేట్టు చేసుకోగలిగాను. దీనికి ఇంత సహకరించినందుకు మీకు నా ధన్యవాదాలు. ఇప్పుడు నేను మీకు నాలుగు ముక్కలు చెప్పదలుచుకున్నాను. అందులో ఒకటో ముక్క సెన్సార్ దగ్గర నాలుగు సీన్లు కటింగండి. ఆ తరువాత రెండో ముక్క ప్రివ్యు వేసామండి, దానికి వచ్చిన వాళ్లంతా కులం పేరుతొ కొన్ని సీన్లు, జంతు ప్రేమికులు వచ్చి వాళ్ళు కొన్ని సీన్లు, పిల్లలతో చేయించామని కొన్ని సీన్లు, క్లాసికల్ డాన్సర్స్ ని కించపరిచేలా వున్నాయని కొన్ని సీన్లు, లెక్చరర్ లని కించపరిచేలా వున్నాయని కొన్ని సీన్లు, పోలీసులు లాయర్లు డాక్టర్లు వీళ్లని కించపరిచేలా వున్నాయని వాళ్ళు కొన్ని సీన్లు, ఈ విధంగా ఎవరికి అడ్డు వచ్చిన సీన్లు వాళ్ళు కత్తిరించుకుంటూ పోయారండి. కానీ ఆ విశ్రాంతి కార్డు ఈ శుభం కార్డుల్ని మాత్రం ఎవరూ కత్తిరించలేదు అందువలన మీకు అవైనా చూపించే భాగ్యం నాకు కలిగినందుకు నాకు ఎంతో ఆనందంగా వుంది.. ఇక ఈ దెబ్బతొ నేను సినిమా పేరెత్తితే ఒట్టు. ఇప్పుడు వచ్చిన ఈ డబ్బుల్తో మా వూరైన తిక్కావారి పాలెం వెళ్ళి నాకున్న రెండెకరాల పొలం చూసుకుంటూ బతికేస్తాను. నమస్కారమయ్య…
జులై 16, 2008
భూలోకసమారాధన…
సత్యలోకంలో నిద్రిస్తున్న బ్రహ్మకి కుడివైపు వున్న తల నెప్పి రావడంతో నిద్ర మెళకువ వచ్చింది. కళ్ళు తెరుస్తూనే భారతీ భారతీ అంటూ పిలిచాడు…
పక్కనే వీణ తీగలు సరి చేసుకుంటున్న సరస్వతి చిరాకుగా ఆయన వంక ఏమిటి అన్నట్టు చూసింది…
శిరోభారము అధికముగా వున్నది, ఏమయినా కాస్త ఔషధము తెచ్చి మర్ధనం చేయమనగా…
శిరోభారము కాక ఇంకేముండును…? ప్రతి దినము ఒకే పనియైన విసుగురాక ఏమి వచ్చును.. స్వామి నేను చెప్పేడిది వినుడు, నాకునూ ఈ పూవ్వులో కూర్చొని కూర్చోని కాళ్ళు పీకుచున్నవి, ఈవీణ వాయించీ వాయించీ చేతులు పీకుచున్నవి. కనుక మనము ఒకసారి భూలోకమునకేగుదుము.. అచట బోలెడు వింతలువిడ్డూరములు వున్నవట. కావున ఒక్కసారి పోయివత్తుము..
సరస్వతీ నీకు తెలియనిది ఏమున్నది… ఈ దినమున పది లక్షల మానవులని సృష్టించవలసి వున్నది, కావున మరొకసారి యేగెదము… అటుల మూతి ముప్పది వంకర్లు తిప్పకుము..
నాధా అటుల కాదు, మీరు ఈరకముగా రోజు ఇంతమంది మానవులని సృష్టించిన యెడల భూలోకము ఏమగును.. ఇప్పటికే అచట మానవులతో భూలోకము కిటకిటలాడుచున్నది.. కనుక ఈరోజుకి సృష్టి ఆపివేసి, మనము భులోకపయనమగుదుము… అని పట్టుపట్టడంతో చేసేది లేక భూలోకానికి పయనమయ్యెను బ్రహ్మ సరస్వతిలు…
భూలోకమున వారిరువురు చూడవలసిన ప్రదేసాలన్నియూ చూసెను. సరస్వతీ దేవి ఆనందానికి అవధులు లేవు. మానవుల ఆనందం చూసి సరస్వతికి కించిత్ ఈర్ష్య కూడా కలిగింది. ఈ విధంగా భూలోకమంతా సందర్శించి అమితానందంతో తిరిగి సత్యలోకం పయనమయ్యారు..
