మన సినిమాలలో కొన్ని సీన్లు చూస్తే భలే నవ్వు వస్తుంది, కాస్త విచిత్రంగా కూడ ఉంటుంది. హీరో కధాపరంగా బీదవాడు అయినా స్ర్కీన్ మీద మాత్రం బైక్ లేకుండా అడుగుబైట పెట్టడు. హీరోయిన్ బర్త్ డే వచ్చిందంటే నెక్లెస్ కాని కనీసం ఒంటిపేట బంగారు గొలుసు కాని ప్రెజెంట్ చేస్తాడు. అయ్యగారికి ఉద్యోగం సద్యోగం ఏది లేకపోయినా, అంత డబ్బు ఎలా వస్తుందో తెలీదు. పోని ఇంట్లో వాళ్ళు ఇస్తారా అంటే, ఇల్లు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు కనపడరు. కనీసం వాళ్ళ గురించి కూడా ఎక్కడా ప్రస్తావించడు. ఎక్కడ తింటాడో ఎక్కడ పడుకొంటాడో తెలియదు.
ఒక సీన్లో వేసిన బట్టలు ఇంకో సీన్లో వెయ్యడు, ఆబట్టలు అన్నీఎక్కడ పెడతాడో తెలియదు. మనకైతే అన్ని బట్టలు పెట్టుకోవాలంటే కనీసం నాలుగు బీరువాలు కావాలి. అమ్మ అయ్య లేకపోయినా దేవుడిచ్చిన చెల్లొ తమ్ముడో ఉంటారు. వాళ్ళకోసం ఈయనగారు ప్రాణం ఇస్తారు. ఏ అమ్మాయైనా కనపడితే…. అది ఎంత అందంగాఉన్నా సరే హీరోయిన్ కాక పోతే అమ్మా చెల్లెమ్మా అంటాడు. ఎంతవికారంగా ఉన్నా హీరోయిన్ తో మాత్రం అయి లవ్ యు అంటాడు.
సార్ కి వారంరోజులనించి తిండి లేకపోయినా భలే హెల్దీగా ఉంటాడు. అదే మనమైతేనా ఒక్కరోజు ఉపవాసం ఉంటే తెల్లారేసరికి ఈసురో వాసుదేవా అంటూ వేళ్ళాడ బడి పోతాం. ఎక్కడా స్కూల్లో కాలేజీ లో కాని చదివినట్టు కనపడదు కాని అవసరాన్నిపట్టి అయ్యగారు ఇంగ్లీష్ గడ్డగడ్డ గడా మాట్లాడతాడు. మనం వుసూరుమంటూ చిన్నప్పటి నించి డిగ్రీ దాకా చదివినా ఆఇంగ్లీష్ రాదు. ఇక దొరగారి పక్కన స్నేహితుడు ఒకడుంటాడు వాడికి ఎక్క్డడాలేని నిజాయతి, హీరోకి ఏ చిన్న కష్టం వచ్చినా ఆయనగారు విలవిల లాడి పోతాడు. తనసుఖం తను చూసుకోకుండా హీరో కోసమే త్యాగం చేసే ధన్యజీవి.
ఇద్దరూ కలిసి సిగరెట్లు కాలుస్తూ రోడ్డుమీద వెళ్ళేవాళ్ళని కామెంట్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూంటారు. ఎవరికి ఏమైనాపట్టించుకోరు కానీ అదే హీరోయిన్ పేరెంట్స్ కి మాత్రం ఏచిన్న కష్టం వచ్చినా తెగబాధ పడి పోయి అందులో ఇన్ వాల్వ్ అయిపోయి వాళ్ళకి న్యాయం జరిగె దాకా వదలరు. పాటల విషయానికి వస్తే మన హీరో ఎప్పుడు ఎక్కడ సంగీతం, కవిత్వం నేర్చుకుంటాడో తెలియదు కాని రాగ తాళ యుక్తంగా పాటలు పాడేస్తారు. ఆ పాటలకి తగ్గట్టు డ్యాన్స్ లు.
