Pavani5’s Weblog

జులై 25, 2008

రాయని కధ…

ప్రచురించిన వర్గము Uncategorized — pavani5 @ 1:45 అపరాహ్నం

అరోజు లేస్తూనే నాకోఆలోచన వచ్చింది ఒక కధ రాద్దామని. నాకు ఎన్నాళ్ళ నుండో కధలు రాసి గొప్ప పేరు తెచ్చుకోవాలని, స్కూల్లో కాలేజీల్లో వున్నప్పుడైతే ప్రతిసారి కధల పోటీలో పాల్గోని ఎలాగైనా ఫస్ట్ ప్రైజ్ కొట్టాలని చాలా దూరాశ(దురాశ). అప్పుడు రాసినవి అన్నీ నాకు నిరాశే మిగిల్చినయి. అందుకని చాలా గ్యాప్ ఇచ్చి మళ్ళి ఇప్పుడు రాద్దామని పట్టు వదలని విక్రమార్కి లా మొదలు పెట్టాను. ఇక పొద్దున్నే దడా బిడా పనులు చేసేసుకొని, ఏదో అన్నం సుద్ద పప్పు సుద్ద వండి పచ్చడి అనే పదార్ధాన్ని చేసి అక్కడ పడేసి, ఇక కధ రాయడానికి వుపక్రమించా.
    మీకు తెలీదు కాబోలు ఈ మధ్యనే నేను టైపింగ్ నేర్చుకున్నానేమో, ఆ నేర్చుకున్న ఆనందలో ఉత్సాహంలో  పిసి ఆన్ చేసి వర్డ్ ఓపెన్ చేసి ఓం ప్రధమంగా ’శ్రీరామా’ అని అక్షరాలు వెతుక్కొని వెతుక్కొని రాసేటాప్పటికి….. డింగ్……. అర్ధం కాలేదా పవర్ కట్ట్  అండి. ఈ కధ రాయాలి అనే ఆనందంలో టైం చూసుకోకుండా కూర్చున్నానేమో ప్రధమ విఘ్నం. ఏం చేస్తాం ఉసూరంటూ లేచా. సరే ఈ టైం లో ఏదో కాస్త నాలుగు ముద్దలు మింగితే ఆ పనన్నా అవుతుందని అన్నీ సర్దుకొని కంచం ముందు కూర్చున్నాను. ఆ సుద్దలు చూస్తే తినాలనిపించలేదు కాని ఏం చేస్తాం తప్పదు కదా. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అని ఇక అలానే ఏదో ఒకటిలే అనుకొని రెండు ముద్దలు మింగేటప్పటికి బెల్లు మోగింది. ఇప్పుడు ఎవర్రా వచ్చింది అనుకొని వెళ్ళి తలుపు తీసేసరికి పక్కింటి పావలా మణి వచ్చింది.
    ఈవిడ ఇప్పుడెందుకొచ్చిందిరా భగవంతుడా అనుకుంటూ…. ఆ రండి రండి అన్నాను. ఆవిడేమో ఏమి లేదండి ఆఫీసు నుండి మా ఆయన భోజనానికి ఇంటికి వచ్చారు, రోజు రారు అందుకని నేను ఆయన కోసం వండలేదు వున్నది నేను తినేసాను. మీ ఇంట్లో ఏదయినా కూర వుంటే ఇస్తారా నేను అన్నం వండేస్తాను.. అని అన్నది.
   ఆ మాట వినగానే నా మనసు ఆనందంతో గంతులేసింది, ళక్ ళక్ అనుకుంటూ పైకి మాత్రం అయ్యో దాన్దేముందండి, కూర ఏం భాగ్యం అన్నం కూడా ఇస్తా మళ్ళీ మీరేం వండుతారు… ఆయన ఆకలి తో వచ్చారు కదా తీసుకెళ్ళి వెంటనే పెట్టండి. అని నేను చేసిన సుద్దల గిన్నెలన్నీ ఇచ్చేశాను. ఆవిడ పాపం తెగ మొహమాట పడుతూ…. అయ్యో మీరు తింటున్నారు కదా.. మొత్తం ఇచ్చేస్తే మీకు….?
   అయ్యో నా భోజనం అయిపోయిందండి. పర్లెదు తీసుకెళ్ళండి అని చెప్పి ఆవిడని పంపించి చెయ్యి కడుకున్నా. ఇంతలో కరెంట్ వచ్చింది. మళ్ళీ వచ్చి పీసీ ఆన్ చేయబోతూ ఈసారైనా కధ ఏ అడ్డంకులు రాకుండా రాయగలిగితే ఉండ్రాళ్ళు చేయిస్తానని వినాయకుడికి దణ్ణం పెట్టుకొని వచ్చి కూర్చున్నా. ఇందాక శ్రీరామ రాసాను కదండి  కరెంట్ పోవడం వల్ల అది సేవ్ కాలేదు దాంతో మళ్ళి  శ్రీరామ రాసి మొదలు పెట్టాను…
   మళ్ళీ బెల్లు మోగింది, అబ్బా మళ్ళీ ఎవరొచ్చార్రా బాబు అనుకొని లేచి వెళ్ళి తలుపు తీసాను. ఎదురుగా  పాత బట్టలకి స్టీలు గిన్నెలు ఇచ్చే అమ్మాయి. చాలా రోజుల నుండి చాలా పాత బట్టలు  ఇంటినిండా పడి వున్నాయని మొన్న ఈ అమ్మాయి బజారులో కనపడితే ఇంటికి రమ్మని చెప్పాను. నా ఖర్మ కాలి అది  కూడా ఇప్పుడే వచ్చింది. వినాయకుడి ఉండ్రాళ్ళు పనిచెయ్యలా… ఆ అమ్మాయేమో గోల బుట్ట దించమ్మా అంటుంది. ఇక తప్పేటట్టు లేదని, బుట్ట దించి బట్టలన్నీ తెచ్చి దాని ముందు వేసా. ఆ బట్టలకి అదేమో చిన్న కాఫీ కాచే గిన్నె ఇస్తా అంటుంది నాకేమో కనీసం నాలుగు కిలోలు వుడికే గిన్నైనా కావాలి. నాక్కావలసిన గిన్నె కావాలంటే ఇంకా బట్టలు తెమ్మంటుంది అది. ఈ గోల తో ఒక గంట అయిపోయింది, చివరికి అది ఇవ్వకుండానే వెళ్ళింది. చచ్చినట్టు ఆ బట్టలన్నీ మళ్ళీ మూట కట్టి అటక మీద పారేసి, వచ్చి మళ్ళి పిసి ముందు కూర్చున్నా…
      ఇక ఇప్పుడు ఎవరు వచ్చేవాళ్ళు లేరు, ఒక పావు గంట ఆలోచించా ఏం రాద్దామా అని,  కాని మనకి కధలు ఏమోస్తాయి, చదవటం తప్ప రాయటం రాదే. నాలుగు అక్షరాలు రాయటం తీసివేయటం మళ్ళీ రాయటం మళ్ళీ తీసివేయటం మధ్యలో లేచి ఏదోవకటి తినటం తాగటం. ఇంతలో మళ్ళీ  బెల్లు. ఛీ దరిద్రం అనుకొని లేచి వెళ్ళి తలుపు తీసా, ఎదురింటావిడ గ్లాసుడు పాలు కావాలని. సరే కదాని ఇస్తే చిన్న కప్పుడు కాఫీపొడి కూడా ఇవ్వమ్మా అంది, ఆరెండూ తెస్తుంటే ఆ చేత్తోటే కాస్త పంచదార కుడా ఇవ్వమ్మా అంటూ దీర్ఘం తీసింది. ఇంతోటి దానికి కాఫీనే అడగొచ్చు కదా అనుకుంటూ అవన్నీ ఇచ్చి పంపేసాను ఆవిడని…
     టైం చూసేసరికి సాయంత్రం ఆరు. ఇక ఈపూటకి ఇంకెక్కడి కధ ఇంటి జనాలు వచ్చే టైం అవనే అయ్యింది. సాయంత్రం మళ్ళీ ఇంటిపనితోసరి వంటా తంటా. ఇలాగె ఈరోజు సరిపోయింది. ఇక కధ రాసేది ఎప్పుడు నాకు పేరు వచ్చేది ఎప్పుడు నాకల తీరేది ఎప్పుడు. ఈవిదంగా ఆలోచించి చించి నాబుర్ర పగిలిపోతోంది, ఇంతమంది రాస్తున్నారు నేనెందుకు రాయలేను. ఏది ఏలావున్నా రేపు కధ  రాసేతీరాలని ఆ రాత్రి పడుకునే ముందు గట్టిగా నిర్ణయించుకున్నాను.

జులై 24, 2008

అతకని బతుకులు (ఓ హిట్ సినిమా…)

