Pavani5’s Weblog

ఏప్రిల్ 20, 2009

వై..రాజ్యం మార్పు

Filed under: Uncategorized — pavani5 @ 5:05 సా.

ఆగస్ట్ 26 తిరుపతిలో మన అన్న చిరంజీవి గారి రాజకీయ రంగ ప్రవేశంసందర్భంగా మెగా షో (అనగా భారీ సభ )నిర్వహించారు. అది అందరకి తెలిసిన విషయమే…! సభలో చిరు లెక్కలేనన్ని వరాలు కురిపించారు. ఆయన పార్టీ పేరు ప్రజా భోజ్యం… సారీ ప్రజారాజ్యం. ఆ… ఏదయినా ఒకటే ఎవరైనా ఒకటే మనకి వచ్చిచచ్చేదేమిలేదు. మన చిరుకి ఆ జనాన్ని చూసేసరికి కాళ్ళల్లో వణుకు ప్రారంభమైంది. ఎలాగో ధైర్యం కూడగట్టుకుని ఆ ఏడుకొండలవాడిని మనసులో తలుచుకొని , మన పరుచూరి బ్రదర్స్ రాసిచ్చిన స్క్ర్రిప్ట్ చదవటం మొదలు పెట్టారు. అటు ఏడుకొండలవాడి కొండ ఇటు మీఅండ నాకు నిండుగా వుంటే నేనేదయినా సాధించగలను అంటూ ఒక గంట సేపు తన జీవితం గురించి ఆతరువాత రాజకీయాల గురించి చెప్పే ఒక్కొక్క డైలాగుకి మన గొర్రెలమంద అదేమన జనాలు చప్పట్లు కొడుతు తమ ఆనందం వెలిబుచ్చారు.
ఇహ వరాల మూట విప్పుదాం. మద్యపాన నిషేధం, గిరిజనుల అభివృద్ది , పల్లెల్లొ అన్నిసదుపాయాలతో ప్రభుత్వ హాస్పటల్స్ , ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ! ఆతరువాత జండావిష్కరణ. ఎలాగో అయిందనిపించి మూడు తోపులాటలు, ఆరు దెబ్బలతో బయట పడ్డారు. అక్కడే వున్న అల్లుఅరవింద్ ని ,నాగబాబుని ,పవన్ కల్యాణ్ ని, ఇంకా ఇతరులనిచూసి ఓరినాయినోయి ఇదేం సభ ఇదేంగోల తొక్కి చంపేస్తారేమో అని భయమేసింది. నావల్ల కాదు బాబోయి ఈ రాజకీయాలు వద్దు నాబొంద వద్దు నాదారిన నేను నాసినిమాలు వేసుకొంటూ హ్యాపీగా గడిపేస్తాను. అనుకొంటూ ఆరాత్రికి ఏడుకొండలవాడిని దర్సించుకోవటానికి కుటుంబంతో ఆలయానికి వెళ్ళారు. ఇక్కడ ఇలా వుండగా అక్కడ గుళ్ళో పరిస్తితి ఎలా వుందంటే స్వామివారి పరిస్తితి కడుదయనీయంగా వున్నది. ఒకపక్కన రాజుగారు భ్రష్టు పట్టించిన ఏడుకొండల్ని తలుచుకొంటూ ఒకప్పటి తన పరిస్తితి తన వైభోగం ఇప్పటి తన చాతకాని తనం దేవుడి పాలనలో తనని అధః పాతాళానికి తొక్కెయ్యాలన్న రాజావారి సంకల్పం, పది ఘడియలైనా దేవేరితో దొరకని ఏకాంతం. ఇంతకీ అష్ట దిక్పాలకులైనా తనవైపు ఉన్నారో లేరో అన్న అనుమానం, ఎటు తిరిగి నేను రాయినని అందరు దేవుడి పాలనలో చేరి పోయారా…? అన్న సందేహం, అసలు ఇప్పుడు నేనేంటీ..? నాఉనికేంటి..? అంటూ ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నారు. ఒక పక్కనించి ఎడ తెరిపి లేని జనం, పూట కొక రాక్షకీయ నాయకుడు వచ్చి నన్నే సింహాసనం ఎక్కించమంటాడు. పిల్లలకి చాక్లెట్ ఇచ్చినట్లు నాకు ఏదోక ఎర వేస్తారు. ఏడుకొండలవాడా… వెకటరమణా… గొవిందా గోవిందా… అని ఒకపక్క, ఆపదమొక్కులవాడా అనాధ రక్షకా గొవిందా గోవిందా… అని, ఇంకోపక్కన వడ్డి కాసులవాడా గొవిందా గోవిందా… అని ఆలయం హోరెత్తిపోతోంది . ఇటు చిరుసభకి వచ్చినవాళ్ళందరూ ఆఏడుకొండలవాడిని దర్సించుకోవటానికి రావటంతో గుడి కిటకిట లాడిపోతోంది అసలే వేలసంవత్సరాలనించి నిలబడి నిలబడి స్వామివారికి చిరాకు ,అలసట, కాళ్ళు పీకుట ,కిరీటం మోసి మోసి శిరోవేదన, జనాల గోడు విని విని చెవులు దిబ్బెళ్ళెక్కి తిక్క తిక్కగావుంది. ఛీఛీ వెధవ గోల నేను ఎందుకు ఈఅవతారమెత్తానో ఏమిటో దేవేరులిద్దరికి బేదాభిప్రాయాలు వచ్చినప్పుడు వూరుకున్నంత వుత్తమంలేదు బోడిగుండంత సుఖం లేదని నాపాటికి నేను వూరుకోక శిలగా మారితే ఏబాధా వుండదనుకొన్నాను ఇంతమంది గోల భరించే కన్నా ఆఇద్దరి గోల భరిస్తే పోయోది. శిలగామారి నెత్తికి తెచ్చుకున్నాను ఇప్పుడు ఇక్కడనించి కదలలేను అవతలకి వెళ్ళలేను ఈబాధ భరించలేను అనుకుంటూ వున్నారు స్వామివారు. ఇంతలో మన చిరు గారు ఆలయం లోకి ప్రవేశించారు. స్వామిని కనులారా చూస్తూ స్వామి నీకేం హాయిగా వున్నావు నాగతిచూడు తండ్రీ అందరు కలిసి రాజకీయాలు అని ముందుకుతోసారు. అక్కడ జనాలు తిక్కప్రశ్నలతో చంపెస్తున్నారు నీకేంపట్టనట్టు హాయిగా చిద్విలాసంగా నవ్వుతున్నావు కొన్నాళ్ళు నన్నుకూడ నీలాగ రాయిగా చెయ్యి స్వామి వీళ్ళబారి నుంచి నన్నుకాపాడు తండ్రీ అని కళ్ళుమూసుకొని భక్తితో ప్రార్దించాడు. వెంకన్నబాబుకి ఇంత గోలలో మన హీరో గారి ఆవేదన చెవులకి సోకింది. నాయనా… రోలువెళ్ళి మద్దెలతోమొరపెట్టుకున్నట్టు నువ్వొచ్చి నాతో…… అనీ అనగానే ఇంతలో ఆయనకి ఏదోఆలోచన వచ్చింది. మనిద్దరం అటుదిటు అవుదామా…? భక్తా అని అన్నారు. మనచిరంజీవికి అదిలీలగా వినపడింది. ఏమన్నావు స్వామీ అయినా నువ్వు ఏమంటావు నాపిచ్చికాని అనుకొన్నాడు మనసులో. కుమారా నువ్వు విన్నది నిజమే నాయనా కొన్నాళ్ళు నువ్వు వెంకన్నగా నేను చిరంజీవిగా మారదాం అనిమళ్ళీ వినిపించింది. ఇహ మనహీరోగారికి అంతా అయోమయంగా వుంది తనేమిటి వెంకన్నగా మారటం ఏమిటీ అలోచిస్తూండగానే ఇద్దరి రూపాలు మారిపోయాయి. అటు మన చిరంజీవి వెంకన్నకి ఇటు వెంకన్నచిరంజీవికి వుత్సాహం వురకలేసింది అహా నేనిప్పుడు రాయినైపోయా ఇప్పుడు నన్ను ఎవ్వరూ ఏప్రశ్నలూ అడగరు అని చిరంజీవి ఓహో నేనిప్పుడు స్వేచ్చాజీవిని ఏభక్తులూ వరాలు అడగరు అని వెంకన్న ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బు అయ్యారు. కాని ఇక్కడే అసలు కధ ప్రారంభమైంది ఇంతలో ఒకభక్తుడు స్వామివారినిచూస్తూ తండ్రీ తెల్లవారేసరికి నేను గొప్ప ధనవంతుడ్ని అయిపోవాలి అనిదణ్ణం పెట్టుకున్నాడు. కొత్తగా వచ్చిన ఫోస్ట్ కదా అందుకని తధాస్తు అని దీవించాడు. ఇంకొక భక్తుడు స్వామీ నాకు మంచి వుద్యోగం కావాలని కోరుకున్నాడు, ఒక భక్తురాలు పిల్లలు కావాలని, ఒక స్టూడెంట్ ఎమ్ సెట్ లో ర్యాంక్ రావాలని, కొత్తగాపెళ్ళైన జంట తమకాపురం సజావుగా సాగాలని, ఒకరాజకీయ నాయకుడు తాను అయితే పీయమ్ లేకపోతే కనీసం సీయమ్ కావాలని, ఇలా అందరు తమ కోరికలు విన్నవించుకుంటూ ఏదో ఉడతాభక్తిగా తమకు తోచిన కానుకలు హుండీలో వేస్తున్నారు అప్పుడు తెలిసింది మనచిరంజీవి వెంకన్నకి రాళ్ళకి కూడాబాధలు వుంటాయని (అంటే వెంకటేశ్వర స్వామికి అన్నమాట ). మెల్లిగామొదలైంది అయ్యగారికి అదిరిపోయే తలనెప్పి. ఇక్కడ ఇలా వుంటే అక్కడ వెంకన్న చిరంజీకి రాజకీయ కష్టాలుమొదలైయ్యాయి పక్కనవున్నభజనపరులు ప్రెస్ మీట్ పెట్టారు అందులో ఒక్కొక్కడూ ఒక్కోప్రశ్నా అడుగుతుంటే తల తిరిగి పోయింది. అనుకొన్నది ఒకటి అయినది ఒకటి యుగాల నించి నిలబడి నిలబడి కాళ్ళు స్వాధీనంలో లేవని కొంత కాలం పాటు హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చని ఆశపడి అవతారం మార్చుకుంటే ఈగోలేంటి అనుకొని వెంటనే చిరంజీవివెంకన్నతో నాయనా నాఅవతారం నాకిచ్చేయ్యిబాబు ఈతిప్పలు నేనుపడలేను అని అడిగాడు. అప్పడే భక్తుల తాకిడి తగ్గి పవళింపు సేవతో పవళించిన మన వెంకన్నకి ఈమాటలేవి వినిపించలేదు. దిగ్గున నిద్ర నించిలేచారు రాజావారు ఏం కల చీచీ పాడు కల ఇంత కష్టపడి ఉపయోగం ఏముంది ఆ అవతారం మార్పేదో నాకు రావచ్చు కదా అంటూ నిట్టూర్చారు అయ్యవారు (వైఎస్ గారు).