హీరో ఎంత బక్కపల్చగా, పొట్టిగా వున్నాకూడా, విలన్ ఎంత బండగా వున్నా కూడా హీరో గారు ఒక్కతన్ను తన్నాడంటే విలన్ విల విలలాడుతూ కుప్పకూలిపోవలసిందే. అంత ఫైటింగ్ ఎప్పుడు నేర్చుకుంటాడో అర్ధం కాదు. ఎంత మంది వచ్చినా అలుపు ఆయాసం లేకుండా ఒక్క దెబ్బ తగిలించుకోకుండా అవతలి వాళ్ళని చితకొట్టి చింతకాయ పచ్చడి చేసేస్తాడు. ఎప్పుడైనా ఖర్మకాలి ఏకొండ మీదనుండో పడిపోతే మనమైతే సున్నంలోకి ఎముకలేకుండా అయిపోతాం కాని మన హీరో గారికి మాత్రం నుదిటి మీద చిన్న ప్లస్ మార్క్ వస్తుంది అంతే. ఆ ప్లస్ మార్క్ చూసే హీరోయిన్ ఢమేల్ మని పడిపోతుంది……. షరా మామూలే పాట పక్కనే హిమాలయాలు. మనం ఎంత వ్యయప్రాయసలు పడితేగాని వెళ్ళలేము కాని వాళ్ళు అలా కళ్ళు మూసుకుంటే చాలు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఆ మంత్రం ఏదో మనకీ తెలిస్తే బాగుండు… ![]()
ఇక మన హీరోయిన్ గారయితే ప్రపంచంలో వున్న కరువుంతా తన దగ్గరే వున్నట్టుగా పాపం చిన్నప్పుడు ఎప్పుడో కుట్టించుకున్న గౌను వేసుకొని తిరుగుతుంది. అందుకేనేమో ఎవరో ఒక గీత రచయిత రాసారు ’ చిన్నగౌను వేసుకున్న పెద్దపాప’ అని ఏదో సినిమాలో. అలాంటి బట్టలు వేసుకొని ఇంట్లొ అందరి ముందు బానే తిరుగుతుంది. కానీ హీరో ముందుకి వచ్చేసరికి మాత్రం ఎక్కడ లేని సిగ్గు వచ్చేస్తుంది. ఆ సిగ్గు ఇంత చిన్న బట్టలు వేసుకోవలసి వచ్చినందుకో లేక ఇవి మాత్రం ఎందుకు వేసుకోవలసి వచ్చిందిరా అనా అర్ధం కాదు. అమ్మాయిగారు మాట్లాడుతుంటే నోట్లో చూయింగం పెట్టుకొని నములుతున్నట్టే వుంటుంది కాని ఒక్క డైలాగ్ కి కూడా లిప్ మూమెంట్స్ కలవవు.
ఏంటో ఈ సినీమాయలు అబ్బో చూడతరమా……
ఆగష్టు 7, 2008
సినీమాయ…
ఆగష్టు 3, 2008
ఆశా నిరాశేనా…
నాఆత్మకధ మీతో చెప్పాలని ఈరోజు ఎందుకో అనిపిస్తోంది. ఈమద్య స్లిమ్ గా ఫెయిర్ గా అవ్వాలనుకొని కొన్ని సౌందర్య సాధనాలు వాడాను వాటి ఫలితాలను మీకు చెప్పుకుంటాను.
టీవీలో ’అందం’ సీరియల్ చూస్తుంటే…… మద్యలో బ్రేక్ లో వచ్చిన యాడ్స్ లో కోల్గేట్ యాడ్ చూసాను. డాక్టర్లందరు దంత సౌందర్యం కోసం కోల్గేట్ వాడమని సూచిస్తున్నారు. అది చూసి దీంతో అయినా నాపళ్ళు బాగుపడతాయని ఆశతో వెంటనే వెళ్ళి కోల్గేట్ పేస్ట్ తెచ్చాను. ఇక నాపళ్ళు మిలమిలలాడతాయని ఎంతో ఆనందంతో ట్యూబ్ ఓపెన్ చేసాను. తీరాచూస్తే అది నాఒక్క పంటికి కూడా సరిపోలేదు. ఈరకంగా ఎన్ని పేస్టులు తెస్తే నాపళ్ళు బాగుపడతాయని నిరాశతో ఆప్రయత్నం మానుకొన్నా. దంత సౌందర్యం ఆరకంగా సమాధి అయ్యింది.
కనీసం చర్మసౌందర్యం అయినా మెరుగు పరుచుకొందామని అదేదో ఫెయిర్ అండ్ లవ్లీ అని విన్నాను, సరే దీని సంగతి ఏమిటో చూద్దామని, పేస్ట్ ఒకటి తెస్తే చాల్లేదని, ఇవి నాలుగు తెచ్చాను కాని అన్ని కలిపినా ముఖానికి ఒక పక్కకి కూడా రాలేదు. ఈరకంగా చర్మసౌందర్యం కూడ మట్టిలో కలిసి పోయింది. ఎహె…. ఎందుకొచ్చిన గోల అని కొన్ని రోజులు మూసుకొని వూరుకొన్నా. నేను వూరుకొందామన్నా యాడ్స్ వూరుకోనిస్తాయా…?? ఈమద్యనే చూసా మన మాస్ట్రర్ బ్లాస్టర్ చెప్పిన సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అనే మాటలు నన్ను బాగా ప్రభావితం చేసాయి. అందులోను ఈమద్య కాస్త నీరసంగా ఉంటోందేమో, దాంతో చెంగున ఎగురుకుంటు వెళ్ళి ఒక కిలో బూస్ట్ తీసుకువచ్చాను. కానీ దాన్ని పాలల్లొ కలపటానికి యజమాని కాసిని కూడా పాలు మిగల్చడు. దాంతో ఏదారిలేక కుడితిలో కలుపుకొని తాగాను ఉపయోగం ఏముంది… అలాంటి కిలోలు ఎన్ని తెస్తె నాకు సరిపోతాయి…? మనకి గడ్డే మేలు అనుకొని గడ్డిలో లేనిది దానిలో మాత్రం ఏముంటుందిలే అని దాన్ని కూడ తృణ ప్రాయంగా వదిలేసాను.