ప్రచురించిన వర్గము Uncategorized — pavani5 @ 1:55 అపరాహ్నం

ఆరోజు చొక్కలింగం గారి సినిమా విడుదల సందర్భంగా చాలా హడావిడిగా ఉంది. చాలా రోజుల తరువాత మంచి సినిమా చూడవచ్చని అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురుచుసారు. రిలీజుకి ముందునుండే టికెట్లు కొనేవాళ్ళు కొనేసుకున్నారు. కొననివాళ్ళు రిలీజురోజు ఉదయాన్నే లైను లో నిలబడి టిక్కట్లు తిసుకుని హడావిడిగా సినిమా హల్లోకివెళ్ళారు  తోసుకుంటు తొక్కుకుంటు. ఒక అరగంట పాటలు (తరువాత ఆ హాల్లో రిలీజు అయ్యే సినిమావి) మరొ అరగంట యాడ్సయిన తరువాత, తెరలెగిసింది దానితోపాటె చెవులు పగిలిపోయెంత సంగితం (సౌండ్). 
  ముందుగా మన హీరో గారి పేరు ఎర్ర అక్షరాలతో ఎంతో అందమైన గ్రాఫిక్స్త్ తో, ఆ వెంటనే హీరోయిన్ గారి పేరు నీలిరంగు అక్షరాలతో ఇంకా ఎంతో అందమైన గ్రాఫిక్స్ తో. ఈ సినిమాలో మన హీరోయిన్ గారు రెండు ఈగల్ని పెంచుకుంటారు వాటి పేర్లు వేయించారు మన ప్రొడ్యుసర్ గారు అర్ధం కాని గ్రాఫిక్స్ తో ఎంతో అందంగా, అలాగే హీరో గారు పెంచుకునే రెండు నీటి ఏనుగుల పేర్లని కూడా. ఇలా ఒక్కో పేరు ఒక్కో రంగు అక్షరాలతో అందమైన గ్రాఫిక్స్ తో చివరి లైట్ బాయ్ వరకు ఎవరిని వదలకుండా అందరి పేర్లు రాయించారు మన ప్రొడ్యుసర్ గారు. ఈ విధంగా టైటిల్స్ ముగిసాయి. ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు మన హీరో ఎంట్రన్స్ గురించి. ఇంతలో ’విశ్రాంతి’ అని వచ్చింది. ప్రేక్షకులకి అర్ధం కాలేదు ఏమయిందో, ఇంతలో మళ్ళీ మొదలైంది.
ఆ హాల్లో తరువాత రిలీజు అయ్యే సినమా యాడ్, ముందు సీటు పై కాళ్ళు పెట్టరాదని, హాలు నీట్ గా వుంచాలని, ఎవరి వస్తువులపై వారిదే బాధ్యత అని, ఈ విధమైన యాడ్స్ అయ్యాక  మళ్ళీ మొదలింది సినిమా. కనీసం ఇప్పుడైనా సినిమాలోని ఏ కారెక్టర్ అయినా కనపడకపోతారా అని ఎదురు చూసారు ప్రేక్షకులు, కాని తెర మీద శుభం కార్డు పడింది. ఇక మన ప్రేక్షకులకి తిక్కెక్కి ఏమి అర్ధం కాక ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూండగా తెర మీద ప్రొడ్యూసర్ గారు ప్రత్యక్షమయ్యారు. 
   అయ్యలారా… అమ్మలారా… అందరికి నమస్కారం. నేను ఖర్చు పెట్టినదాంట్లొ సగమైనా నాకు వచ్చేట్టు చేసుకోగలిగాను. దీనికి ఇంత సహకరించినందుకు మీకు నా ధన్యవాదాలు. ఇప్పుడు నేను మీకు నాలుగు ముక్కలు చెప్పదలుచుకున్నాను. అందులో ఒకటో ముక్క సెన్సార్ దగ్గర నాలుగు సీన్లు కటింగండి. ఆ తరువాత  రెండో ముక్క ప్రివ్యు వేసామండి, దానికి వచ్చిన వాళ్లంతా కులం పేరుతొ కొన్ని సీన్లు, జంతు ప్రేమికులు వచ్చి వాళ్ళు కొన్ని సీన్లు, పిల్లలతో చేయించామని కొన్ని సీన్లు, క్లాసికల్ డాన్సర్స్ ని కించపరిచేలా వున్నాయని కొన్ని సీన్లు, లెక్చరర్ లని కించపరిచేలా వున్నాయని కొన్ని సీన్లు, పోలీసులు లాయర్లు డాక్టర్లు వీళ్లని కించపరిచేలా వున్నాయని వాళ్ళు కొన్ని సీన్లు, ఈ విధంగా ఎవరికి అడ్డు వచ్చిన సీన్లు వాళ్ళు కత్తిరించుకుంటూ పోయారండి. కానీ ఆ విశ్రాంతి కార్డు ఈ శుభం కార్డుల్ని మాత్రం ఎవరూ కత్తిరించలేదు అందువలన మీకు అవైనా చూపించే భాగ్యం నాకు కలిగినందుకు నాకు ఎంతో ఆనందంగా వుంది.. ఇక ఈ దెబ్బతొ నేను సినిమా పేరెత్తితే ఒట్టు. ఇప్పుడు వచ్చిన ఈ డబ్బుల్తో మా వూరైన తిక్కావారి పాలెం వెళ్ళి నాకున్న రెండెకరాల పొలం చూసుకుంటూ బతికేస్తాను. నమస్కారమయ్య…

జులై 16, 2008

భూలోకసమారాధన…

ప్రచురించిన వర్గము Uncategorized — pavani5 @ 9:25 పూర్వాహ్నం

సత్యలోకంలో నిద్రిస్తున్న బ్రహ్మకి కుడివైపు వున్న తల నెప్పి రావడంతో నిద్ర మెళకువ వచ్చింది. కళ్ళు తెరుస్తూనే భారతీ భారతీ అంటూ పిలిచాడు…
పక్కనే వీణ తీగలు సరి చేసుకుంటున్న సరస్వతి చిరాకుగా ఆయన వంక ఏమిటి అన్నట్టు చూసింది…
శిరోభారము అధికముగా వున్నది, ఏమయినా కాస్త ఔషధము తెచ్చి మర్ధనం చేయమనగా…
శిరోభారము కాక ఇంకేముండును…? ప్రతి దినము ఒకే పనియైన విసుగురాక ఏమి వచ్చును.. స్వామి నేను చెప్పేడిది వినుడు, నాకునూ ఈ పూవ్వులో కూర్చొని కూర్చోని కాళ్ళు పీకుచున్నవి, ఈవీణ వాయించీ వాయించీ చేతులు పీకుచున్నవి. కనుక మనము ఒకసారి  భూలోకమునకేగుదుము.. అచట బోలెడు వింతలువిడ్డూరములు వున్నవట. కావున ఒక్కసారి పోయివత్తుము..
సరస్వతీ నీకు తెలియనిది ఏమున్నది… ఈ దినమున పది లక్షల మానవులని సృష్టించవలసి వున్నది, కావున మరొకసారి యేగెదము… అటుల మూతి ముప్పది వంకర్లు తిప్పకుము..
నాధా అటుల కాదు, మీరు ఈరకముగా రోజు ఇంతమంది మానవులని సృష్టించిన యెడల భూలోకము ఏమగును.. ఇప్పటికే అచట మానవులతో భూలోకము కిటకిటలాడుచున్నది.. కనుక ఈరోజుకి  సృష్టి ఆపివేసి, మనము భులోకపయనమగుదుము… అని పట్టుపట్టడంతో చేసేది లేక భూలోకానికి పయనమయ్యెను బ్రహ్మ సరస్వతిలు…
భూలోకమున వారిరువురు  చూడవలసిన ప్రదేసాలన్నియూ చూసెను. సరస్వతీ దేవి ఆనందానికి అవధులు లేవు. మానవుల ఆనందం చూసి సరస్వతికి కించిత్ ఈర్ష్య కూడా కలిగింది. ఈ విధంగా భూలోకమంతా సందర్శించి అమితానందంతో తిరిగి సత్యలోకం పయనమయ్యారు..
తిరిగి ఎవరి విధుల్లో వారు నిమగ్నమయ్యారు. అయినా కూడా సరస్వతిదేవికి ఏదో తీరని లోటు. సమయము చూసుకొని బ్రహ్మతో… స్వామీ..! అని పిలిచెను,
బ్ర  :  ఈ మారేమి…..?? (బ్రహ్మ కి గుండెల్లో గుండ్రాయి పడింది)
స  : ఏమి లేదు నాధ…. ఆలోచించగా ఆలోచించగా… భూలోకమునందు మానవులు ఎందుకు అంత ఆనందంగా వుంటున్నారో నాకు అర్ధమయింది…
బ్ర  :  ఎందుకూ….??
స  :  ఏమీ లేదు ప్రభు… మానవులు తరచూ వారి వారి గృహములందు చిన్న చిన్న వేడుకలు జరుపుకొనుచు, బంధుమిత్రులను ఆహ్వానించి, అందరూ కలిసి ఒకేచోట భుజించి, వారి వారి కష్టసుఖాలని ఒకరికి ఒకరు పంచుకొనుచు ఆనందించుచున్నారు.. మనకి ఆ భాగ్యము లేదే అని చింతించుచున్నాను..
బ్ర  : అయిన ఏమి చేయుదుమో వివరించుము వాణీ..
స  : స్వామీ…! మనమూ మన బంధుమిత్రులని పిలిచి అలాంటి వేడుక ఒకటి జరపవలెనని నాకు కోరికగా వున్నది…
బ్ర  :  దేవి మానవులు మనల్ని పూజిస్తూ వ్రతాలు చేసెదరు, అవి మనం ఏల చేసెదము…??
స  :  నాధా వ్రతములన్నీయూ మనము కనిపెట్టినవే కదా.. కావున మరొక వ్రతము కనిపెట్టెదము..
బ్ర  :  వాగ్దేవి లెస్స పలికితివి భూలోకమున ఒక చలనచిత్రము నందు చెప్పినట్టుగా ’ఎవరూ కనిపెట్టకుండా మాటలు ఎలా పుడతాయని’… ఎవరూ కనిపెట్టకుండా వ్రతాలెలా పుడతాయి… అయినచో అదేదో నీవే చెప్పు భారతీ…
స  :  అటులైనచో మనము ’భూలోక సమారాధన’ అని ఒక వ్రతము చేసెదము ప్రభు..
బ్ర  :  బాగున్నది.. వెంటనే ఆచరించెదము.. అయిన నారదుడుని వెళ్ళి అందరికి ఆహ్వానం అందించి రమ్మని పంపెదము..
స  :  అటులనే స్వామీ.. కానీ ఆదినమునకు కావలసిన క్షీరమంతయూ విష్ణుమూర్తీ అన్నయ్యను  .. మరియూ ఆ శ్రీధర అన్నయ్యను గంగను పంపమని చెప్పుము…
ఆ రోజు రానే వచ్చింది… సత్యలోకమంతా చాలా హడావిడిగా వుంది, శివపార్వతులు, వినాయకుడు (ఫ్యామిలీ), కుమారస్వామీ (ఫ్యామిలీ), లక్ష్మీనారాయణులు, ఇంద్రుడుశచీదేవి, దిక్పాలకులు, మిగతా బంధుమిత్రులతో కిటకిటలాడిపోతోంది. ఎలాగైతేనేం వ్రతం పూర్తిఅయ్యింది. అంతా కలిసి ఆనందంగా విందారగించారు. ఆ తరువాత బ్రహ్మసరసతులు అందరికి పట్టువస్త్రాలు చందనతాంబూలాదూలు సమర్పించుకున్నారు. అందరూ వారి వారి కొండలకు పయనమౌతూ బ్రహ్మసరస్వతులను ఎంతో కొనియాడారు.. లక్ష్మీ పార్వతులైతే ఏకంగా సరస్వతిని ఎత్తేసారు.. ఇంత మంచి ఆలోచన వచ్చినందుకు, ఇలాగే మేము కూడా చేయకుతూహల పడుతున్నామని చెప్తూ, ఈ పట్టు వస్త్రములు చాలా బాగున్నవి అని అన్నారు.
స  :  భూలోకమునందు కళామందిరమని ఒక వస్త్రాలయమున్నది, మొన్న మేము పోయినప్పుడు చూచి అచటనుండి తెప్పించితిమి. అని చెప్పగా…
లక్ష్మీ పార్వతులు సంతసించి ఈసారి ఎవరింట ఈ వేడుక జరుపుకుందమా అని అలోచించుకుంటు వుండగా అక్కడ శివ నారాయణులకి, దేవేంద్రులకు గుండెల్లో యధావిధిగా గుండ్రాళ్ళు పడ్డాయి..
ఈవిధంగా ’భూలోకసమారాధన’ సమాప్తం…

నీతి: పావని బ్లాగు ఓపెన్ చేస్తే ఇలాంటి తలనెప్పి తప్పదని… :-)

మే 24, 2008

ఇది ఎక్కడి పోలిక …??