ప్రకటనలు

ఏప్రిల్ 9, 2009

జోక్ షాప్…

Filed under: Uncategorized — pavani5 @ 5:40 సా.

1. చింటూ సూపర్ మార్కెట్టుకి వెళ్ళాడు .అక్కడ వున్న ఓనర్ ని ఇలా అడిగాడు
“అంకుల్ కిలో గోధుమ పిండి
అర కిలో చింత పండు
కిలో నూనె
పావు కిలో కార్న్ ఫ్లోర్
వందగ్రాములు ఎండు మిర్చి
ఒక పాకెట్ట్ అప్పడాలు
కిలో పంచ దారా
మొత్తం కలిపి ఎంత” అని అడిగాడు
షాపతను “170” అని చెప్పాడు
అది విని వెంటనే చింటు ఇంటికి వెళ్ళబోయాడు
వెంటనే షాపతను “ఏమిటి బాబు ఏమి తీసుకోకుండానే వెళ్ళి పోతున్నావు”
“ఏమిలేదు నా మ్యాక్స్ హోమ్ వర్క్ లో లాస్ట్ సమ్ కూడా అయిపోయింది”
అని సంతోషంగా ఇంటికి వెళ్ళాడు
షాపతను మనసులో తిట్టుకుంటూ “నాటైమంతా వేస్ట్ చేసావు కదరా అసలే షాపు మూసేవేళైంది”
అని అనుకున్నాడు.

2. చింటూ బంటి తో అడిగాడట “ఒరై నువు ఎపుడైన “జూ” చూశావా” బంటి అన్నాడట ” ఎందుకు రా మన బడిలొ అందరు అబ్బాయిలు జంతువులు లానే ప్రవర్తిస్తారు కదా”.

3. క్లాస్ లో ఇంగ్లీష్ సార్ లెసన్ చెప్పి పిల్లలూ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అన్నారు చింటూ లేచి సార్ సెలవలెప్పటినించి అని అడిగాడు.

(గమనిక : ఈ జోక్స్ ఒక ఎనిమిది సంవత్సరాల అబ్బాయి (మారుతి) స్వయంగా టైప్ చేసి పోస్ట్ చేయమని గోల చేయగా పోస్ట్ చేసిన జోక్స్.) టైటిల్ తో సహా…..

మార్చి 5, 2009

ఎవరీ ఒబామా…?

Filed under: Uncategorized — pavani5 @ 2:24 సా.