ఆ ఇంకో విషయం మర్చిపోయాను, ఆమధ్య సంతూర్ సబ్బు కూడ తెచ్చాను. అది వాడితే చాలా చిన్నగా కనపడతామని అంటే. కాని దాన్ని ఈచర్మానికి ఎలా రుద్దాలో అర్ధంకాక, సరే నీళ్ళలో కలుపుకొని స్నానం చేద్దామనుకొన్నా. కాని చెరువులో ఎన్నిసబ్బులు కలిపితే మన స్నానానికి సరిపోతుంది. ప్చ్…. హ… ఏమిటో ఈజీవితం, విరక్తి పుడుతోంది.
చివరి ఆశగా సోనా బెల్ట్ ఒక్కటివాడి కనీసం పొట్టయినా తగ్గిద్దామని అనుకొన్నాను. ఎందుకంటే మనిషే కాదు బర్రె కూడ ఆశా జీవే కదండి. అయినా ఈసారి నా స్తోమత కూడా అలోచించకుండా పీనాసితనానికి పోకుండా ఓ పదిబెల్ట్ల్ల్ లు కలిపి వేసాను. అయినా కూడా నా ఆకారాన్ని వెక్కిరిస్తూ అది కాస్తా ఫట్ మని తెగింది. ఛి…ఛీ… అనుకొని, మనకి ఇవేవి సరిపడవు లే అని అనుకొని, ఈబర్రె జీవితంలో ఉన్నసుఖం ఎందులోను లేదని, హాయిగా నాగడ్డేదో నేను తింటూ నా నెమరేదో నేనెసుకొంటూ, అందంలో లేదు ఆనందం అనుకొని. ఇక సీరియల్స్ చూసినా యాడ్స్ మాత్రం చూడకూడదు అని నిశ్చయించుకున్నాను.
ఆగష్టు 2, 2008
HAPPY FRIENDSHIP DAY…
“స్నేహం ” ఆమాటగురించి ఎంతమంది ఎన్నిరకాలుగా చెప్పినా తరగని మాధుర్యం స్నేహంలో ఉంది. అది మాటలకందని గొప్ప అనుభూతి. స్నేహం అనేది ఒక గ్రీటింగ్ కార్డ్ తోనో, లేక ఒక ఫ్రెండ్ షిప్ బ్యాండ్ తోనో, ఏబహుమతి తోనో ఏర్పడేది కాదు, వాటివల్లనిలిచేది కాదు. కులం- మతం భాష – దేశం ఆడ -మగ చిన్నా-పెద్దా తేడా లేనిది, ఏద్వేషం లేనిది స్నేహం ఒక్కటే. ఏస్వార్ధం లేని అతీతమైన బంధం స్నేహం కాని కొంతమంది దానిని స్వార్ధానికి వాడుకుంటున్నారు ఈరోజుల్లో. డబ్బుతోముడిపెట్టి నిజమైన స్నేహితులని కష్టాలలోకి నెడుతున్నారు. ఇటువంటి పరిస్తితులలో మంచి స్నేహితులను పొందటం నిజంగా అదృష్టం, కాని కొంతమంది సినిమాలు షికార్లు మాత్రమే స్నేహమని అనుకొంటారు. మనసు లోతుల్లోని భావాలు ఎంతమంది చూడగలరు..?ఆడుకున్నా కొట్టుకొన్నాతిట్టుకొన్నా , బళ్ళో కలిసి పనిష్మెంట్ తీసుకున్నా, కాపీలు కొట్టినా, స్కూల్ బయట ఒక కాయ కొని రెండు కాయలు కొట్టేసినా, పానీపూరీ తిన్నా, రన్నింగ్ బస్ ఎక్కినా, పాటలు వింటూ డాన్స్ చేసినా ,బీటు కొట్టినా,చిన్న పాటి తగదాల తో విడిపోయి మళ్ళీ కలిసినా అది స్నేహితులకే చెల్లుతుంది. అలాంటి స్నేహంలో వున్నగొప్పదనం ఎంతమంది ఆస్వాదిస్తున్నారు.? ఏ కష్టమొచ్చినా స్నేహితుడు అందించే హస్తం ఎంత ధైర్యాన్నిస్తుంది, జీవితంలో ముందుకు సాగటానికి ఆధైర్యంఎంతో చేయూతనిస్తుంది. ఇవ్వాళ్ళ స్నేహితులిగా వున్నవాళ్ళు రేపు ద్వేషంతొ కొట్టుకొంటున్నారు చంపుకొంటున్నారు…… వద్దు, ఇటువంటి స్నేహం వల్ల మనస్తాపాలే కాని మానసోల్లాసం లేదు. కొందరు ప్రేమ కోసం స్నేహాన్ని అడ్డం పెట్టుకుంటారు ఇది ఎంత వరకూ సమంజసం? పారదర్సకమైన స్నేహాన్ని మలినం చేయద్దు , స్వచ్చమైన స్నేహాన్ని ఆహ్వానిద్దాం.
అందరికి స్నేహితుల రోజు శుభాకాంక్షలు…