తిరిగి ఎవరి విధుల్లో వారు నిమగ్నమయ్యారు. అయినా కూడా సరస్వతిదేవికి ఏదో తీరని లోటు. సమయము చూసుకొని బ్రహ్మతో… స్వామీ..! అని పిలిచెను,
బ్ర : ఈ మారేమి…..?? (బ్రహ్మ కి గుండెల్లో గుండ్రాయి పడింది)
స : ఏమి లేదు నాధ…. ఆలోచించగా ఆలోచించగా… భూలోకమునందు మానవులు ఎందుకు అంత ఆనందంగా వుంటున్నారో నాకు అర్ధమయింది…
బ్ర : ఎందుకూ….??
స : ఏమీ లేదు ప్రభు… మానవులు తరచూ వారి వారి గృహములందు చిన్న చిన్న వేడుకలు జరుపుకొనుచు, బంధుమిత్రులను ఆహ్వానించి, అందరూ కలిసి ఒకేచోట భుజించి, వారి వారి కష్టసుఖాలని ఒకరికి ఒకరు పంచుకొనుచు ఆనందించుచున్నారు.. మనకి ఆ భాగ్యము లేదే అని చింతించుచున్నాను..
బ్ర : అయిన ఏమి చేయుదుమో వివరించుము వాణీ..
స : స్వామీ…! మనమూ మన బంధుమిత్రులని పిలిచి అలాంటి వేడుక ఒకటి జరపవలెనని నాకు కోరికగా వున్నది…
బ్ర : దేవి మానవులు మనల్ని పూజిస్తూ వ్రతాలు చేసెదరు, అవి మనం ఏల చేసెదము…??
స : నాధా వ్రతములన్నీయూ మనము కనిపెట్టినవే కదా.. కావున మరొక వ్రతము కనిపెట్టెదము..
బ్ర : వాగ్దేవి లెస్స పలికితివి భూలోకమున ఒక చలనచిత్రము నందు చెప్పినట్టుగా ’ఎవరూ కనిపెట్టకుండా మాటలు ఎలా పుడతాయని’… ఎవరూ కనిపెట్టకుండా వ్రతాలెలా పుడతాయి… అయినచో అదేదో నీవే చెప్పు భారతీ…
స : అటులైనచో మనము ’భూలోక సమారాధన’ అని ఒక వ్రతము చేసెదము ప్రభు..
బ్ర : బాగున్నది.. వెంటనే ఆచరించెదము.. అయిన నారదుడుని వెళ్ళి అందరికి ఆహ్వానం అందించి రమ్మని పంపెదము..
స : అటులనే స్వామీ.. కానీ ఆదినమునకు కావలసిన క్షీరమంతయూ విష్ణుమూర్తీ అన్నయ్యను .. మరియూ ఆ శ్రీధర అన్నయ్యను గంగను పంపమని చెప్పుము…
ఆ రోజు రానే వచ్చింది… సత్యలోకమంతా చాలా హడావిడిగా వుంది, శివపార్వతులు, వినాయకుడు (ఫ్యామిలీ), కుమారస్వామీ (ఫ్యామిలీ), లక్ష్మీనారాయణులు, ఇంద్రుడుశచీదేవి, దిక్పాలకులు, మిగతా బంధుమిత్రులతో కిటకిటలాడిపోతోంది. ఎలాగైతేనేం వ్రతం పూర్తిఅయ్యింది. అంతా కలిసి ఆనందంగా విందారగించారు. ఆ తరువాత బ్రహ్మసరసతులు అందరికి పట్టువస్త్రాలు చందనతాంబూలాదూలు సమర్పించుకున్నారు. అందరూ వారి వారి కొండలకు పయనమౌతూ బ్రహ్మసరస్వతులను ఎంతో కొనియాడారు.. లక్ష్మీ పార్వతులైతే ఏకంగా సరస్వతిని ఎత్తేసారు.. ఇంత మంచి ఆలోచన వచ్చినందుకు, ఇలాగే మేము కూడా చేయకుతూహల పడుతున్నామని చెప్తూ, ఈ పట్టు వస్త్రములు చాలా బాగున్నవి అని అన్నారు.
స : భూలోకమునందు కళామందిరమని ఒక వస్త్రాలయమున్నది, మొన్న మేము పోయినప్పుడు చూచి అచటనుండి తెప్పించితిమి. అని చెప్పగా…
లక్ష్మీ పార్వతులు సంతసించి ఈసారి ఎవరింట ఈ వేడుక జరుపుకుందమా అని అలోచించుకుంటు వుండగా అక్కడ శివ నారాయణులకి, దేవేంద్రులకు గుండెల్లో యధావిధిగా గుండ్రాళ్ళు పడ్డాయి..
ఈవిధంగా ’భూలోకసమారాధన’ సమాప్తం…
నీతి: పావని బ్లాగు ఓపెన్ చేస్తే ఇలాంటి తలనెప్పి తప్పదని…