ఒరెయి పరంధాముడూ….! నానమ్మ పిలుపు విని నాకు నీరసం వచ్చింది. ఉదయం నించి ఆఫీస్ పనితో విసుగ్గాఉంది, ఏమి చెయ్యలేక హబ్బా… నన్నలా పిలవకు నానమ్మా అన్నాను. తాతలిద్దరి పేర్లు కలిసి రావాలని ’వెంకట సుబ్బరామపరంధామయ్య’ అని పాతపేరు పెట్టారు. నాకు ఇరవై ఏళ్ళు కూడా రాకుండానే అందరూ వెంకటసుబ్బయ్యా అనో లేక పరంధామయ్యా అనో పిలవటం మొదలు పెట్టారు. ఆగోల పడలేక నానా అవస్తా పడి నాపేరు పరమేష్ అని మార్చుకున్నాను. నీకేమో అది నచ్చదు, పోనీ ఆకొండవీటి చాంతాడంత పేరుని కుదించి పిలవమంటే పరం అంటావు. నాకేమో ఆపేరు వినగానే కళ్ళముందు నరకం కనపడుతుంది లేక పోతే అంధయ్యా అంటావు. అప్పుడు నేను గుడ్డివాడినేమో అని అనుమానం వస్తుంది. ఈపేరుతో చచ్చే చావొచ్చింది అనివిసుక్కుంటూ… చెప్పు ఏమిటి సంగతి అన్నాను. నీకు ఓబమ్మ గుర్తుందిరా అని అడిగింది నానమ్మ. ఓబమ్మా ఆవిడెవరే…? అన్నాను. ఓరీనీ దుంప్పెయ్యా.. పిచ్చికల గుంటలో మనపక్క వీధిలో ఉండే వాళ్ళురా వాళ్ళు. అప్పుడే మర్చి పోయావా…? అంది. ఎప్పటి పిచ్చికల గుంట ఏం సంగతి…?? ఎప్పుడో నాచిన్నప్పుడు గోల అది. ఎవరికి గుర్తు అన్నాను. అలాగ మర్చిపోతే ఎలాగరా ఇప్పుడు చూడు వాళ్ళబ్బాయి చాలా గొప్పవాడైపోయాడు అన్నది దీర్ఘంతీస్తూ. అహా ఏంచేస్తున్నాడు కంప్లూటరు (ఆవిడ భాషలో కంప్యూటర్) ఉద్యోగంచేస్తున్నాడా..? అన్నాను నిరాసక్తంగా. ఏమిటిరా ఆనిర్లక్ష్యం. ఆపెద్దదేశానికి ప్రధానిఅయ్యాట్ట అన్నది. నాకు ఒకక్షణం అర్ధం కాలేదు ఏసంగతి నానమ్మా నువ్వు చెప్పేది అన్నాను. అబ్బాబ్బా ఏవిషయమైనా చెప్పేటప్పుడు వినవు తరవాత అర్ధం కాలేదు అంటావు ఎలారా నీతో విసుక్కుంది నానమ్మ. ఆ ఓబమ్మ కొడుకే నట్రా ఆ అమేరికాకి ప్రధాని అయ్యాట్ట అంది. అబ్బా నానమ్మా ప్రధానికాదు అద్యక్షుడు అంటే మనరాష్ట్ర్రపతిలాగా అన్నమాట అయినా ఈకధ ఎక్కడనించి తెచ్చావు అన్నాను. కధేవిట్రా..? కధ.. నీకు నేనెదైనా చెప్తె కధలాగానే ఉంటుందేంరా..?? అంది మూతి ముడుచుకొని. సరె సరె విషయం చెప్పు అన్నాను ఆమెని సముదాయిస్తూ. నిన్న ఆ పక్కింటి కామేశ్వరిగారు లేరూ ఆవిడా ఎదురింటి మీనాక్షిగారు నేనూ మాట్లాడుకొంటుంటే ఈవిషయం వచ్చిందిరా అప్పుడు తెలిసింది ఈఒబామాయే ఆఓబమ్మ కొడుకని అంది. అబ్బా చాలా పెద్ద విషయం కనిపెట్టారే అన్నాను. మరి ఏమను కొంటున్నావు అంది గర్వంగా వెంటనే ఒరేయి పోయి పోయి అమావాస్య ముందు పెట్టుకొన్నాడేవిరా ఆ ప్రమాణ స్వీకారం కాస్త మంచి చెడ్డా చూసుకొని ఏపాడ్యమి నాడో విదియనాడో పెట్టుకోవచ్చు కదరా అంది. అబ్బా నీచాదస్తం దొంగలుదోల అతను ఓబమ్మకొడుకూ కాదూ ఏమీ కాదు ఆమాటకొస్తే అసలు మనదేశం వాడే కాదు అన్నాను. అయినా ఆవిడ ఏవిషయమైనా నమ్మిందంటే ఒకపట్టాన వినదు. నువ్వు దేన్నియినా తొందరగా నమ్మవా ఏమిటీ మనదేశం వాడు కాకపోతే మెడలో ఆంజనేయస్వామి గొలుసు ఎందుకు వేసుకుంటాడు..? పరాయిదేశం వాళ్ళంతా కిరస్తానీ వాళ్ళేనటగా నువ్వేమైనా చెప్పు అతను మనదేశం వాడేను అదీ కాక మన ఓబమ్మ కొడుకే అంది స్తిరంగా. ఇహ ఆవిడని నమ్మించడం బ్రహ్మ తరం కూడా కాదని నాకర్ధమైంది, ఆవిడ నమ్మినా నమ్మకపోయినా పెద్దగాఒరిగేదేమీ లేదని ఊరుకున్నా. నేనూరుకున్నాఆవిడూరుకోదుగా… ఒరేయి ఆప్రమాణస్వీకారం తరువాత వాళ్ళకిచ్చిన కొత్తింట్లోకి వెళ్తారటగా అన్నది. నేను అవున్నాను. శుభమా అంటూ ఆఇంటికి సున్నాలు వేయించారోలేదో అంది నానమ్మా అది వైట్ హౌస్ నానమ్మా అంటే అదే తెల్ల ఇల్లు దానికి సున్నాలు అవసరం లేదు అయినా అక్కడవాళ్ళకి ఈ చాదస్తాలు ఉండవు అన్నాను. అదేవిట్రా మరీ చోద్యం కాకపోతేనూ అని దీర్ఘం తీసింది నానమ్మ. పోనీ కనీసం కొత్తింట్లో వ్రతం అదీ చేసుకొని పదిమందికీ భోజనాలైనా పెడతారా..? వామ్మొ ఈవిడ్ని వదిలేస్తే ఇంకా ఎంతదూరం వెళుతుందో అనుకొని నేనేదో అనబోయంతలో… ఒరేయి అబ్బిగా వాడి ఫోన్ నంబరు నీదగ్గర వుందా అనడిగింది. ఎవరిది..? అన్నాను, వాడిదేరా ’ఒబామా’ది.. ఇదిగో అతన్ని వాడు వీడు అనకు ఎవరైనా వింటే తీసుకెళ్ళి బొక్కలో తోస్తారు అన్నాను. పోరా మరీ బడాయి నాకళ్ళముందు పుట్టి పెరిగినవాడు వాణ్ని వాడు అంటే తప్పా అంది. ఓరినాయినోయి అనుకొని ఇప్పుడు ఆఫోన్ నంబరుతో నీకేంపని అయినా నాదగ్గరలేదు అన్నాను. ఆఫోన్ దగ్గర నాఅంతలావు పుస్తకం వుంటుంది కద దాంట్లో చూడు వుంటుంది అంది. (టెలిఫోన్ డైరక్టరీ అని అవిడ ఉద్దేశం) దాంట్లో ఎందుకు వుంటుంది అన్నాను. ఓరినీ అమాయకత్వం సంతకెళ్ళా ఎవరినంబరైనా తెలియకపోతే దాంట్లోనేకదరా చూస్తారు. దాంట్లో మనదేశం నంబర్లే ఉంటాయి ఆదేశం నంబర్లు ఉండవు అన్నాను. ఇదెక్కడి పితలాటకంరా..? ఇప్పుడెలా అంది. ఇప్పుడేం ముంచుకుపోయిందట అన్నాను. వాడు కనీసం పాత ఇంట్ల్లో సామాను కొత్తింట్లోకి మార్చేటప్పుడైనా కాస్త మంచిరోజు చూసుకొని నాలుగు ఆటోలు కాని మరీ సామాను ఎక్కువ ఉంటే ఒక లారీ కానీ మాట్లాడుకొని మార్చుకొమ్మని చెప్దామని అన్నది. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే వాళ్ళకి తెలియదా వాళ్ళసంగతి వాళ్ళు చూసుకుంటారులే గోల విసుక్కున్నాను నేను. ఓరీనీ తెలిసిన విషయం చెప్పకపోతే ఎలా గరా అంది. అబ్బబ్బా నీతో చచ్చేచావొచ్చిందే ఎందుకొచ్చిన గోలకాని ఒకటిక్కెట్టు కొని ఇస్తాను వెళ్ళి చెప్పిరా అన్నాను. నువ్వుత్త కుళ్ళు వెధవ్విరా ఆఇచ్చేదేదో మొన్నే ఇస్తే ఆప్రమాణస్వీకారానికే వెళ్ళి వచ్చేదాన్ని కదా పుణ్యం పురుషార్ధం రెండూ కలిసి వచ్చేవి అంది. పోనిలేవే రేపెప్పుడైనా ఆఒబమా వాళ్ళమ్మని చూడ్డానికి మనదేశం రాకపోతాడా అప్పుడు చూద్దూగాని అన్నాను. ఎంతైనా నువ్వు తెలివిగలవాడిరా పరంధాముడూ ఇట్టే మాయ చేస్తావు ఏదిఏమైనా వాడు ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను తప్పకుండా తీసుకెళ్ళి వాణ్ణి చూపించు అంటూ కుర్చీలోంచి లేచి లోపలికివెళ్ళింది. హమ్మయ్య బతుకు జీవుడా అని నిట్టూర్చాను.