ప్రచురించిన వర్గము Uncategorized — pavani5 @ 6:37 పూర్వాహ్నం

“చూడడానికి మడోన్నాలా కనపడతావు …
కానీ నీలో కనపడని మదర్ థెరిస్సా కూడా వుంది”
ఇది కంత్రీ సినిమా డైలాగ్. జస్ట్ ఇప్పుడే టీవీలో ఛానల్స్ మారుస్తుంటే నా ఖర్మ కాలి ఒక ఛానల్ లో చూసా. ఇది విని నాకు ఏడవాలో ఆనందపడాలో అర్ధం కాలేదు. కానీ కోపం మాత్రం వచ్చింది. అసలు ఆ డైలాగ్ రాయడంలో ఆ రైటర్ గారి ఆలోచన ఏమిటో అర్ధం కాలేదు. నేను ఆ సినిమా చూడలేదు. ఏ సిట్యుయేషన్ లో హీరో గారు హీరోయిన్ గారిని మదర్ తో పోల్చారో నాకు అర్ధం కాలేదు. మీకెవరికైనా అర్ధం ఐతే దయచేసి నాకు చెప్పండి..

మే 23, 2008

ఓలమ్మో ఓలమ్మో…

ప్రచురించిన వర్గము Uncategorized — pavani5 @ 9:41 పూర్వాహ్నం

హాయ్ హలో నమస్కారం ….
మీరంతా ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్న మీ అభిమాన కార్యక్రమం “ఓలమ్మో ఓలమ్మో” తో మీ ’అశాంతీ’ ఈవారం కూడా ఎంతో అందంగా మీముందుకు వచ్చింది. ఈవారం మనముందు perform చేయడానికి మన సెలబ్రిటీస్ అందరూ రెడిగా వున్నారు. ముందుగా మన జడ్జిస్ ని ఇన్వైట్ చేద్దాం. ముందుగా ఒకప్పటి ప్రముఖ తార ’నాసి’ గారు, ’డింగరాల జక్రయ్య’ గారు  మరొక తార ’పిడతల వెంకు’ (పిడతల రాధ గా ఫేమస్ అయిన దన్నుశ్రీ గారి అమ్మగారైన పిడతల వెంకాయమ్మ గారు. ఆవిడని అభిమానులు అందరూ పిడతల వెంకు అని ముద్దుగా పిలుచుకుంటారు. ఈవిడకి కూడా అభిమానులు వుంటారా…? అని మీకు డౌట్ రావచ్చు, దాంట్లో అతిశయం ఏమీ లేదు. ఈవిడ కూడా ఆమే శక్తి మేరకు తను నటించిన చిత్రాలలో ఎంతో పొదుపుగా  నూటయాభై గ్రాముల బట్టలు మాత్రమే వాడేవారు. ఆ విధంగా ఈవిడ కూడా ఎంతో మంది అభిమానులని సంపాదించుకోగలిగారు.) గారిని కూడా వేదికమీదికి సాదరంగా అహ్వానిస్తున్నాం. sir please welcome …. madam please welcome …….

మన ఫస్ట్ సెలబ్రిటి ’చున్ కౌర్’ మనముందు  perform చేయ్యడానికి రెడీగా వున్నారు, కానీ అప్పుడే కాదు వాళ్ళు వచ్చేలోపు మనం తీసుకుందాం ఒక చిన్న బ్రేక్……. వెంటనే వచ్చేస్తాం ఇక్కడే వుండండి …… చూస్తూనే వుండండి ’గమిని టీవీ’ ……

  B-R-E-A-K

వెల్ కం బ్యాక్ టూ “ఓలమ్మో ఓలమ్మో” ….
ఇప్పుడు మనముందు  perform చేయ్యడానికి వచ్చారు ’చున్ కౌర్’ గారు, చెప్పండి ఏ సాంగ్ perform చేస్తున్నారు ….??
నేను ’లక్ష్యం’ మూవి నుండి ’ఎవడు ఎవడు’ అనే సాంగ్ చేయబోతున్నానండి …
ఓ …. చాలా మంచి పాట అది … ఆల్ ది బెస్ట్ చున్ … స్టార్ట్ చేస్తావా ….
ఓకె ..
స్టార్ట్ మ్యూజిక్ …..
దడక …. దడక …. డిడుమ్ … డిడుమ్ …. ఠంగ్ … ఠంగ్ ……..

వెరుజొవుత్వ్వ్వ్త్ప్౪ఉత్రెత్వెర్వ్ర్[వ్త్వె

(ఈ విధంగా కాసేపు మన సెలబ్రిటి వూగి వూగి అభిమానుల్ని కూడా వూగించేసింది.. అది చూస్తే నాకు అమ్మోరు జాతర గుర్తొచ్చింది)
చప్పట్లు [మీరూ.. కొట్టండి కాస్త (నన్ను కాదండోయి)]
exellent performance చున్, చాలా బాగా చేసారు. సరే మన జడ్జెస్ ఏమంటారో చూద్దాం ..
madam నాసి గారు చెప్పండి …

చున్ నిజంగా చాలా exellent గా చేసారు. మంచి పాట ఎన్నుకున్నారు. మంచి మీనింగ్ మంచి మెసెజ్ వున్న పాట ఎంచుకున్నారు. నిజంగా మూవిలో యాక్టర్స్ చేసినట్లే అసలు ఎక్కడా మిస్ అవకుండా చేసారు. చాలా బాగుంది … గుడ్ కీపిటప్ …

madam  పిడత వెంకు గారు మీరు చెప్పండి …

ఫస్ట్ అఫ్ ఆల్ ఐ వాంట్ టూ సే ఎబౌట్ యువర్ కాస్ట్యూమ్స్ చున్. నైస్ సెలక్షన్. చున్ నాకు నీ డ్రస్ చాలా నచ్చింది. ఆ సాంగ్ కి బాగా సూట్ అయింది. (రెండు జతల బూతద్దాలు పెట్టుకొని చూసినా మనకి ఆ డ్రెస్స్ కనపడదు. ఈవిడకి ఎక్కడ కనపడిందో… అంటే అప్పట్లో ఆవిడ కూడా అలాంటి డ్రెస్స్ లే వేసిందేమో, అందుకే ఆవిడకి కనపడి వుంటుంది …)

sir ఇప్పుడు మీరు చెప్పండి  ’డింగరాల జక్రయ్య’ గారు …

చాలా బాగుందమ్మ, మంచి ఫీల్ తో చేసావు. మంచి ఎనర్జీటిక్ గా వుంది. కీపిటప్, ఇంకొంచం ప్రాక్టీస్ చెస్తే ఇంకా బాగుంటుంది …

చూసాం కద ఇప్పుడు మన జడ్జెస్ అభిప్రాయాల్ని …
మన చున్ కౌర్ కి వచ్చిన మార్కులని చూద్దాం ..

madam నాసి గారు …
80 …
 
madam  పిడత వెంకు గారు …
85 …

sir …
75 …

ఇప్పుడు ఎస్ ఎమ్ ఎస్ రిక్వెస్ట్ … మన ప్రేక్షకులని ఎస్ ఎమ్ ఎస్ అడుగుతావా చున్ …
చూసారు కదా నా performance … నచ్చింది కదా … నచ్చేవుంటుంది … తప్పక నాకు మీ ఓటింగ్స్ తెలిపి నన్ను ఫర్ దర్ రౌండ్ కి పంపిస్తారని ఆశిస్తున్నాను. నాకు ఓట్ చేయాలంటే …..
********  ******* ఈ నంబర్ కి  ఎస్ ఎమ్ ఎస్ చేయండి. థ్యాంక్యూ …(బ్లాగర్లు కూడా ఓట్ చేయాలంటే వారీకి ఓట్ చేసే సదుపాయం కల్పిస్తాం)

ఇప్పుడు నెక్ష్ట్  సెలబ్రిటి వస్తున్నారు … కాని ఇప్పుడే కాదు …వాళ్ళు వచ్చేలోపు మనం తీసుకుందాం ఒక చిన్న బ్రేక్……. వెంటనే వచ్చేస్తాం ఇక్కడే వుండండి …… చూస్తూనే వుండండి ’గమిని టీవీ’ ……

  B-R-E-A-K

వెల్ కం బ్యాక్ టూ “ఓలమ్మో ఓలమ్మో” ….
ఆ ’అపుల్స్ రాణి’ ఏ సాంగ్ perform చేస్తున్నారు ….??
నేనూ రీమిక్స్ సాంగ్ చెయబోతున్నా …
ఓకె సాంగ్ చెప్పరన్నమాట డైరెక్ట్ గా చేస్తారా … చేయండి …
ఆల్ ది బెస్ట్ బాగా చేయండి …
స్టార్ట్ మ్యూజిక్ …..

టట్టడాంయి ….   టట్టడాంయి ….   టట్టడాంయి ….  ట ట ట ట …. టాఆఆఆఆఆ …..

 వ్తిఒజ్తొత్వ్జ్ర్వ్పౌత్వె,వెపిరెఉత్వొఎజ్ద్స్ద్,అస్;ఎఇఒవెపుత్వెనస్ద్మ్;అస్కెఉత్ర్
మ్న్ల్స్క్జ్వ్పివుర్వెఅస్మ్;అస్కెవెఉత్వె;అస్ద్వ్రివెజ్గ్ ….. జ్ ర్ ర్ర్ ర్ ర్ ర్ ర్  ఢాం ….. (ఒక్కసారి అంతా నిశ్శబ్దం ఏం జరిగింది …..???)

