Pavani5’s Weblog

మార్చి 5, 2009

ఎవరీ ఒబామా…?

ప్రచురించిన వర్గము Uncategorized — pavani5 @ 2:24 అపరాహ్నం

ఒరెయి పరంధాముడూ….! నానమ్మ పిలుపు విని నాకు నీరసం వచ్చింది. ఉదయం నించి ఆఫీస్ పనితో విసుగ్గాఉంది, ఏమి చెయ్యలేక హబ్బా… నన్నలా పిలవకు నానమ్మా అన్నాను. తాతలిద్దరి పేర్లు కలిసి రావాలని ’వెంకట సుబ్బరామపరంధామయ్య’ అని పాతపేరు పెట్టారు. నాకు ఇరవై ఏళ్ళు కూడా రాకుండానే అందరూ వెంకటసుబ్బయ్యా అనో లేక పరంధామయ్యా అనో పిలవటం మొదలు పెట్టారు. ఆగోల పడలేక నానా అవస్తా పడి నాపేరు పరమేష్ అని మార్చుకున్నాను. నీకేమో అది నచ్చదు, పోనీ ఆకొండవీటి చాంతాడంత పేరుని కుదించి పిలవమంటే పరం అంటావు. నాకేమో ఆపేరు వినగానే కళ్ళముందు నరకం కనపడుతుంది లేక పోతే అంధయ్యా అంటావు. అప్పుడు నేను గుడ్డివాడినేమో అని అనుమానం వస్తుంది. ఈపేరుతో చచ్చే చావొచ్చింది అనివిసుక్కుంటూ… చెప్పు ఏమిటి సంగతి అన్నాను. నీకు ఓబమ్మ గుర్తుందిరా అని అడిగింది నానమ్మ. ఓబమ్మా ఆవిడెవరే…? అన్నాను. ఓరీనీ దుంప్పెయ్యా.. పిచ్చికల గుంటలో మనపక్క వీధిలో ఉండే వాళ్ళురా వాళ్ళు. అప్పుడే మర్చి పోయావా…? అంది. ఎప్పటి పిచ్చికల గుంట ఏం సంగతి…?? ఎప్పుడో నాచిన్నప్పుడు గోల అది. ఎవరికి గుర్తు అన్నాను. అలాగ మర్చిపోతే ఎలాగరా ఇప్పుడు చూడు వాళ్ళబ్బాయి చాలా గొప్పవాడైపోయాడు అన్నది దీర్ఘంతీస్తూ. అహా ఏంచేస్తున్నాడు కంప్లూటరు (ఆవిడ భాషలో కంప్యూటర్) ఉద్యోగంచేస్తున్నాడా..? అన్నాను నిరాసక్తంగా. ఏమిటిరా ఆనిర్లక్ష్యం. ఆపెద్దదేశానికి ప్రధానిఅయ్యాట్ట అన్నది. నాకు ఒకక్షణం అర్ధం కాలేదు ఏసంగతి నానమ్మా నువ్వు చెప్పేది అన్నాను. అబ్బాబ్బా ఏవిషయమైనా చెప్పేటప్పుడు వినవు తరవాత అర్ధం కాలేదు అంటావు ఎలారా నీతో విసుక్కుంది నానమ్మ. ఆ ఓబమ్మ కొడుకే నట్రా ఆ అమేరికాకి ప్రధాని అయ్యాట్ట అంది. అబ్బా నానమ్మా ప్రధానికాదు అద్యక్షుడు అంటే మనరాష్ట్ర్రపతిలాగా అన్నమాట అయినా ఈకధ ఎక్కడనించి తెచ్చావు అన్నాను. కధేవిట్రా..? కధ.. నీకు నేనెదైనా చెప్తె కధలాగానే ఉంటుందేంరా..?? అంది మూతి ముడుచుకొని. సరె సరె విషయం చెప్పు అన్నాను ఆమెని సముదాయిస్తూ. నిన్న ఆ పక్కింటి కామేశ్వరిగారు లేరూ ఆవిడా ఎదురింటి మీనాక్షిగారు నేనూ మాట్లాడుకొంటుంటే ఈవిషయం వచ్చిందిరా అప్పుడు తెలిసింది ఈఒబామాయే ఆఓబమ్మ కొడుకని అంది. అబ్బా చాలా పెద్ద విషయం కనిపెట్టారే అన్నాను. మరి ఏమను కొంటున్నావు అంది గర్వంగా వెంటనే ఒరేయి పోయి పోయి అమావాస్య ముందు పెట్టుకొన్నాడేవిరా ఆ ప్రమాణ స్వీకారం కాస్త మంచి చెడ్డా చూసుకొని ఏపాడ్యమి నాడో విదియనాడో పెట్టుకోవచ్చు కదరా అంది. అబ్బా నీచాదస్తం దొంగలుదోల అతను ఓబమ్మకొడుకూ కాదూ ఏమీ కాదు ఆమాటకొస్తే అసలు మనదేశం వాడే కాదు అన్నాను. అయినా ఆవిడ ఏవిషయమైనా నమ్మిందంటే ఒకపట్టాన వినదు. నువ్వు దేన్నియినా తొందరగా నమ్మవా ఏమిటీ మనదేశం వాడు కాకపోతే మెడలో ఆంజనేయస్వామి గొలుసు ఎందుకు వేసుకుంటాడు..? పరాయిదేశం వాళ్ళంతా కిరస్తానీ వాళ్ళేనటగా నువ్వేమైనా చెప్పు అతను మనదేశం వాడేను అదీ కాక మన ఓబమ్మ కొడుకే అంది స్తిరంగా. ఇహ ఆవిడని నమ్మించడం బ్రహ్మ తరం కూడా కాదని