నవంబర్ 11, 2008

మనసులో… మాట…

Filed under: Uncategorized — pavani5 @ 1:58 సా.

హలో అంతా బాగున్నారా…?  ఆ ఏంబాగుంటారులెండి… తిండి కలిగితే కండ కలదోయి అని వెనకటికి ఎవరో మహాకవి అన్నారుటలెండి.  ఆ తిండే లేంది ఎలా బాగుంటారు అని అంటే నావుద్దేశ్యం. రేట్లు మండి పోతుంటే ఏంతింటారని మొన్న ఎవరో అంటే విన్నాను.  అది ఎంతనిజం…? ఒకప్పుడు వందరూపాయలు తీసుకుని  మార్కెట్టుకి వెళితే పెద్ద సంచీ నిండా కూరలు వచ్చేవి, ఇప్పుడు అదే వందతో పచ్చిమిరపకాయలు కరివేపాకు  కొత్తిమీర కూడా రావటంలేదు. ఎక్కడదాకానో ఎందుకు నావిషయమే తీసుకోండి. ఇంతకీ నేనెవరో మీకు చెప్పలేదు కదండీ…  నేనేనండీ ఇదివరకటి రాములక్కాయ ఇప్పటి  టమాటాని…  గుర్తు పట్టారా…? కొన్నాళ్ళు పోతే నాపరస్తితి అలాగే తయారైయేట్టుగా వుంది.  ఒకప్పుడు నన్ను ఎవ్వరూ పట్టించుకునేవాళ్ళు కాదు. నాచెట్టుని పిచ్చి మొక్క అని పీకి పారేసేవాళ్ళు. నన్ను తింటే రోగాలు వస్తాయని భయపడే వాళ్ళు. ఏ  మహాతల్లి నాలో రుచిని కనిపెట్టిందో కాని మెల్లమెల్లగా నన్ను తింటానికి అలవాటుపడ్డారు. పులుసుల్లో, చారులో మొదలైన నాప్రస్తానం  ఈరోజు నేను లేకుండా ఏకూర వండడానికి  ఏఇల్లాలు ఇష్టపడటం లేదు. మొదట్లో కూరలు కొంటే కొసరుగా నన్ను ఇచ్చే వాళ్ళు  తరువాత్తరువాత మెల్లగా అమ్మటం మొదలైంది. మొదట్లో  కిలో పదిపైసలకి, పదిహేను పైసలకి అమ్మిన నన్ను… ఇప్పుడు కిలో  యాబై  అరవై రూపాయల కి అమ్ముతున్నారు.  అంటే  నావిలువ ఎంత పెరిగిందో చూసారా… ప్రస్తుతం సామాన్య ప్రజలకి అందుబాటులో లేను.  నన్ను కొనలేక నేను లేకుండా కూరలు వండుకోలేక  సామాన్యులు నానా అవస్తా పడుతున్నారు. అంటే కూరల్లో నేనే మహారాజునన్నమాట. ఈమాట తలుచుకొంటే నాకు కొంచం గర్వంగాను కొంచం భయంగాను వుంటుంది. ఎందుకంటే మహారాజ కిరీటం దక్కినందుకు ఆనందం…  రాజులు రాజ్యాలు కనుమరుగై పోయినట్లే  నేనుకూడ కొన్నాళ్ళకి అలాగే కనుమరుగై పోతానా…? అని దిగులుగానూ వుంటుంది.  మళ్ళీ నాకు నేనే సమాధాన పడతాను పెరుగుట విరుగుట కొరకే ధరతగ్గుట హెచ్చుట కొరకే అన్నారుగా.  అదితలుచుకుంటూ తృప్తి పడతాను. ఎప్పటికైనా మళ్ళీ ఆపాతరోజులు రాకపోతాయా…

అక్టోబర్ 25, 2008

మండే మనసు…

Filed under: Uncategorized — pavani5 @ 6:57 ఉద.