 అరేరే ……… ఏంటి అపుల్ ఏమైంది ….. అలా పడిపోయావు…
:-(  

ఓకే జడ్జెస్ ఏమంటారో విందాం ….
madam నాసి గారు చెప్పండి …

ఏంటి అపుల్ నేను నీ నుంచి చాలా ఎక్స్ పెక్ట్ చేసాను, స్టాటింగ్ చాలా బాగా స్టాట్ చేసావు. అసలు ఇవ్వాళ్ళ నీకేమయింది ….?? ఐ… ఐ… ఫెల్ట్ రియల్లీ… ప్చ్ ….. (అంతకన్నా ఇంగ్లీషు రాదు మనకి)

ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు madam, నిన్నంతా ప్రాక్టీస్ చేస్తూనే వున్నాను. నైట్ ఫుడ్ కూడా తీసుకోకుండా ఫుల్ కాన్ సన్ ట్రేట్ చేసాను. (గంగ గోదావరీ జలాలు కూడా ఆ డ్యాన్సు చూడడానికి వచ్చేసాయి. ఆవిడ కళ్ళలో అని  అర్ధమయ్యేవుంటుదనుకుంటా ….! వాళ్ళు బాగా చెయ్యలేదని ఏడుస్తారో, పక్కవాళ్ళు బాగా చేస్తారేమో అని ఏడుస్తారో, లేక మనల్ని బాగా ఏడిపించలేకపోయారని ఏడుస్తారో నాకైతే తెలియదు. మీకెవరికయినా తెలిస్తే కాస్త నాక్కూడ చెప్పండి..)

madam  పిడత వెంకు గారు మీరు చెప్పండి …

అశాంతి నేనేం చెప్పలేకపోతున్నాను … అపుల్ మీఇఇఇ సాంగ్ ఓకె బట్ డ్రెస్స్ కూడా కాస్త హెవీగా వుంది( ఇందాక సెలబ్రిటి కంటే ఈవిడ కాస్త రెండు గ్రాముల బట్టలు ఎక్కువగా వేసుకున్నందుకు మన పిడత కి హెవీగా కనపడిందనుకుంటా…!) ఓకె ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ….

:-(

సార్ మీరూ …

అపుల్ తప్పు జరిగిపోయింతర్వాత బాధపడి ప్రయోజనం లేదు. ఇప్పుడు మనం ఏమి చేయలేము కదా.. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోండి. బెస్ట్ ఆఫ్ లక్ …

:-(

(అసలు వీళ్ళు పడేది నిజంగానేనా లేక ప్రేక్షకుల సానుభూతి కోసమా… ఎస్ ఎమ్ ఎస్ లు వస్తాయనా …?)

మన అపుల్ కి వచ్చిన మార్కులని చూద్దాం ..

madam  పిడత వెంకు గారు …
అదీ… అశాంతీ మేము డిసైడ్ చేసుకున్నాం లాస్ట్ లో చెప్తాం మార్క్స్ … (ఇదొక బోడి టెన్షన్ మళ్ళీ మనకి…)

ఒకే… జడ్జెస్ టెన్షన్ లో పెట్టారు … మన ప్రేక్షకులు రెడీగా వున్నారు ఓటింగ్ చేయడానికి (ఎవరున్నారో…)  ఎస్ ఎమ్ ఎస్ రిక్వెస్ట్ అడుగుతావా …!

:-(   నా ముందు performances అన్నీ మీరు చూసారు, మొదటి నుండి నాకు ఓటింగ్ చేసి నన్ను ఇంత దూరం తీసుకొచ్చారు (ఎవరేసారో …?? వాళ్లకి వాళ్ళే వేసుకుంటారేమో…!), ఇలాగే ఇప్పుడు కూడా నాకు ఓట్ చేసి నన్ను ఫర్ దర్ రౌండ్ కి ప్రమోట్ చేస్తారని ఆశిస్తున్నాను. నాకు ఓట్ చేయాలంటే …….
********  ******* ఈ నంబర్ కి  ఎస్ ఎమ్ ఎస్ చేయండి. థ్యాంక్యూ …

ఎంతో భారంగా గడిచింది ఈ performance, అపుల్ చాలా నిరాశ కి లోనైంది, తను టెన్షన్ లో వుంది. ఓకె లాస్ట్ సెలబ్రిటి వచ్చేలోపు ఒక చిన్న బ్రేక్ తీసుకొని వద్దాం …

                                        B-R-E-A-K

వెల్ కం బ్యాక్ టూ “ఓలమ్మో ఓలమ్మో” ….

ఇప్పుడు లాస్ట్ సెలబ్రిటి ’మనురాయ్’ వస్తున్నారు …
మను ఏ సాంగ్ చేయబోతున్నావు …??
నేను డైరెక్ట్ గా చేసి చూపిస్తాను, చెప్పను…
ఏంటి ఇవ్వాళ్ళ అందరు సస్పెన్స్ లో పెడుతున్నారు. సరె టైం వేస్ట్ చేయకుండా మన మను  performance చూద్దాం. ఆల్ ది బెస్ట్ మను…

స్టార్ట్ మ్యూజిక్ …..

డం డమా డం …. టం టం టం ……. బం బం బ బ బం ….. తం తం త త తం …
ఓ… పిడతా…………
ఔననవమ్మ ప్రతి మగ జన్మ విసుగెత్తకముందే …. ఓ పిడతా…. నా పిడతా……..!

స్జ్స్న్ద్స్జ్వెఉరొవిఎస్చ్,దస్చ్కెప్విర్వెనస్దివెవెవ’దివెర్య్చ్క్లుఇఒఅఅసుఇర్హ్
ల్చ్ల్వెర్వ్య్త్వ్హ్వ్ద్స్న్చ్లస్క్దివెయ్వెన్ల్ద్ద్వ్ర్వెవద్విర్……..

చప్పట్లే చప్పట్లు ……………. చప్పట్లే చప్పట్లు ……………చప్పట్లే చప్పట్లు

(మీరు కూడా కొట్టడానికి రెడి అయ్యే వుంటారు… నన్ను.. తొందరగా రాసేసి పారిపోతా….)

హా…. మను ఎంత బాగా చేసావు, చూడు జడ్జెస్ అందర్నీ ఏదో లోకానికి తీసుకెళ్ళిపోయావు. తొందరగా వారిని ఈ లోకంలోకి తీసుకొద్దాం. ఈ పాట కి ఒక స్పెషాలిటి వుంది, అదేంటో తెలుసా (ఒక లీటరు చొంగ కారూస్తూ మాట్లాడుతారు మన యాంకర్లు)
ఆ అశాంతి తెలుసు ఈ సాంగ్ మన పిడతల వెంకాయమ్మ గారి డాటర్ నటించిన పక్షిగోపి అనే సినిమాలో పాట..
అది సరే … ఆ సాంగ్ ని నువ్వు  madam గారి ముందే perform చేసావు, నువ్వు ఎలా ఫీల్ అయ్యావు……
నాకు చాలా హాపీగా వుంది. కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాను… కానీ madam గారి ముందు చేయడం నాకెంతో హాపీ గా వుంది. ఇక ఈ ఓలమ్మో ఓలమ్మో టైటిల్ నాకు రాకపోయినా నేను ఫీల్ అవను. ఈ సంతోషం ముందు ఆ బాధ చాలా చిన్నది అని నా ఫీలింగ్ …

ఓకే మన జడ్జెస్ ఏమంటారో చూద్దాం..

 madam నాసీ గారూ మీరు చెప్పండి ….

exellent performance మను. అసలు ఎంత బాగా చేసావంటే చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు. చాలా బాగా చేసావు..

సార్ మీరు చెప్పండి …
మను ఎక్స్ ప్రెషన్స్ చాలా బాగుంది. మంచి ఈజ్ తో చేసావు, చాలా బాగా చేసావు. గుడ్ కీపిటప్…

ఇప్పుడు మన పిడత గారు చెప్పాలి …
అక్చ్యులగ నేను చెప్పాలనుకున్నవన్నీ వాళ్ళు చెప్పేసారు. నా ఒపినియన్ కూడా అదే.. ఓకే..
(వాళ్లమ్మాయి కంటే బాగా చేసిందని ఎలా ఒప్పుకుంటుందిలేండి…)

ఇప్పుడు మార్క్స్ ….

సార్…
95….
నాసీ గారు …
95…
పిడత గారు…
65 …

హాపీ నా మను, ఇంక మన ప్రేక్షకులని ఎస్ ఎమ్ ఎస్ అడుగుతావా …….

చూసారు కదండి, మీకు నచ్చే వుంటుంది నా performance. సో.. నాకు ఓట్ చేసి నన్ను పైకి పంపించండి..(పైకి అంటే ఎక్కడికో…….?)
********  ******* ఈ నంబర్ కి  ఎస్ ఎమ్ ఎస్ చేయండి. థ్యాంక్యూ … (ఏదో మొబైల్స్ కొనుక్కునేది వీళ్ళకి  ఎస్ ఎమ్ ఎస్ చేయడానికే అన్నట్టు చెప్తారు..)

అయిపోయాయి అందరి performances.. ఇక ఒకళ్ళు మాత్రం వెయిటింగ్ మార్క్ కోసం.. పాపం మన అపుల్ ఎంతో టెన్షన్ గా ఎదురు చూస్తోంది…
జడ్జిస్ చెప్పండి…

50….   50…….. 60…… (ఈ మార్కులేవో అప్పుడే చెప్పొచ్చు కదా … దీనికి సస్పెన్స్ ఒకటి ఎందుకో)

ఓకే అపుల్ హాపీనా ……
:-( థ్యాంక్యూ ….

ఒకే ఇవ్వాల్టి రౌండ్ కాస్త సరదాగా కాస్త టెన్షన్ గా సాగింది.. ఇక రేపు ఎలిమినేషన్ రౌండ్. ఇంకా టెన్షన్ గా వుంటుంది. మిస్ కాకండి. టేక్ కేర్… గుడ్ నైట్… కీప్ స్మైలింగ్….

