పాములనాయుడు కి ఎన్నో రోజుల నుండి మొబైల్ కొనాలని ఆశ. ఎందుకంటే తన ఫ్రెండ్ జక్రయ్య ఎప్పుడు మొబైల్ లో మాట్లాడుతూ తెగ ఫోజులు కొడుతూండటం చూసి ఎలాగైనా తను కూడా మొబైల్ కొనాలని నిశ్చయించుకున్నాడు పాముల్నాయుడు. ఇక ఆలశ్యం చేయకుండా మొబైల్ కొనేసాడు. ఇక అప్పటి నుండి మొదలయ్యాయి కష్టాలు మన పానా కి…
ఏనాడైతే కొన్నాడో ఆ రోజు నుండి శని పట్టుకుంది. ఆరోజు ఫస్ట్ కాల్ శుభప్రదంగా వుంటుందని సాయిబాబా గుడికి కాల్ చేద్దామని నంబర్ నొక్కాడు. మన పానా ఫోన్ రింగ్ అవుతూండగానే సాయిబాబా దండకం చదువుకుంటూ అవతల వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయాగానే…
ఆ హలో నమస్కారమండీ… ఈ రోజు ఎన్నింటిదాకా వుంటారు మీరు అని అడిగాడు.
అవతలి వ్యక్తి, ఆ సాయంత్రం దాకా. తర్వాత ఆ అవతలి వ్యక్తి అడిగాడు మన పానా ని, సార్ ఎన్నింటికి వస్తారు, ఎందుకంటే ఇక్కడ ఏర్పాట్లు చెయ్యాలి కదా.
ఏర్పాట్లా…..! ఓహో పూజ గురించేమో అనుకొని సాయంత్రం ఆరింటికి వస్తాం అన్నాడు.
సరే సార్ కాని ఆరు దాటితే ఇక్కడ నేను వుండను వేరే అతను వస్తాడు డ్యూటీకి అనగానే మన పానా కి ఏమి అర్ధం కాలేదు. అదేంటండి మీరే కదా అక్కడ ప్రధాన పూజారి అని అన్నాడు… పూజారా…??? ఏందయ్యో నేను ఎవరనుకుంటున్నా….??
పానా కి ఏమి అర్ధం కాలేదు సార్ ఇది సాయిబాబా గుడేనా అని అడిగాడు(అవతలి వ్యక్తి ఎవరో అడిగి తెలుసుకోవాలనే ఆలోచన అప్పుడు వచ్చింది మన హీరో కి). కాదయ్యో ఇది శ్మశానం కదూ, నేను కాటికాపరి కదూ అన్నాడు. మన వాడికి మతి పోయి తనని తాను లక్షబూతులు తిట్టుకొని ఫోన్ పెట్టేసాడు… అలా ఫస్ట్ కాల్ ప్రహసనం సాగింది…
ఇలా లాభం లేదనుకొని ఆ రొజు ముహూర్తం బాలేదనుకొని ఆరోజుకి వదిలేసి మొబైల్ ని మూట కట్టేసి బీరువాలో పెట్టేసాడు మన పానా.. మర్నాడు ముహూర్తం చూసి అలాగే వర్జ్యంకూడ చూసి సెల్ ఫోన్ బీరువాలో నుండి తీసాడు. తీసితీయగానే ఫోను రింగ్ అయ్యింది. పానా ఎక్కడలేని ఆనాందంతో ఫోను తీసి హలో అన్నాడు…
అవతలి నుండి ఒక అందమయిన గొంతు నవ్వూతూ హలో అంది..
పానా ఇక ఆనందానికి అవధులు లేవు. ఆ గొంతు వినే సగం పడిపోయాడు. హలో ఎవరూ అన్నాడు..