ఇంటిపని పూర్తి చేసుకొని కాంతం టీవీ చూద్దామని రిమోట్ చేతిలోకి తీసుకొని టీవీ ఆన్ చేసింది.  ’పో టీవి రా టీవ’ లో  ఏదో పాతసినిమా వేస్తున్నాడు, చాలా రోజులతరువాత మంచిసినిమా ళక్ ళక్ మని కళ్ళు రెండు టీవీకి అతికించి చూస్తోంది.  ఇంతలో తుఫాన్ లాగా కొడుకు దూకే రావ్ వచ్చి,  అమ్మా ఒకసారి అంటూ రిమోట్ తీసుకుని ఛానల్ మార్చి క్రికెట్టు పెట్టాడు. ఒక అరగంట చూసి వెళ్ళి పోయాడు అమ్మయ్యా అని మళ్ళీ ’పోటీవి రాటీవ’ పెట్టుకుంది కాంతం. అందులో బ్రేక్ అరగంట యాడ్స్ అయి పది నిముషాలు చూసిందో లేదో ఇంతలో కరెంట్ కట్…. వీడమ్మ కడుపు కాలా అనుకొంటూ లేచి వెళ్ళిపడుకొందామని అను కొనేంతలో మళ్ళీ పవరు వచ్చింది.  మళ్ళీ ’పో రా టీవి’ ఆన్ ఒకపావు గంట చూసేలోపు కూతురు కిష్కింద  వచ్చి, అబ్బా ఏం చూస్తావమ్మా ఆపాతడొక్కుసినిమా అంటూ అదితీసేసి ఏవో హిందీ పాటలు పెట్టింది. ఆవిడగారు ఒకపావుగంట చూసి చెక్కేసింది. మళ్ళీ ’పో రా టీవ’  అయిదు నిమిషాలే ఆసౌభాగ్యం ఇంతలో వాళ్ళ ఆయన టపారావు వచ్చి  వార్తలు పెట్టుకొని కాసేపు చూసి వెళ్ళిపోయాక మళ్ళీ ’పో రా’  ఆన్   పదినిమిషాలు…  మళ్ళీ బ్రేక్  తరువాత సినిమామొదలవగానే పక్కంట్లోనే ఉన్నతమ్ముడి కొడుకు వచ్చి అత్తాఒక్కసారిఅని పోకిమానొ పీకీమానొ పెట్టి తిట్టగాతిట్టగా ఒకపావుగంటకి వాళ్ళమ్మ వచ్చి అరిస్తే వెళ్ళి పోయాడు. మళ్ళీ ’పో రా’  రెండునిమిషాలు అయ్యిందో లేదో…  బిల బిల మంటూ తల్లి  తుఫాన్, జల్లు కొడుకు (అంటే వాడు మాట్లాడేటప్పుడు ఎదుటివాడి మొహం అంతే…)  పిల్లరాక్షసి ఇలా ఎందుకన్నానంటే  కనపడ్డవస్తువులన్ని బ్యాగులో వేసేస్తుంది. టోటల్ గావాళ్ళు వచ్చివెళితే తుఫాన్ వచ్చివెళ్ళినంత ఆనందంగా ఉంటుంది కాంతానికి. హమ్మయ్య ఇహ సినిమా లేదు చిత్రమూలం లేదు అనుకొని నిట్టూరుస్తూ అక్కడనించి లేచింది.  పాపం ఎప్పుడూ అంతే  టీవీ లో ఎప్పుడైనా మంచి ప్రోగ్రాం వస్తే చూడాలని  కాంతం కోరిక. కాని ఎప్పుడూ కుదరదు.  ఎవరికైనా ఇంతేనేమో… ఒకసారేమొ పవరు ఉండదు, ఒకసారి టీవీ కేబుల్ కనెక్షన్ వుండదు,  ఒకసారి ఇంటికిఎవరైనా రావటం,  ఇంకోసారి మనమేబయటికి వెళ్ళాల్సి రావటం…  లేదా ఇంట్లో వాళ్ళు వాళ్ళకిష్టమైన ఛానల్స్ పెట్టుకొంటారు.. సరేలె అదే చూద్దామంటే అందులో వచ్చింది ఆడో మగో తెలుసుకొనేలొపే  మార్చేస్తారు.  ఇలా రక రకాలఅడ్డాలు …

ఆగస్ట్ 7, 2008

సినీమాయ…

Filed under: Uncategorized — pavani5 @ 5:10 ఉద.