బ్లాగర్లు కూడా ఓట్ చేసి వాళ్ళని గెలిపించగలరు…! ఎందుకంటే ఎంతో మంచి మెసెజ్ మంచి మీనింగ్ వున్న పాటలు మనముందు ప్రదర్శించారు  కదండీ ……

మే 21, 2008

అయ్యలన్నల ముచ్చట్లు …

ప్రచురించిన వర్గము Uncategorized — pavani5 @ 5:44 అపరాహ్నం

******** ట్రింగ్ ట్రింగ్ …….
హలో చెప్పరా ….
ఏడున్నావురా ….??
చెప్పరా ఏంది …
ఏం లేదు కలుస్తాంటివి కదరా ..
నువ్వేడున్నవు …..??
నేను వచ్చిన ఈడికి, మల్లేష్ బీ వస్తుండు…
ఎదవ ఆడ్ని ఎందుకు రమ్మన్నవ్ బే …
వాడు వస్తాన్నడురా నేన్ పిలవలే …
సరే వస్తున్నలే పది నిమ్ షాల్లో, కానీ ఆడు ఏమన్న ఎక్కువతక్కువ మాట్లాడిండంటే నేనుండ ఆడ…
నువ్వు రార నేను చూస్కుంట కద ..(చూస్కుంటాడంట, ఏం చూస్కుంటాడో…)
సరె పది నిమ్ షాల్లొ ఆడుంటా …
    *********
ఏందిరా మల్లేష్ ఇంత లేట్ చేష్ నావ్…
లేదురా నాని, ఇట్ల ష్టాట్ (స్టార్ట్) అయిననో లేనో మా అయ్య పట్టుకుండు …
ఏందిరా మల్లి ఏం క్లాస్ పెట్టిండు …??   ఈడు ఇంక రాలేదు …. (మళ్ళీ ఫోను )
ఏందిరా వెంకట్  ఏడున్నవ్ …..??
సావకురా నీఅయ్య  వస్తున్న…వచ్చిండ పాగల్ గాడు ….
ఆ ఆ (పాగల్ గాడు వచ్చాడని చెప్తున్నాడు), సరే రా జల్ది …
సస్తున్నవేందిరా వస్తనేవున్న …
ఆ ఏమన్నడ్ రా మీ అయ్య ….
పెట్రోల్ కి పైసల్ ఇస్తలేడ్ రా … ఎమన్నంటే గా డిగ్రి కంప్లిట్ చెయమంటుండు. మనకేమో గా ఇంగ్లీషు రాదు, గా బుక్కు సూస్తే నెత్తి తిరుగుతుంది బై ….
ఏదొకటి చేషి పాస్ గాబే, ఎన్ని రోజులని నైన (నాన్న) మీదుంటవ్ రా.
నీకుంటే తెలుస్తదిరా, ఇంట్ల నైన ఒకదిక్కు అన్నఒకదిక్కు సంపుతున్నరనుకొ …
అట్లగాదురా, పైసలన్నపెట్రాదురా …(పాస్ అవడానికి డబ్బులు పెట్టమని వాడి సలహ)
నీఅయ్య దిమాక్ వున్నదారా, ఒకదిక్కు చెప్తనే వుంటి మల్ల గదే అంటావ్. ఒకదిక్కు పెట్రోల్ కే వందియ్యమంటే సస్తున్నడ్ర మాఅయ్య.

   ***********

హయ్ మామ ….
హయ్ ర
అరే చిన్న ….! టు బై త్రీ చాయ్ తేరా …
మామ నాలిక గుంజుతుందిరాబై …
అరే మల్లెషా ఎమన్నంటే అన్నా అంటావ్ గాని, నీకిది అవసరమాబే.
అట్ల కాదురా మామ అలవాటై సచ్చినంక ఎట్లైడిసిపెడ్తంరా …
అబ్బబ్బ సస్తున్నరేందిర, ఇప్పుడా సిగరెట్ గావల గంతనే కదా. జరాగు తెప్పిస్త ..
అరె చిన్న …! మూడు సిగరెట్లు తేరా …
ఆ గట్లనే అన్న …
ఎందిరా వెంకట్ ఇంత లేట్ చేసినావ్ ….
అది కాదురా వస్తుంటే తొవ్వల గాపోరి కన్పించిందిరా …
ఎవర్రా …??
అన్న టీ …
గదేరా గా అనూష ….
మామ గప్పుడు నీజేబులు కతం చేసింది కదారా, మల్లెందుకొచ్చిందంట ….??
ఆడికి నేను బండి ఇట్ల తిప్పుతనే వున్న, స్కూటిపెప్ మీదవచ్చిందిరా …
ఏడ్నుంచి తెచ్చిందిరా గా స్కూటి …..? ఎవడ్ని పట్టిందిరా మల్లి …?
కాదుబే, మంచి జాబు వచ్చిందంట, బండి కొన్నదంట ….
ఓ …… మామా….. ఇంకెందిరా చేస్కోరాదు ….
ముయ్యిబే ….
అరే మామ సిన్మాకి పోదంరా..
ఇగో నీకు నీఅయ్య పైసలు ఇయ్యకపోయిన మేము మంచిగ కూసుండబెట్టి తినిపిస్తుంటే బాగ ఎక్కువైనాదిర.
అరె మామ అట్ల సూడు……..!
ఏముందిరా గీ పోరిలు ఎం సదువుతర్ర ఎంత సదువుతర్ర ఈళ్లని సూసి మా అయ్య నన్ను సంపుతుండు గా డిగ్రి గురించి …         ఐన మంచిగ 10 th అయినంక ఎవడొ ఒక గొట్టం గాన్ని  పెండ్లి సేస్కోక ఎందుకురా సదువు సదువు అంటరు
అవు రా మామ ఏడికి పో ఈళ్ళే
interview కి పోయినా ……….
జాబ్ లో కూడ ఫుల్ కాంపిటిషన్
ఇంకా  reservation లు ఒకటి

  ***********  

ట్రింగ్ ట్రింగ్ …….
హలో…….ఎవరు………?
హలో నాని ఏనా ?
ఆ నేనె, ఆంటి ……  చెప్పండి
వున్నడా బిడ్డ , మా దలిద్రుడు…………….
 ఆ ఆంటి ఈడ్నే వుండు…….అరె మల్లెషా  నీకేరా
హలో అమ్మా ఏందే …?
ఏంది ఏందిరా మింగనీకీ రావా ఏంది……..?
మీ డాడి ఒకటె తిడుతుండు,  మస్తు పరేషాన్ చేస్తుండు  జల్ది  రారా
ఒస్తున్ననే ,

సరె రా బై నేను పోవాలె, డాడి పరేషాన్ చేస్తుండు
సరె బై రా ….!

నేను గుడా పోవల్రా,   రేపు interview కి ఏమన్నా prepare అయినావా
ఏం కాలే రా, మస్తు పరేషాన్ ఐతుంది. ఇప్పుడు పోయ్ సూడాలి …
పోదం రా బై రేపు కలుస్దాం
కాని మల్లి ఆ పాగల్ గాన్ని మాత్రం పిలవకురా
ఏ నేన్ పిలవలేదురా అంటె ఇనవారా నువ్వు
పోని తియ్ …..
బై
బై రా…………..

********************

(ఎప్పుడూ అమ్మలక్కల ముచ్చట్లేనా….??? ఒకసారి అయ్యలన్నల ముచ్చట్లూ విందాం……)
part – 2  కూడా వినాలని వుందా ……..??

మే 16, 2008

నేనూ నా బద్దకం…

ప్రచురించిన వర్గము Uncategorized — pavani5 @ 2:44 అపరాహ్నం

మూడూ రోజుల కింద మా ఇంటికి మా కజిన్ ఒకతను వచ్చి, వాళ్ళ పాపకి 15 వ తారీఖున అన్నప్రాసన ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం వుందని మమ్మల్నందరీ రమ్మని చెప్పి వెళ్ళాడు. అలాగే రాత్రి ఇంకో కజిన్ ఫోన్ చేసి వాళ్ళింట్లో కూడా  సత్యనారాయణ స్వామి వ్రతం వుందని రమ్మని చెప్పాడు. అప్పుడు పడింది మాకు గొంతులో పచ్చివెలక్కాయ. ఏం చేయాలో అర్ధం కాలేదు. ఒకచోటకి వెళితే ఇంకోళ్ళకి కోపం. రెండిటికా వెళ్ళలేము, ఒకటి ఆ మూల ఒకటి ఈ మూల.
  ఎలాగొ అలా వెళ్దామంటే చేతిలో బుడ్డి పైసా లేదు. అన్నయ్యని కారులో దింపమంటే ఈరోజు పని వుంది కుదరదు అన్నాడు. పోనీ బస్సులో వెళ్దామంటే, పైన ఎండ నెత్తి మాడుస్తోంది కింద కాళ్ళు మాడుతున్నాయి. పోనీ ఎండని తట్టుకొని తిట్టుకొని వెళ్దామంటే, సాయంత్రం నాన్న ఆఫీసు నుండి  ఇంటికి వచ్చేసరికి మేము ఇంటికి రాలేకపోతె కష్టం. ఎన్నో రోజులనుండి ఎదురుచూస్తున్న గ్యాస్ ఆ రోజే వస్తుందేమో అని అనుమానం. అదీ కాక మంచినీళ్ళు వచ్చేరోజు, నీళ్ళు పట్టాలీ. ఇంకా పక్కఇళ్ళవాళ్ళెవరూ లేరు ఇంటికి తాళం వేయాలంటే ….. అసలే రోజులు అంతంతమాత్రంగా వున్నాయి. ఇవన్నీ కాకుండా చాలా రోజులగా  యునివర్సిటీ నుండి రావల్సిన లెటర్ కోసం ఎదురు చూస్తున్నాం, అది ఈరోజే వస్తుందేమో…
   ఇన్ని డౌట్స్ తో ఆలోచిస్తూ టైం 10 అయింది. ఇంకేం వెళ్తాం లే అని, హాపీ గా ఇంట్లోనే అన్నం వండుకొని తినేసి రెండు గంటలు హాయిగా నిద్రపోయి లేచి ఒక క్లోజ్ ఫ్రెండ్ తో ఓగంట విడియోకామ్ లో చూస్తూ ఛాట్ చేస్తూ ఎంతో ఎంజాయ్ చేసాం. అలా గడిపాం ఆ రోజు… ఇంతకీ చెప్పోచ్చేది ఏమిటంటే ….. అసలు ఆరోజు ఏ ఫంక్షన్ కైనా వెళ్ళాలి అనుకుంటే ఇవన్నీ కారణాలు కానేకావు. ఏదో రకంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. బేసికల్లీ మనకి బద్దకం.. అది కప్పిపుచ్చుకోవడానికి ఇలా ఎన్నైనా కారణాలు వెతుకుతాం. మేమనే కాదు మాలాగా కొంతమందైనా వుంటారని నా అనుమానం. ఏపనైనా చేయాలనుకుంటే దారులు ఎన్ని వుంటాయో…. తప్పించుకోవాలంటే కారణాలూ అన్ని వుంటాయి…
(ఇక ఇప్పుడు ఎందుకు రాలేకపోయామో వాళ్ళకి చెప్పడానికి ఎన్ని అబద్దాలు వెతకాలో ….)
 