నా పేరు శ్రీవీరవెంకటసూర్యకాంతనాగరాజసాయిదుర్గవిజయకనకమహలక్ష్మి … అని చెప్పగానే పానా బ్రెయిన్ పూర్తిగా పోయింది.. రెండు నిమిషాలు పట్టింది తిరిగి మామూలు మనిషి అవడానికి. మళ్ళి పొరబాటున ఎవరండి అని అన్నాడు అంతే ఆలస్యం అడిగిందే తడవుగా మళ్ళీ ఆవిడగారు మొదలుపెట్టి చెప్పారు నా పేరు శ్రీవీరవెంకటసూర్యకాంతనాగరాజసాయిదుర్గవిజయకనకమహలక్ష్మి …
ఆపేరువినగానే, వామ్మో ఏందమ్మా ఇంతపేరు అంటే… హిహిహిహి అది మాఅమ్మమ్మ పెట్టిన పేరండి. నాకు చాలా ఇష్టమైన పేరు. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నాపేరు పూర్తిగా పిలవండీ నాకుచాలా హేపీగావుంటుంది అంది. నీ హేపి తుంగలొ తొక్క దానిసంగతి తరువాత చూద్దాం, ముందు నాసంగతిచూడు అన్నాడు.
ఆవిడగారు సిగ్గు పడుతు చెప్పండి సార్ ఏమిటి మీప్రాబ్లెం అంది. నేను చెప్పేదేంది నువ్వే కదా ఫోన్చేసింది… ఆ మర్చిపోయాను సార్, మీ మొబైల్ బిల్ నాలుగు వేల ఏడు వందల డెభైనాలుగు రూపాయలు వుంది, లాస్ట్ డేట్ కూడా అయిపోయింది. ఇవ్వాళ్ళ పే చెయ్యకపోతే రేపు మీ ఫోన్ కట్ అవుతుంది.
ఏందీ నేను ఫోన్ బిల్లు కట్టాలా… ఏందమ్మో నేను ఫోన్ కొన్నదే నిన్న, దాని శిగతరగ ఏదో కొత్త ఫోన్ ముందుగా దేవుని దీవెన తీసుకుందామని నిన్న చేసిందే ఒక్క ఫోన్ అది కూడా యాడికో శ్మశానానికి పోయింది. దానికి నాలుగు వేల ఏడు వందల డెభైనాలుగు రూపాయలా… మతి వుండే మాటాడుతున్నావా..??
అయ్యో సార్ మీరు ఈ ఫోన్ తీసుకొని ఆరు నెలలు అయ్యింది కదండీ… ఈ బిల్ల్ లాస్ట్ మంత్ కట్టాల్సింది.
ఏంది ఆరు నెలలా…..! ఎవరు చెప్పారు నీ అమ్మ మొగుడు. చెప్పిన సోదంతా విని మళ్ళీ అదే వాగుతావ్.
అయ్యో అలాగా సార్ మీపేరు చెప్పండి…
అమ్మా…..
సార్ కాల్ మీ శ్రీవీరవెంకటసూర్యకాంతనాగరాజసాయిదుర్గవిజయకనకమహలక్ష్మి …
నా బొంద అదే అదే చూడు తల్లీ నాపేరు పాముల నాయుడు…
ఏంటి సారు ఆ పేరు… అంటే మీరు పాములు పట్టుకుంటుంటారా….??
ఏందమ్మో నువ్వు పెట్టుకోలా కొండవీటి చాంతాడంత పేరు, అయినా పని చూడమ్మా…
కానీ సార్ ఇక్కడ పవన్ అని వుందే… ఒకసారి మీఅడ్రస్ చెప్పండి సార్…
అన్నికాయితాలు ఇచ్చిచచ్చాను కదమ్మా ఫోన్ తీసుకునేటప్పుడు. మళ్ళి ఇప్పుడు ఈ సోది ఏంది…
సార్ ఒక్కసారి చెప్పండి …
చూసుకో చెప్తున్నా… ఇంటి నంబరు 420, వీధి నంబరు 210, పీతగుంట్ల పాలెం, చాలామ్మ…
సార్ సారీ సార్ ఒక్కసారి మీ నంబర్ ఇదేనా చూడండి… **********
అమ్మా నా నంబర్ అది కాదు, ముందు నంబర్ సరిగ్గా చూసుకొని చేసుకోండి ఫోన్లు.. ఇంత సేపూ నా బుర్ర తినేసి ఇప్పుడు సారి అంటావా… పెట్టెహె సోది…..