 మన సినిమాలలో కొన్ని సీన్లు చూస్తే భలే నవ్వు వస్తుంది, కాస్త విచిత్రంగా కూడ ఉంటుంది. హీరో  కధాపరంగా బీదవాడు అయినా స్ర్కీన్ మీద మాత్రం బైక్ లేకుండా అడుగుబైట పెట్టడు. హీరోయిన్ బర్త్ డే వచ్చిందంటే నెక్లెస్ కాని కనీసం ఒంటిపేట  బంగారు గొలుసు కాని ప్రెజెంట్ చేస్తాడు. అయ్యగారికి ఉద్యోగం సద్యోగం ఏది లేకపోయినా, అంత డబ్బు ఎలా వస్తుందో తెలీదు. పోని ఇంట్లో వాళ్ళు ఇస్తారా అంటే, ఇల్లు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు కనపడరు. కనీసం వాళ్ళ గురించి కూడా ఎక్కడా ప్రస్తావించడు. ఎక్కడ తింటాడో  ఎక్కడ  పడుకొంటాడో  తెలియదు.
    ఒక సీన్లో వేసిన  బట్టలు ఇంకో సీన్లో వెయ్యడు, ఆబట్టలు అన్నీఎక్కడ పెడతాడో  తెలియదు.  మనకైతే అన్ని బట్టలు పెట్టుకోవాలంటే కనీసం నాలుగు బీరువాలు కావాలి. అమ్మ అయ్య  లేకపోయినా దేవుడిచ్చిన  చెల్లొ  తమ్ముడో  ఉంటారు.  వాళ్ళకోసం ఈయనగారు ప్రాణం ఇస్తారు.  ఏ అమ్మాయైనా కనపడితే…. అది ఎంత  అందంగాఉన్నా సరే  హీరోయిన్ కాక పోతే అమ్మా చెల్లెమ్మా అంటాడు. ఎంతవికారంగా ఉన్నా  హీరోయిన్ తో మాత్రం అయి లవ్ యు అంటాడు.
     సార్ కి వారంరోజులనించి తిండి లేకపోయినా  భలే హెల్దీగా ఉంటాడు. అదే మనమైతేనా  ఒక్కరోజు ఉపవాసం ఉంటే  తెల్లారేసరికి  ఈసురో వాసుదేవా అంటూ  వేళ్ళాడ బడి పోతాం.  ఎక్కడా స్కూల్లో కాలేజీ లో కాని చదివినట్టు కనపడదు  కాని అవసరాన్నిపట్టి అయ్యగారు ఇంగ్లీష్ గడ్డగడ్డ గడా మాట్లాడతాడు.  మనం వుసూరుమంటూ చిన్నప్పటి నించి డిగ్రీ దాకా చదివినా ఆఇంగ్లీష్  రాదు. ఇక దొరగారి పక్కన స్నేహితుడు  ఒకడుంటాడు వాడికి  ఎక్క్డడాలేని నిజాయతి, హీరోకి ఏ చిన్న కష్టం వచ్చినా ఆయనగారు  విలవిల లాడి పోతాడు. తనసుఖం తను చూసుకోకుండా  హీరో కోసమే త్యాగం చేసే ధన్యజీవి.
    ఇద్దరూ కలిసి సిగరెట్లు కాలుస్తూ రోడ్డుమీద వెళ్ళేవాళ్ళని కామెంట్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూంటారు. ఎవరికి  ఏమైనాపట్టించుకోరు కానీ అదే హీరోయిన్ పేరెంట్స్ కి మాత్రం  ఏచిన్న కష్టం వచ్చినా తెగబాధ పడి పోయి అందులో ఇన్ వాల్వ్ అయిపోయి  వాళ్ళకి న్యాయం జరిగె దాకా వదలరు. పాటల విషయానికి వస్తే మన హీరో ఎప్పుడు ఎక్కడ సంగీతం, కవిత్వం నేర్చుకుంటాడో తెలియదు కాని రాగ తాళ యుక్తంగా పాటలు పాడేస్తారు. ఆ పాటలకి తగ్గట్టు డ్యాన్స్ లు.
   హీరో ఎంత బక్కపల్చగా, పొట్టిగా వున్నాకూడా, విలన్ ఎంత బండగా వున్నా కూడా హీరో గారు ఒక్కతన్ను తన్నాడంటే విలన్ విల విలలాడుతూ కుప్పకూలిపోవలసిందే. అంత ఫైటింగ్ ఎప్పుడు నేర్చుకుంటాడో అర్ధం కాదు. ఎంత మంది వచ్చినా అలుపు ఆయాసం లేకుండా ఒక్క దెబ్బ తగిలించుకోకుండా అవతలి వాళ్ళని చితకొట్టి చింతకాయ పచ్చడి చేసేస్తాడు. ఎప్పుడైనా ఖర్మకాలి ఏకొండ మీదనుండో పడిపోతే మనమైతే సున్నంలోకి ఎముకలేకుండా అయిపోతాం కాని మన హీరో గారికి మాత్రం నుదిటి మీద చిన్న ప్లస్ మార్క్ వస్తుంది అంతే. ఆ ప్లస్ మార్క్ చూసే హీరోయిన్ ఢమేల్ మని పడిపోతుంది……. షరా మామూలే పాట పక్కనే హిమాలయాలు. మనం ఎంత వ్యయప్రాయసలు పడితేగాని వెళ్ళలేము కాని వాళ్ళు అలా కళ్ళు మూసుకుంటే చాలు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఆ మంత్రం ఏదో మనకీ తెలిస్తే బాగుండు… 🙂
   ఇక మన హీరోయిన్ గారయితే ప్రపంచంలో వున్న కరువుంతా తన దగ్గరే వున్నట్టుగా పాపం చిన్నప్పుడు ఎప్పుడో కుట్టించుకున్న గౌను వేసుకొని తిరుగుతుంది. అందుకేనేమో ఎవరో ఒక గీత రచయిత రాసారు ’ చిన్నగౌను వేసుకున్న పెద్దపాప’ అని ఏదో సినిమాలో. అలాంటి బట్టలు వేసుకొని ఇంట్లొ అందరి ముందు బానే తిరుగుతుంది. కానీ హీరో ముందుకి వచ్చేసరికి మాత్రం ఎక్కడ లేని సిగ్గు వచ్చేస్తుంది. ఆ సిగ్గు ఇంత చిన్న బట్టలు వేసుకోవలసి వచ్చినందుకో లేక ఇవి మాత్రం ఎందుకు వేసుకోవలసి వచ్చిందిరా అనా అర్ధం కాదు. అమ్మాయిగారు మాట్లాడుతుంటే నోట్లో చూయింగం పెట్టుకొని నములుతున్నట్టే వుంటుంది కాని ఒక్క డైలాగ్ కి కూడా లిప్ మూమెంట్స్ కలవవు.
   ఏంటో ఈ సినీమాయలు అబ్బో చూడతరమా……

ఆగస్ట్ 3, 2008

ఆశా నిరాశేనా…

Filed under: Uncategorized — pavani5 @ 5:08 సా.