నాకర్ధమైంది, ఆవిడ నమ్మినా నమ్మకపోయినా పెద్దగాఒరిగేదేమీ లేదని ఊరుకున్నా. నేనూరుకున్నాఆవిడూరుకోదుగా… ఒరేయి ఆప్రమాణస్వీకారం తరువాత వాళ్ళకిచ్చిన కొత్తింట్లోకి వెళ్తారటగా అన్నది. నేను అవున్నాను. శుభమా అంటూ ఆఇంటికి సున్నాలు వేయించారోలేదో అంది నానమ్మా అది వైట్ హౌస్ నానమ్మా అంటే అదే తెల్ల ఇల్లు దానికి సున్నాలు అవసరం లేదు అయినా అక్కడవాళ్ళకి ఈ చాదస్తాలు ఉండవు అన్నాను. అదేవిట్రా మరీ చోద్యం కాకపోతేనూ అని దీర్ఘం తీసింది నానమ్మ. పోనీ కనీసం కొత్తింట్లో వ్రతం అదీ చేసుకొని పదిమందికీ భోజనాలైనా పెడతారా..? వామ్మొ ఈవిడ్ని వదిలేస్తే ఇంకా ఎంతదూరం వెళుతుందో అనుకొని నేనేదో అనబోయంతలో… ఒరేయి అబ్బిగా వాడి ఫోన్ నంబరు నీదగ్గర వుందా అనడిగింది. ఎవరిది..? అన్నాను, వాడిదేరా ’ఒబామా’ది.. ఇదిగో అతన్ని వాడు వీడు అనకు ఎవరైనా వింటే తీసుకెళ్ళి బొక్కలో తోస్తారు అన్నాను. పోరా మరీ బడాయి నాకళ్ళముందు పుట్టి పెరిగినవాడు వాణ్ని వాడు అంటే తప్పా అంది. ఓరినాయినోయి అనుకొని ఇప్పుడు ఆఫోన్ నంబరుతో నీకేంపని అయినా నాదగ్గరలేదు అన్నాను. ఆఫోన్ దగ్గర నాఅంతలావు పుస్తకం వుంటుంది కద దాంట్లో చూడు వుంటుంది అంది. (టెలిఫోన్ డైరక్టరీ అని అవిడ ఉద్దేశం) దాంట్లో ఎందుకు వుంటుంది అన్నాను. ఓరినీ అమాయకత్వం సంతకెళ్ళా ఎవరినంబరైనా తెలియకపోతే దాంట్లోనేకదరా చూస్తారు. దాంట్లో మనదేశం నంబర్లే ఉంటాయి ఆదేశం నంబర్లు ఉండవు అన్నాను. ఇదెక్కడి పితలాటకంరా..? ఇప్పుడెలా అంది. ఇప్పుడేం ముంచుకుపోయిందట అన్నాను. వాడు కనీసం పాత ఇంట్ల్లో సామాను కొత్తింట్లోకి మార్చేటప్పుడైనా కాస్త మంచిరోజు చూసుకొని నాలుగు ఆటోలు కాని మరీ సామాను ఎక్కువ ఉంటే ఒక లారీ కానీ మాట్లాడుకొని మార్చుకొమ్మని చెప్దామని అన్నది. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే వాళ్ళకి తెలియదా వాళ్ళసంగతి వాళ్ళు చూసుకుంటారులే గోల విసుక్కున్నాను నేను. ఓరీనీ తెలిసిన విషయం చెప్పకపోతే ఎలా గరా అంది. అబ్బబ్బా నీతో చచ్చేచావొచ్చిందే ఎందుకొచ్చిన గోలకాని ఒకటిక్కెట్టు కొని ఇస్తాను వెళ్ళి చెప్పిరా అన్నాను. నువ్వుత్త కుళ్ళు వెధవ్విరా ఆఇచ్చేదేదో మొన్నే ఇస్తే ఆప్రమాణస్వీకారానికే వెళ్ళి వచ్చేదాన్ని కదా పుణ్యం పురుషార్ధం రెండూ కలిసి వచ్చేవి అంది. పోనిలేవే రేపెప్పుడైనా ఆఒబమా వాళ్ళమ్మని చూడ్డానికి మనదేశం రాకపోతాడా అప్పుడు చూద్దూగాని అన్నాను. ఎంతైనా నువ్వు తెలివిగలవాడిరా పరంధాముడూ ఇట్టే మాయ చేస్తావు ఏదిఏమైనా వాడు ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను తప్పకుండా తీసుకెళ్ళి వాణ్ణి చూపించు అంటూ కుర్చీలోంచి లేచి లోపలికివెళ్ళింది. హమ్మయ్య బతుకు జీవుడా అని నిట్టూర్చాను.

1 వ్యాఖ్య »

  1. మొత్తానికి, ఒబామా మనోడేనంటారు. బాగుంది :-) ఇది కధో నిజమో కానీ అమెరికాలో ఓ సారి నాకో చాదస్తపు తెల్ల ముసలావిడతో ఇటువంటిదే ఓ సంవాదం నడిచింది. దాని గురించి త్వరలో నా బ్లాగులో ఓ టపా రాస్తా.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా అబ్రకదబ్ర — మార్చి 6, 2009 @ 11:57 అపరాహ్నం


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.