మే 13, 2008

“చిక్ చిక్ దంబొ నా”

ప్రచురించిన వర్గము Uncategorized — pavani5 @ 10:38 పూర్వాహ్నం

(సాయంత్రం మామగారి కోరిక మేరకి కుమారి బంగాళాదుంప వేపుడు, చారు పెట్టింది) తాతయ్య ఇవ్వాళ్ళ కూర చాలా బాగుంది, చారు కూడా చాలా బాగుంది. నాన్నా రండి భోజనం చేద్దాం, అ ఆ వస్తున్నా…
  అబ్బా ఎన్ని రోజులైందిరా ఈ రకం భోజనం చూసి కొంపలో, అమ్మా కుమారి చెప్పాననుకోక రోజు సాయంత్ర పూట ఏదో ఒకటి ఇలా సింపుల్ గా చెయ్యి చాలు. ఇంతకీ రేపు పండగ కదా ఏమ్ చేస్తున్నారొ అత్తాకోడళ్ళు కలిసి వంటలు…
   చేయడానికి చాలా వున్నాయండి. ఏమే నువ్వు మళ్ళి ఆ సంక్రాంతి కి చేసినట్టు ఏవైనా వెరైటీ అని చేసావనుకో ….
  లేదు మామయ్య అన్ని మామూలు వంటలే చూస్తారుగా మీరే, “అత్తయ్యా  త్రీపుత్ర తలుపు తియ్యగానే బయట ఎవరుంటారంటారూ…?”
  అవునే కుమారీ నేను దాని గురించే అలోచిస్తున్నాను సాయంత్రం నుండి.
అయినా అకీరాకి అదేం రోగమే ….
 ఒరేయి అబ్బాయి మనం వెళ్ళి పడుకోవచ్చు ఇక వీళ్ళ సోది మొదలైంది. తొందరగా మింగి పడుకొని ఛావండి, రేపు పండగ.
 
 నిదరలో వున్న మామగారికి ఏదో అలికిడి అయ్యి మెళకువ వచ్చింది, లేచి చూసేసరికి టైమ్ అయిదైంది. అత్తాకోడళ్ళూ ఒకటే హడావిడి పడుతున్నారు. ఏవిటా విషయం అని హడావిడిగా హాల్లోకి వెళ్ళి చూసేసరికి …
అత్తయ్యా  రాత్రి అన్నం చాలా మిగిలింది పని అమ్మాయికి ఇచ్చేదా…?
ఓసినీదుంప తెగ వుంచవే, ఇప్పుడు వాళ్ళు వస్తే చూపించొద్దు.
ఎవరే ఆ వచ్చేవాళ్ళు, ఏమిటి మీ హడావుడి…??
ఏమిలేదు మామయ్యా  ఇవ్వాళ్ళ మన ఇంటికి “అబ్బాటీవీ” వాళ్ళు వస్తున్నారు.
టీవీ వాళ్ళా…! ఎవరు వాళ్ళని రమ్మన్నారు …???
అదేమిటండి అలా అంటారు ఎంత సేపు కష్టపడి ఫోనులో వాళ్ళూ అడిగిన ప్రశ్నలకి జవాబులు చెప్పామో తెలుస్తే మీరు అట్లా అనరు.
అందుకేనా నిన్న రెండు గంటలు ఇంటికి ఫోన్ ట్రై  చేసినా కలవలేదు. మాకొచ్చే జీతాలు మీ ఫోనులకే సరిపోవట్లేదు.
సర్లేండి ఆపండి తొందరగా తెమలండి వాళ్ళు వస్తారు.
ముందే చెప్పిచచ్చారు ఇక నేను బయటికి వెళ్ళి  సాయంత్రం అయ్యాక వస్తాను, మీ ఛావు మీరు ఛావండి.
అయ్యో మిమ్మల్ని కూడా పరిచయం చేద్దామనుకున్నానండి. ఇంట్లో అందరిని వుండమన్నారు వాళ్ళు.
అదేదో మీరే ఏడవండి, ఆ చేసిన వంట కూడా సాయంత్రానికి వుండడానికి వీల్లేదు. మీరే తినండి , లేకపోతే మూటకట్టి వాళ్లకే ఇచ్చేయండి. దాంతో ఐనా ఇలాంటి ప్రోగ్రాములు చేయడం ఆపేస్తారు.
నేను వెళ్తున్నా…
పోనీలేవే కుమారి మనం రెడీ అవుదాం, తొందరగా ఇల్లంతా సర్దు. మనైంట్లొ లేని వస్తువులు పక్కింటి కాంతం గారినో లేక వెనకింటి వెంకాయమ్మ గారింట్లోనో తీసుకొద్దాం. ఆ సామాన్లన్నీ లేకపోతే వాళ్ళు షూటింగ్ చేయరుట. తొందరగా తెములు.
అది సరేకాని అత్తయ్యా… వాళ్ళకి ఏం వంట చేసి చూపెడదాం…??
అదీ “చిక్ చిక్ దంబొ నా” అనీ మన సాంప్రదాయ వంటకం వుంది కదే అది చేద్దాంలే.
అత్తాయ్యా ఓ అత్తాయ్యా తొందరగా రండి, వాళ్ళు వచ్చారు.
(కుమారి ఆ హడావిడిలో గుమ్మం తగిలి ధడేల్ మని బోర్ల బొక్కల పడింది. ఈ విధంగా పడడం కుమారికి సర్వసాధారణం అయింది.)

హలో …. ప్రతీరొజు లాగానే మళ్ళీ సరికొత్త వంటలతొ మీముందుకు వచ్చింది మీ “మా వంట మీ తంట”. ప్రేక్షకుల ఆదరణతో అతి తక్కువ కాలంలో ఎంతో మంచి ప్రోగ్రాం గా అందరి మన్ననలు పొందింది.  ఇప్పటికే అభిమానులు వారి అభిమానాన్ని తమ ఉత్తరాల రూపంలో మాకు పంపుతున్నారు. అలా మాకు వచ్చిన ఉత్తరాల్లోనుండి బాగా వారి అభిమానాన్ని తెలిపిన అభిమాని ఉత్తరం డ్రా ద్వారా తీయబడినది. వారి పేరు తాటాకుల తాయారమ్మ గారు. పాపం వీరి ఇంట్లో అందరికి కొన్ని రోజులుగా డైజెషన్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారట, ఎంతమంది డాక్టర్ల దగ్గరకి వెళ్ళినా లాభం లేకపోయిందట. ఆ సమయం లో వారిని ఆపదలో ఆదుకున్న ఆత్మబంధువు మన  “మా వంట మీ తంట”. ఎలాగంటారా……..???
ఆ రోజు మన ప్రోగ్రాం లో ’పాచి పుల్లమ్మ’ గారు చేసిన ’పాచి పచ్చడి’ అనే వంటకం చూసి వారూ వారింట్లో చేసారట. అంతే ఒక్కసారి రుచి చూడగానే ఇంటిల్లిపాదికి దెబ్బతో రెండు రోజుల్లో వారి ప్రాబ్లమ్ మాయమైపోయింది. చూసారా మన ప్రోగ్రామ్ కి ఎంత అభిమానమో. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వంటలేంటో రుచి చూసి(చూసాక తెలివిలో వుంటే) వద్దాం…
ఈరోజు మనకి సరికొత్త వంటలని పరిచయం చేయడానికి రెడీగా వున్నారు. ఇంక ఆలస్యం ఎందుకు వెళ్ళి నేర్చేసుకుందాం రండి….
మనం ఇప్పుడు నక్కబొక్కలపాలెం లోని ’బొక్కల బోడమ్మ’ గారింటికి వచ్చాం. లోపలికి వెళ్దాం రండి..