 నాఆత్మకధ మీతో చెప్పాలని ఈరోజు ఎందుకో అనిపిస్తోంది. ఈమద్య స్లిమ్ గా ఫెయిర్ గా అవ్వాలనుకొని కొన్ని సౌందర్య సాధనాలు వాడాను వాటి ఫలితాలను మీకు చెప్పుకుంటాను.
   టీవీలో ’అందం’ సీరియల్ చూస్తుంటే…… మద్యలో బ్రేక్ లో వచ్చిన యాడ్స్ లో కోల్గేట్ యాడ్  చూసాను. డాక్టర్లందరు దంత సౌందర్యం కోసం కోల్గేట్ వాడమని సూచిస్తున్నారు. అది చూసి దీంతో అయినా నాపళ్ళు బాగుపడతాయని ఆశతో  వెంటనే వెళ్ళి  కోల్గేట్ పేస్ట్ తెచ్చాను. ఇక నాపళ్ళు మిలమిలలాడతాయని ఎంతో ఆనందంతో  ట్యూబ్ ఓపెన్ చేసాను. తీరాచూస్తే అది నాఒక్క పంటికి కూడా సరిపోలేదు. ఈరకంగా ఎన్ని పేస్టులు తెస్తే నాపళ్ళు బాగుపడతాయని నిరాశతో ఆప్రయత్నం మానుకొన్నా. దంత సౌందర్యం ఆరకంగా సమాధి అయ్యింది.
   కనీసం చర్మసౌందర్యం అయినా మెరుగు పరుచుకొందామని అదేదో ఫెయిర్ అండ్ లవ్లీ అని విన్నాను, సరే దీని సంగతి ఏమిటో చూద్దామని, పేస్ట్ ఒకటి తెస్తే చాల్లేదని, ఇవి నాలుగు తెచ్చాను  కాని అన్ని కలిపినా ముఖానికి ఒక పక్కకి కూడా రాలేదు. ఈరకంగా చర్మసౌందర్యం కూడ మట్టిలో కలిసి పోయింది.    ఎహె…. ఎందుకొచ్చిన గోల అని కొన్ని రోజులు మూసుకొని వూరుకొన్నా. నేను వూరుకొందామన్నా యాడ్స్ వూరుకోనిస్తాయా…??  ఈమద్యనే చూసా మన మాస్ట్రర్ బ్లాస్టర్ చెప్పిన  సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అనే మాటలు నన్ను బాగా ప్రభావితం చేసాయి. అందులోను ఈమద్య కాస్త నీరసంగా ఉంటోందేమో, దాంతో చెంగున ఎగురుకుంటు వెళ్ళి ఒక కిలో బూస్ట్ తీసుకువచ్చాను. కానీ దాన్ని పాలల్లొ కలపటానికి యజమాని కాసిని కూడా పాలు మిగల్చడు. దాంతో ఏదారిలేక కుడితిలో కలుపుకొని తాగాను ఉపయోగం ఏముంది…  అలాంటి కిలోలు ఎన్ని తెస్తె నాకు సరిపోతాయి…?  మనకి గడ్డే మేలు అనుకొని గడ్డిలో లేనిది దానిలో మాత్రం ఏముంటుందిలే అని దాన్ని కూడ తృణ ప్రాయంగా వదిలేసాను.
   ఆ ఇంకో విషయం మర్చిపోయాను, ఆమధ్య సంతూర్ సబ్బు కూడ తెచ్చాను. అది వాడితే చాలా చిన్నగా కనపడతామని అంటే. కాని దాన్ని ఈచర్మానికి ఎలా రుద్దాలో అర్ధంకాక, సరే నీళ్ళలో కలుపుకొని స్నానం చేద్దామనుకొన్నా. కాని చెరువులో  ఎన్నిసబ్బులు కలిపితే  మన స్నానానికి సరిపోతుంది.  ప్చ్….  హ… ఏమిటో ఈజీవితం, విరక్తి పుడుతోంది.
    చివరి ఆశగా  సోనా బెల్ట్ ఒక్కటివాడి కనీసం పొట్టయినా తగ్గిద్దామని  అనుకొన్నాను. ఎందుకంటే మనిషే కాదు బర్రె కూడ ఆశా జీవే కదండి. అయినా ఈసారి నా స్తోమత కూడా అలోచించకుండా పీనాసితనానికి పోకుండా ఓ పదిబెల్ట్ల్ల్ లు కలిపి వేసాను. అయినా కూడా నా ఆకారాన్ని వెక్కిరిస్తూ అది కాస్తా ఫట్ మని తెగింది. ఛి…ఛీ… అనుకొని, మనకి ఇవేవి సరిపడవు లే అని అనుకొని, ఈబర్రె జీవితంలో ఉన్నసుఖం ఎందులోను లేదని, హాయిగా నాగడ్డేదో నేను తింటూ నా నెమరేదో నేనెసుకొంటూ, అందంలో లేదు ఆనందం అనుకొని. ఇక సీరియల్స్ చూసినా యాడ్స్ మాత్రం చూడకూడదు అని నిశ్చయించుకున్నాను.

ఆగస్ట్ 2, 2008

HAPPY FRIENDSHIP DAY…

Filed under: Uncategorized — pavani5 @ 5:02 సా.

“స్నేహం ” ఆమాటగురించి ఎంతమంది ఎన్నిరకాలుగా చెప్పినా తరగని మాధుర్యం స్నేహంలో ఉంది. అది మాటలకందని గొప్ప అనుభూతి. స్నేహం అనేది ఒక గ్రీటింగ్ కార్డ్ తోనో, లేక ఒక ఫ్రెండ్ షిప్ బ్యాండ్ తోనో, ఏబహుమతి తోనో ఏర్పడేది కాదు, వాటివల్లనిలిచేది కాదు.  కులం- మతం భాష – దేశం  ఆడ -మగ   చిన్నా-పెద్దా  తేడా లేనిది, ఏద్వేషం  లేనిది స్నేహం ఒక్కటే.  ఏస్వార్ధం లేని  అతీతమైన  బంధం స్నేహం  కాని కొంతమంది దానిని స్వార్ధానికి వాడుకుంటున్నారు ఈరోజుల్లో. డబ్బుతోముడిపెట్టి  నిజమైన స్నేహితులని  కష్టాలలోకి నెడుతున్నారు. ఇటువంటి పరిస్తితులలో మంచి స్నేహితులను పొందటం నిజంగా అదృష్టం,  కాని  కొంతమంది  సినిమాలు షికార్లు మాత్రమే స్నేహమని అనుకొంటారు.  మనసు లోతుల్లోని భావాలు ఎంతమంది చూడగలరు..?ఆడుకున్నా కొట్టుకొన్నాతిట్టుకొన్నా , బళ్ళో కలిసి పనిష్మెంట్ తీసుకున్నా, కాపీలు కొట్టినా, స్కూల్ బయట ఒక కాయ కొని రెండు కాయలు కొట్టేసినా, పానీపూరీ తిన్నా, రన్నింగ్ బస్ ఎక్కినా, పాటలు వింటూ డాన్స్ చేసినా ,బీటు కొట్టినా,చిన్న పాటి తగదాల తో విడిపోయి మళ్ళీ కలిసినా అది స్నేహితులకే చెల్లుతుంది. అలాంటి స్నేహంలో  వున్నగొప్పదనం  ఎంతమంది ఆస్వాదిస్తున్నారు.?   ఏ కష్టమొచ్చినా  స్నేహితుడు అందించే  హస్తం  ఎంత ధైర్యాన్నిస్తుంది,  జీవితంలో ముందుకు సాగటానికి ఆధైర్యంఎంతో చేయూతనిస్తుంది. ఇవ్వాళ్ళ స్నేహితులిగా వున్నవాళ్ళు రేపు ద్వేషంతొ కొట్టుకొంటున్నారు చంపుకొంటున్నారు…… వద్దు, ఇటువంటి  స్నేహం వల్ల మనస్తాపాలే కాని మానసోల్లాసం లేదు. కొందరు ప్రేమ కోసం స్నేహాన్ని అడ్డం పెట్టుకుంటారు ఇది  ఎంత వరకూ సమంజసం? పారదర్సకమైన స్నేహాన్ని మలినం చేయద్దు , స్వచ్చమైన స్నేహాన్ని ఆహ్వానిద్దాం.

అందరికి స్నేహితుల రోజు శుభాకాంక్షలు… 🙂 🙂

జూలై 31, 2008

పాములనాయుడు… సెల్ ఫోన్…

Filed under: Uncategorized — pavani5 @ 2:51 సా.