ఇక లాభం లేదనుకొని ఫోన్ తీసుకొని తప్పు చేసాననుకొన్నాడు పానా. ఇంతలో మళ్ళీ ఫోన్ రింగ్ అయ్యింది కానీ పానా కి ఫోన్ తీయాలనిపించలేదు. ఫోన్ అంటే నే విరక్తి వచ్చేసింది పాపం. కానీ మళ్ళీ ఏదో చిన్న ఆశ ఈ సారైనా సరైన కాల్ వస్తుందేమో అని… ఆ ఆశతో మళ్ళీ ఫోన్ తీసాడు, హలో అన్నాడు…
హలో యాదయ్యా నేను ఇక్కడ సికింద్రాబాదు లో వున్నాను, కుకట్ పల్లి వెళ్ళాలి అర్జెంట్ గా ఆటో తీసుకొని వస్తావా…??
ఏందయ్యా నువ్వెవరూ…. ఈ యాదయ్య ఎవరూ…… ఈ ఆటో గోల ఏంది……
హలో నువ్వు యాదయ్యవి కావా….?? ఇది చిలకలగూడా కాదా….??
కాదు ఇది పీతగుంట్ల పాలెం…. నేను యాదయ్యను కాను…. పెట్టెయ్ ఫోన్..
ఆ ఫోన్ పెట్టీపెట్టక ముందే మళ్ళీ ఫోన్ రింగ్……. పానా కి ఫోన్ ఎత్తికొట్టాలన్నంత కోపం వచ్చింది.. కానీ ఆఫోన్ కి పెట్టిన డబ్బులు కనపడ్డాయి కళ్ళముందు.. ఏమి చెయ్యలేక మళ్ళీ ఫోన్ తీసి హలో అన్నాడు ఏడుపు మొహం తో…
అవతలి వ్యకి హడావిడిగా… సార్ సార్ మీరు అర్జెంటుగా బయలుదేరి ఇక్కడికి రావాలి.
పానా గుండెలు జారి పోయాయి ఆ వ్యక్తి హడావిడి చూసి.. యవరయ్యా నువ్వు ఏమయింది…? యాడికి రావాల నేను…?
సార్ ఇక్కడ మీ ఆవిడకి పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. తొందరగా రండి మీరు…….
మా ఆవిడకా … యాక్సిడెంటా…..
అవునండి, ఆవిడ ప్రాణాపాయ స్తితిలో వున్నారు. అపోలోలో చేర్చాము, ఆవిడ బ్యాగులో మీ నంబర్ చూసి మీకు ఫోన్ చేస్తున్నాను మీరు తొందరగా రండి…
నీ అబ్బరేయి… నాకింకా పెళ్ళే కాలేదురా. నంబర్ చూసుకొని చెయ్యండిరా. పెట్టెయి ఫోన్….
దాంతో పానా ఒకటే నిశ్చయించుకున్నాడు. తెల్లారగానే మొబైల్ తీసుకెళ్ళి ఆ జక్రయ్యకి గిఫ్ట్ గా ఇద్దామని. అప్పుడు కాని వాడి తిక్క కుదరదని అనుకొని మళ్ళి ఆ ఫోన్ ని బీరువాలో పెట్టాడు. అంతకు ముందు నుండి పొయ్యిమీద మసిలి పోతున్న నీటిని తీసుకొని హాయిగా స్నానం చేసి, బువ్వ తిని బజ్జున్నాడు…
జులై 31, 2008
పాములనాయుడు… సెల్ ఫోన్…
అభిప్రాయములు »
ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI
ప్లీజ్… నాకు ఆ పాముల నాయుడు CELL NUMBER ఇవ్వరా?? ఎందుకంటీ.. ‘శ్రీవీరవెంకటసూర్యకాంతనాగరాజసాయిదుర్గవిజయకనకమహలక్ష్మి ‘ గారి ఫోన్ నెంబర్ తెలుసుకొందామని … GOOD NAME…
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా krishna rao jallipalli — జులై 31, 2008 @ 5:01 అపరాహ్నం
మళ్ళీ
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా రాజేంద్ర — జులై 31, 2008 @ 5:05 అపరాహ్నం
నవ్వి నవ్వి చచ్చానండి..
పావని గారు బాఉంది మీ టపా…:)
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా meenakshi — జులై 31, 2008 @ 5:55 అపరాహ్నం
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా radhika — జులై 31, 2008 @ 9:16 అపరాహ్నం
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Shankar Reddy — ఆగష్టు 1, 2008 @ 11:32 పూర్వాహ్నం