టక్ టక్ టక్ …
కుమారి తలుపు తీసింది ….
హలో … నమస్కారమండి …
నమస్కారమండి వెల్ కం …
థ్యాంక్యూ … 
ఈరోజు మీరు మాకు ఏ వంట చేసి చూపెడుతున్నారండి…?
నేను కాదండి మా అత్తయ్యగారు చేస్తారు…
వారిని మాకు పరిచయం చేస్తారా…
తప్పకుండా… ఈవిడ మా అత్తగారు …
నమస్కారమండి .. మీ పరిచయం…?
నమస్కారమండి నాపేరు ’బొక్కల బోడమ్మ’ …
బోడమ్మ గారు ఈరోజు మాకు ఏవంట చూపిస్తున్నారండి…?
“చిక్ చిక్ దంబొ నా” అని మా సాంప్రదాయ వంటకమండి…
“చిక్ చిక్ దంబొ నా” చాలా విచిత్రంగా వుందండి పేరే, ఇక రుచి ఎంత విచిత్రంగా వుంటుందో….
మా ప్రేక్షకులు ఆ రుచి చూడాలని ఎంతో ఆత్రుతగా చూస్తున్నారు, ఇక ఆలస్యం చేయకుండా తొందరగా ఆ వంటకి కావలిసిన పదార్ధాలు ఏమిటో చెప్తారా  బోడమ్మ గారు ….
ఆ చెప్తానండి …
ముందుగా
ఒక కప్పు బియ్యం,
ఒక కప్పు మినపపప్పు,
అరకప్పు చింతపండు,
కప్పు పాలు,
కప్పు పెరుగు,
కప్పు నెయ్యి,
కప్పు జీడిపప్పు
కప్పు పంచదార కప్పు బెల్లం,
రెండు స్పూన్స్ అల్లం వెల్లులి పేస్ట్,
పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా,
కప్పు అన్ని రకాలా పచ్చి కూరముక్కలు,
రెండు కప్పుల అన్ని రకాల పళ్ళ ముక్కలు,
అరకప్పు ఉప్పు,
అలంకరణార్ధం ఉల్లిపాయలు, కీరాలు, టమాటాలు, తొక్కతోలు..
(చివరిగా ఇంట్లో ఎంతమంది వుంటే అన్ని ఎల్డోపర్ లు పెట్టుకోవలసిందిగా రైటర్ మనవి)
అయిపోయాయాండి, అన్నీ ఇంట్లో మనకి రెగ్యులర్ గా దొరికే పదార్ధాలేనండి.
ఇక తయారీ పద్దతి చెప్తారా…
ఆ చెప్తానండి…. కుమారి ఆ వెంకమ్మ గారింట్లోంచి పెద్ద డేగిసా తీసుకురావే…
అయ్యో అంత ఎక్కువగా చేయక్కర్లేదండి, కొద్దిగా చేయండి చాలు…
అయ్యో ఎందుకండి మీ మొహమాటం సంతకెళ్ళ… అందరికి సరిపోవాలి కదా …
(ఏం సరిపోవడమో ఏమో ఈ ప్రోగ్రాం నా తద్దినానికి వచ్చింది) కానీయండి …
మొదటగా మనం ఈ డేగిసా తీసుకొనీ …
అయ్యో మర్చిపోయాను, ఓ కుమారీ కాంతం గారింటికి వెళ్ళి ఒక అర బింద మంచినీళ్ళు తేవే…
అలాగే అత్తయ్యా..
ఏం అనుకోకండమ్మా, మీరొస్తున్నారన్న హడావిడిలో పొద్దున్న నీళ్ళు పట్టడం మర్చిపోయాం. వాళ్ళింట్లో పాడుబడ్డ బావిలో నీళ్ళు వుంటాయి ఎప్పటికి ఇలాంటప్పుడు అవే వాడుతాం..
ఇదిగో అత్తయ్యా నీళ్ళు..
బోడమ్మ గారు స్టౌ వెలిగించమంటారా ఇప్పుడు ….
అయ్యో  ఈ పదార్ధానికి స్టౌ తో పని లేదమ్మా…
మామూలుగా అయితే ఇప్పుడు బియ్యాన్ని వండుకోవాలమ్మా… కాని …
కుమారీ అది తేవే…
ఇదిగో అత్తయ్యా…
ఓహో అన్నం ముందుగానే తయారు చేసారా…
అవునమ్మా…
అవునండి అన్నం కాస్త స్టిక్కీ గా వున్నట్టుంది, కావలనే అలా వండారా…?? అలా రావడానికి ఏం చేసారండి…?? ఏదో కాస్త వెరైటీ స్మెల్ కూడా వస్తోందండీ…
ఆ అలా స్టిక్కీ గా వుంటే రుచి చాలా బాగుంటుందమ్మా…
అవునా …
అవునండి స్టౌ లేకుండా ఎలా వండుతారండి…
అదే చూపిస్తానండి ఇప్పుడు ….
ముందుగా డేగిసా తీసుకొని …
(ఇందాక తీసుకున్నాం కదండి బాబు, ఈ బోడిబొక్క వంటకి ఎన్నిసార్లు తీసుకోవాలి..)
ఆ తీసుకున్నామండి .. ఇప్పుడు..
ముందుగా అన్నం వేసుకుందాం (అన్నం వేయగానే గుప్పున వచ్చిన వాసనకి యాంకర్ ఒక్క అడుగు వెనక్కి వేసింది కెమెరామెన్ తో సహా)
ఒకదాని వెనక ఒకటి వరుసగా అన్నీ డేగిసాలో కులుపుకోవాలమ్మా … ఇది చాలా తొందరగా అయిపోయే వంట అమ్మా..
(అవునులే అయి ’పోయే’ వంటకమే)
ఇది ఇంటికి ఎవరైనా అతిధులు వచ్చినప్పుడు తడుముకోకుండా త్వ్రరగా చేసి పెట్టొచ్చు… ఇవే పదార్ధాలు వాడాలని లేదమ్మా మనకి అందుబాటులో వున్నవి ఏవైనా వేసి తయారు చేయవచ్చమ్మా…
(అందుకనే అయి ’పోయే’ వంటకం)
మినపప్పు ఒకటి మనం చివర్లో వేసుకోవాలమ్మా… మినపప్పు అంటే చాలమందికి మినప లడ్డు చేస్తారనే తెలుసు కానీ ఇలా కూడా చేసుకోవచ్చు…
మినపప్పు మినహా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఆరు గ్లాసుల నీళ్లతో…
ఇప్పుడు ఉప్పు సరి చూసుకొని, సర్విసింగ్ బౌల్ లోకి తీసుకొని గార్నిషింగ్  చేసుకొందాం…
మనం గార్నిషింగ్ కోసం  ఉల్లిపాయలు, కీరాలు, టమాటాలు, తొక్కతోలు.. తీసుకున్నాం కదమ్మా అవన్నీ వేసుకొని గార్నిష్ చేసుకుందాం … అవునండి మనం మినపప్పు వేయలేదండి…
ఆ అది మనం చిన్న చిన్న బౌల్స్ లోకి తీసుకున్నాకా తినేముందు వేసుకుంటే చాలా క్రిస్పీ గా వుంటుందమ్మా, ముందుగానే కలిపితే అది బాగుండదు…
అలాగా …
అయిపోయిందమ్మా ఇప్పుడు మనం మినపప్పు కూడా వేసేసుకున్నాం ఇక తినడమే ఆలస్యం …
కుమారీ మన స్టేషన్ తలుపు తీసిపెట్టమ్మ ఎందుకైనా మంచిది …
ఎప్పుడో తీసాను అత్తయ్యా …
ఆ నిఫానీ మన   “చిక్ చిక్ దంబొ నా”  రెఢీ అయిందమ్మా, ఇక నువ్వు రుచి చూసి చెప్తే …
(ఆరుచి చూస్తే నా పని ఢీ నే) చూడడానికి బాగానే వుంది కదండి ఇంకా రుచి చూడడం ఎందుకులేండి …
అయ్యో మీరు చూడాలమ్మ తప్పదు …
చెంచాతో రుచి చూసి చూడగానే మన యాంకర్ నిఫానీ మొహంలో ఎన్నో భావాలు కనపడ్డాయి …
బోడమ్మ గారు మాకు ఈ పండగ రోజున ఎంతో రుచికరమైన వంట చూపించినందుకు మీకు మా తరఫున మీకు చిన్న కాంప్లిమెంట్ …
(మీరు తొందరగా తిసుకుంటే మేము పారిపోతాం)
ఇంతలో కుమారీ ఒక కవరు తీసుకొనీ కెమెరా మెన్ బ్యాగ్ లో వేసింది ఎవరూ చూడకుండా …
ఇక బతుకుజీవుడా అనుకుంటూ మన టీమ్ బయటికి వచ్చేసారు …
బయటికి వచ్చాకా మన కెమెరామేన్ కి ఎందుకో డౌట్ వచ్చి బ్యాగులో చూస్తే,  మన బోడమ్మ గారు చేసిన పదార్ధం వున్న కవరు కనిపించింది… వాడు ఒక్క వాంతి చేసుకొని ఆ కవరుని వాళ్ల గుమ్మం లో పడేసి వెళ్ళిపోయాడు …

అంతే…. ఇంతటితో  “చిక్ చిక్ దంబొ నా”  సమాప్తం …
హమ్మయ్యా ….

ఏప్రియల్ 17, 2008

నా వీరబాదుడు – 4

ప్రచురించిన వర్గము Uncategorized — pavani5 @ 4:25 అపరాహ్నం

 మొన్న Dr.Ram గారు చెప్పినట్టుగా చిన్ననాటి సంగతులు ఎన్నిసార్లు తలుచుకున్నా మధురంగానే వుంటాయి. అప్పుడు మనం ఎంత కష్టపడ్డా ఇప్పుడు  గడుపుతున్న జీవితం కన్నా ఆ రోజులే చాలా బాగుంటాయి. ఏదైనా అనుభవించేటప్పుడు కన్నా, గుర్తు చేసుకునేటప్పుడే ఆ రోజుల విలువ తెలుస్తుంది.
    మేము ఆరుగురు పిల్లలం, అమ్మా నాన్న. మాకు ఆస్తిపాస్తులు ఏమి లేవు. ఏరోజు వస్తువులు ఆ రోజే తెచ్చుకునే వాళ్ళం. కాక పోతే వూరి మొత్తానికి మేము ఒక్కళ్ళమే బ్రాహ్మలం కాబట్టి, ప్రతి సంవత్సరం కోతల సమయంలో ప్రతీ రైతూ వారి వారి పంట ఇంటికి రాగానే అందులోనుండి కొంత  మాకు పంపేవారు.
   ఆ విధంగా మాకు జొన్న, సజ్జ, వరిగ, శనగ, పెసర, మినుము, కంది, ఇలా కొన్ని రకాల ధాన్యాలు వాళ్లకి తోచినంత ఇస్తూవుండేవాళ్ళు. మా అమ్మ ఎక్కువగా జొన్న అన్నం వండేది (మా ఇంట్లో వరి అన్నం చాలా రేర్ గా వండేది అమ్మ) దాంట్లోకి దోసకాయ పప్పు చేసేది, ఆ రుచి ఇప్పటికి గుర్తే. సజ్జపిండిలో పచ్చిమిరప కారం ఉప్పు వేసి తప్పాలచెక్కలు చేసేది, వాటి రుచే రుచి. ఇప్పుడు అలాంటి వంటలు చేసే ఓపిక/వీలు వుండట్లేదు. ఒక వేళ శ్రమకోర్చి చేసినా తినేవాళ్ళు లేరు. ఎంతసేపటికి పిజాలు, బర్గర్, ఛాట్ అంటూవూంటారు ఈ కాలం పిల్లలు. ఇప్పటికే ఇలా వుంది, ఇక ముందు తరం వాళ్ళకి చపాతీ, పూరి లాంటీ రోజు వారి ఐటమ్స్ కూడా తెలియకుండాపోతాయేమో అని అనిపిస్తోంది.
    మన ఈ software life లో పడి కొన్ని పండగలు కూడా మిస్ అవుతున్నాం. అందులో అట్లతద్ది ఒకటి. మా చిన్నప్పుడు ఈ పండగని ఎంతో సరదాగా చేసుకొనేవాళ్ళం, ముందు రోజే చెట్లకి వున్న గోరింటాకు కోసుకొచ్చి రుబ్బి పెట్టే వాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలకి. తద్దె రోజు పొద్దున్న ఐదింటికే అమ్మ మమ్మల్ని నిద్ర లేపేది. సుర్యోదయానికి ముందే చద్దన్నం, కందిపచ్చడి, ఆవకాయ, గడ్డపెరుగు వేసి అన్నం పెట్టేసేది.
    ఆ ఒక్కరోజు మాత్రం మాకు తమలపాకులు వేసుకునే అవకాశం వుండేది. ఇక దొరికిందే ఛాన్సు అని మేము మేకలు నమిలినట్టు బోలెడు ఆకులు వేసుకునే వాళ్ళం. ఆ రోజు మాత్రం మాకు ఏపనులు చెయ్యాల్సిన అవసరం వుండేది కాదు.  మా పెరట్లో రెండు పెద్ద వేపచెట్లు వుండేవి, తెల్లవారేటప్పటికి ఆ రెండు చెట్లకి ఉయ్యాలలు వేసేవాళ్ళు అన్నయ్యలు. ఇంక పొద్దున్న ఎనిమిదింటికి మొదలు పెట్టిన ఆటలు సాయంత్రం చీకటిపడేదాకా ఆడుతూనే వుండేవాళ్ళం. ఇంట్లో ఎవరేం చేస్తున్నారో పట్టకుండా ఉయ్యాలలు వూగుతూనే వుండేవాళ్ళం.
     నా వీరబాదుడు మీకు బోర్ కొడుతోందేమో….! కాని నాకు మాత్రం చిన్నప్పటి విషయాలు గుర్తుకొస్తే మీతో పంచుకోవాలనిపిస్తుంది. అందుకే ఇలా మీ మెదడు తింటున్నాను. సహనంతో చదువుతారని ఆశిస్తూ… మళ్ళీ మరోసందర్భంలో కలుస్తాను.

ఏప్రియల్ 12, 2008

టీ.వి ఎమర్జన్సీ

ప్రచురించిన వర్గము Uncategorized — pavani5 @ 5:59 అపరాహ్నం

నమస్కారం నేను వామన రావు న్యూస్ @ 7am కి స్వాగతం.
వార్తల్లోని ముఖ్యాంశాలు:
మరో రెండు వారాల్లో రాజకీయ ప్రవేశం చేయనున్న అంజన్ కుమార్..
ప్రేమ కోసం మౌనవ్రతం చేస్తున్న మూగ బాలిక..
ఇంద్ర బాబు రాష్ట్రంలో వడగాలి పర్యటన..
రాజధాని లో కలకలం సృష్టించిన రాగి చెంబు..
ఐదు పెళ్ళిళ్ళు చేసుకొని, దర్జాగా ఆరో పెళ్ళికి తయారైన నిత్యపెళ్ళికొడుకు..
ప్రపంచ చిత్రాలన్నీ తోసిరాజని విజయఢంకా మోగిస్తున్న సినిమా “తొడ గొట్టు”..
వంగుళ్ళు- దూకుళ్ళులో త్రుటిలో చేజారిన నేషనల్ ఛాంపియన్ కప్..
 
వార్తల్లోకి తొంగి చూస్తే….

రాజకీయాల్లోకి వస్తాను వస్తాను అంటూ అభిమానుల్ని వూరించి, ఎప్పటిలాగానే మళ్ళి వాయిదావేసిన అంజన్ కుమార్. మరో రెండు వారాల్లో తమ పార్టీ గుర్తు వెల్లడిస్తామని మరవింద్ కుమార్ అంటున్నారు.

ఇప్పుడొక చిన్న బ్రేక్ తీసుకొని వెంబడే వస్తాం, చూస్తూనే వుండండి నిరంతర వార్తా గంగ టి.వీ ఎమర్జన్సీ ..(జీవితాంతం మనకి బ్రేక్ వుండదు)

add 1:  ( ఈ యాడ్ పోష్ట్ చివరిలో మీకోసం)

వెల్ కం బ్యాక్ టూ న్యూస్ ..
ప్రేమ కోసం మూగ బాలిక చేస్తున్న మౌనవ్రతం. మూగబాలిక మౌనవ్రతం ఏంటని అనుకుంటున్నారా..?? ఆ వివరాల్ని మనకి వివరించడానికి చప్పుడు పాలెం నుండి మా విలేకరి గొట్టం గోవిందం లైన్ లో వున్నారు.
హలో గో.గో..
హలో వామనా..
హలో గో.గో వినిపిస్తోందా..
హలో వాము హలో
ఆ చెప్పండి గోట్టం, అక్కడ తాజా పరిస్థితిని వివరించండి ..
………………………
వాము ఇక్కడ అంతా గందరగోళంగా వుంది. వూరి జనం అంతా బాలిక ఇంటి దగ్గరే వున్నారు. తిండి తీర్ధం లేకుండా. ఎవరిని కదిలించినా కూడా కళ్ళనీళ్ళ పర్యంతం అవుతున్నారు. (మాట్లాడడానికి అమ్మాయి నిరాకరించడంతో) మనం ఇప్పుడు అమ్మాయి తల్లితో మాట్లాడుదాం.
గో.గో: అమ్మా చెప్పండి అసలు ఈ గొడవకి కారణం ఏంటి..?
తల్లి:   కొడకా ఏం చేతు దానికి పోయేరోగం అచ్చింది. ముందుగాల్ సంది          సెప్తున్నా ఇనలే.
గో.గో: అమ్మా అసలు మూగ అమ్మాయి మౌనవ్రతం ఏంటి..?
తల్లి:   మా పిల్ల రోజు ఆకలేస్తే “మె మె మ్మ – బె బె బ్బ” అంటుండే బిడ్డ,                 రెండు దినాల సంది గది కూడ అంటలేదు. ఎంత చెప్పినా ఇంటలేదు.
        ఆ పోరడు యాడుండాడో ఏమో.
వాము అదీ సంగతీ ఆ అబ్బాయి కనపడితే మక్కెలు విరగొడ్తామని వీళ్ళు అంటున్నారు, కనపడితే ఎక్కడ మక్కెలు విరగొడ్తారో అని వాడు పారిపోయుంటాడు.

మరింత తాజా సమాచారంతో మళ్ళీ మీముందుంటాను. కెమేరామెన్  డబ్బాతో గొట్టం గోవిందం..

థ్యాంక్యూ గొట్టం,
ఇంద్రబాబు నిన్న రాష్ట్రంలో  వడగాలి పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రసవిస్తూ సారి ప్రసంగిస్తూ ఆయన అధికారంలోకి వస్తే ప్రజలని, రాష్ట్రాన్ని అభివృధి బాటలో నడిపిస్తానని వాగ్దానం చేసారు.
* ఓటరుకి ఒక ఇల్లు
* ఒక కారు
* ఒక టి.వీ
* ప్రతీ నర్సరీ అబ్బాయికి, అమ్మాయికి ఒక లాప్ టాప్
వీటితో పాటుగా ఒక భూతద్దం ( దాంతో అవన్ని చూసుకోవడానికి)

ఇప్పుడొక చిన్న బ్రేక్..

news 60sec
 < మురికిపాలెంలో  భూతగాదాల్లో దాయాదుల పోరు
 <  పుల్లేటికూరులో ఒక అమ్మాయి కోసం అన్నదమ్ముల పోరు
 <  చెత్తచెరుకుపాడు దగ్గర్లో రెండు సైకిళ్ళు ఢీకొని హరీమన్న కుక్క ప్రాణాలు

వెల్ కం బ్యాక్ టూ న్యూస్….
రాష్ట్రంలో ఒక రాగి చెంబు కలకలం సృష్టించింది. సచివాలయం దగ్గర న్యూస్ కవరేజ్ కి వెళ్ళిన టీ.వీ ఎమర్జన్సీ విలేకర్లకి బోర్లించివున్న ఒక రాగిచెంబు కనపడింది, అది ఎవరిదా అని అరా తీస్తే ఎవరూ మాది కాదంటే మాది కాదన్నారు. అప్పుడు పోలీసులకి ఫోన్ చేయగా వారు బాంబ్ స్క్వాడ్ తో సహా వచ్చి తనిఖీలు నిర్వహించారు. కాని ఎక్కడా ఏ ఆధారాలు దొరకలేదు. ట్రాఫిక్ స్థభించి పోయింది, ఆ ప్రాంతమంతా ఆందోళనతో నిండిపోయింది. అలా నాలుగు గంటలు గడిచిన తర్వాత కలకలం రేపిన ఆ చెంబు ఒక ముష్టి వాడిదని తేలింది.
దాంతో అంతా వూపిరి పీల్చుకున్నారు.

నిన్నటిదాకా అతడొక మర్యాదస్తుడు నేడు అతడి నిజస్వరపాన్ని వెలుగులోకి తెచ్చిన టీ.వీ ఎమర్జన్సీ. ఐదు పెళ్ళిళ్ళు చేసుకొని ఆరవ పెళ్ళికి సిద్దపడ్డ ఆ నిత్య పెళ్ళికొడుకు అరాచకాన్ని టీ.వీ ఎమర్జన్సీ విలేకర్లు బయట పెట్టారు. అతడికి శిక్షపడేలా చేసారు. శిక్ష పడ్డ ఐదు నిమిషాల్లో బెయిల్ పై విడుదలై తన ఘనతను చాటుకున్న ఆ నిత్యపెళ్ళికొడుకు.

B-R-E-A-K

ఈవారంలో విడుదైన సినిమా “తొడగొట్టు” నిజంగానే తొడగొట్టింది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న అభిమానులని ఆనందపరిచింది. ప్రపంచ స్థాయిలో మొదటి ఐదు స్థానాల్లో పోటీ చేస్తున్న సినిమాల్లో ఇది ఒకటి. మొదటి వారంలోనే ఈసినిమా కలక్షన్స్ సినిమా ప్రొడ్యూసర్ నాలుగు అపార్ట్ మెంట్ లకి ఓనర్ని చేసింది. ఆ ఆనందంలో నిర్మాత మరవింద్ మూర్ఛపోయి ఇంకా తేరుకోలేదు.

ఇంటర్ నేషనల్ లెవల్ కి దూసుకుపోతుందనుకుంటున్న సమయంలో, గెలుపు ముంగిట చతికిలపడి తృటిలో విజయం చేజార్చుకుని ఏడుపు మొహం ఈడుపు కాళ్ళుతో ఇంటిదారి పట్టిన క్రీడాకారులు. దీని మీద ఫుల్ రిపోర్ట్ కాసేపట్లో….

ఈ విధంగా ఏ న్యూస్ ఛానల్ చూసినా అరగంటకొకసారి same news..
వాళ్ళు మాత్రం ఏం చేస్తార్లేండి 24hrs న్యూస్ చెప్పాలంటే అన్ని న్యూస్ ఎక్కడి నుండి వస్తాయి.

బ్లాగర్లందరికి “శ్రీ రామనవమి” శుభాకాంక్షలు…

ఏంటండీ ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నారు….???
ఓహ్ యాడ్ గురించా…
ఇదంతా చదివింతర్వాత కూడా ఇంకా యాడ్ కూడా చూడాలనుకుంటున్నారంటే… ఓకే మీ కోసం యాడ్.

” మీరందరు నా ఒక్కో పోష్ట్ రెండు మూడు సార్లు చదివి, చదివి వదిలేయకుండా తప్పకుండా ఎన్ని సార్లు చదివారో అన్ని సార్లు కామెంట్లు ఇస్తారు. తప్పకుండా ఇస్తారు దానికి మీరే -సాక్షి-”

« కొత్త టపాలుపాత టపాలు »

WordPress.com లో Blog పెట్టుము.