పాములనాయుడు కి ఎన్నో రోజుల నుండి మొబైల్ కొనాలని ఆశ. ఎందుకంటే తన ఫ్రెండ్ జక్రయ్య ఎప్పుడు మొబైల్ లో మాట్లాడుతూ తెగ ఫోజులు కొడుతూండటం చూసి ఎలాగైనా తను కూడా మొబైల్ కొనాలని నిశ్చయించుకున్నాడు పాముల్నాయుడు. ఇక ఆలశ్యం చేయకుండా మొబైల్ కొనేసాడు. ఇక అప్పటి నుండి మొదలయ్యాయి కష్టాలు మన పానా కి…
ఏనాడైతే కొన్నాడో ఆ రోజు నుండి శని పట్టుకుంది. ఆరోజు ఫస్ట్ కాల్ శుభప్రదంగా వుంటుందని సాయిబాబా గుడికి కాల్ చేద్దామని నంబర్ నొక్కాడు. మన పానా ఫోన్ రింగ్ అవుతూండగానే సాయిబాబా దండకం చదువుకుంటూ అవతల వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయాగానే…
ఆ హలో నమస్కారమండీ… ఈ రోజు ఎన్నింటిదాకా వుంటారు మీరు అని అడిగాడు.
అవతలి వ్యక్తి, ఆ సాయంత్రం దాకా. తర్వాత ఆ అవతలి వ్యక్తి అడిగాడు మన పానా ని, సార్ ఎన్నింటికి వస్తారు, ఎందుకంటే ఇక్కడ ఏర్పాట్లు చెయ్యాలి కదా.
ఏర్పాట్లా…..! ఓహో పూజ గురించేమో అనుకొని సాయంత్రం ఆరింటికి వస్తాం అన్నాడు.
సరే సార్ కాని ఆరు దాటితే ఇక్కడ నేను వుండను వేరే అతను వస్తాడు డ్యూటీకి అనగానే మన పానా కి ఏమి అర్ధం కాలేదు. అదేంటండి మీరే కదా అక్కడ ప్రధాన పూజారి అని అన్నాడు… పూజారా…??? ఏందయ్యో నేను ఎవరనుకుంటున్నా….??
పానా కి ఏమి అర్ధం కాలేదు సార్ ఇది సాయిబాబా గుడేనా అని అడిగాడు(అవతలి వ్యక్తి ఎవరో అడిగి తెలుసుకోవాలనే ఆలోచన అప్పుడు వచ్చింది మన హీరో కి). కాదయ్యో ఇది శ్మశానం కదూ, నేను కాటికాపరి కదూ అన్నాడు. మన వాడికి మతి పోయి తనని తాను లక్షబూతులు తిట్టుకొని ఫోన్ పెట్టేసాడు… అలా ఫస్ట్ కాల్ ప్రహసనం సాగింది…
ఇలా లాభం లేదనుకొని ఆ రొజు ముహూర్తం బాలేదనుకొని ఆరోజుకి వదిలేసి మొబైల్ ని మూట కట్టేసి బీరువాలో పెట్టేసాడు మన పానా.. మర్నాడు ముహూర్తం చూసి అలాగే వర్జ్యంకూడ చూసి సెల్ ఫోన్ బీరువాలో నుండి తీసాడు. తీసితీయగానే ఫోను రింగ్ అయ్యింది. పానా ఎక్కడలేని ఆనాందంతో ఫోను తీసి హలో అన్నాడు…
అవతలి నుండి ఒక అందమయిన గొంతు నవ్వూతూ హలో అంది..
పానా ఇక ఆనందానికి అవధులు లేవు. ఆ గొంతు వినే సగం పడిపోయాడు. హలో ఎవరూ అన్నాడు..
నా పేరు శ్రీవీరవెంకటసూర్యకాంతనాగరాజసాయిదుర్గవిజయకనకమహలక్ష్మి … అని చెప్పగానే పానా బ్రెయిన్ పూర్తిగా పోయింది.. రెండు నిమిషాలు పట్టింది తిరిగి మామూలు మనిషి అవడానికి. మళ్ళి పొరబాటున ఎవరండి అని అన్నాడు అంతే ఆలస్యం అడిగిందే తడవుగా మళ్ళీ ఆవిడగారు మొదలుపెట్టి చెప్పారు నా పేరు శ్రీవీరవెంకటసూర్యకాంతనాగరాజసాయిదుర్గవిజయకనకమహలక్ష్మి …
ఆపేరువినగానే, వామ్మో ఏందమ్మా ఇంతపేరు అంటే… హిహిహిహి అది మాఅమ్మమ్మ పెట్టిన పేరండి. నాకు చాలా ఇష్టమైన పేరు. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నాపేరు పూర్తిగా పిలవండీ నాకుచాలా హేపీగావుంటుంది అంది. నీ హేపి తుంగలొ తొక్క దానిసంగతి తరువాత చూద్దాం, ముందు నాసంగతిచూడు అన్నాడు.
ఆవిడగారు సిగ్గు పడుతు చెప్పండి సార్ ఏమిటి మీప్రాబ్లెం అంది. నేను చెప్పేదేంది నువ్వే కదా ఫోన్చేసింది… ఆ మర్చిపోయాను సార్, మీ మొబైల్ బిల్ నాలుగు వేల ఏడు వందల డెభైనాలుగు రూపాయలు వుంది, లాస్ట్ డేట్ కూడా అయిపోయింది. ఇవ్వాళ్ళ పే చెయ్యకపోతే రేపు మీ ఫోన్ కట్ అవుతుంది.
ఏందీ నేను ఫోన్ బిల్లు కట్టాలా… ఏందమ్మో నేను ఫోన్ కొన్నదే నిన్న, దాని శిగతరగ ఏదో కొత్త ఫోన్ ముందుగా దేవుని దీవెన తీసుకుందామని నిన్న చేసిందే ఒక్క ఫోన్ అది కూడా యాడికో శ్మశానానికి పోయింది. దానికి నాలుగు వేల ఏడు వందల డెభైనాలుగు రూపాయలా… మతి వుండే మాటాడుతున్నావా..??
అయ్యో సార్ మీరు ఈ ఫోన్ తీసుకొని ఆరు నెలలు అయ్యింది కదండీ… ఈ బిల్ల్ లాస్ట్ మంత్ కట్టాల్సింది.
ఏంది ఆరు నెలలా…..! ఎవరు చెప్పారు నీ అమ్మ మొగుడు. చెప్పిన సోదంతా విని మళ్ళీ అదే వాగుతావ్.
అయ్యో అలాగా సార్ మీపేరు చెప్పండి…
అమ్మా…..
సార్ కాల్ మీ శ్రీవీరవెంకటసూర్యకాంతనాగరాజసాయిదుర్గవిజయకనకమహలక్ష్మి …
నా బొంద అదే అదే చూడు తల్లీ నాపేరు పాముల నాయుడు…
🙂 ఏంటి సారు ఆ పేరు… అంటే మీరు పాములు పట్టుకుంటుంటారా….??
ఏందమ్మో నువ్వు పెట్టుకోలా కొండవీటి చాంతాడంత పేరు, అయినా పని చూడమ్మా…
కానీ సార్ ఇక్కడ పవన్ అని వుందే… ఒకసారి మీఅడ్రస్ చెప్పండి సార్…
అన్నికాయితాలు ఇచ్చిచచ్చాను కదమ్మా ఫోన్ తీసుకునేటప్పుడు. మళ్ళి ఇప్పుడు ఈ సోది ఏంది…
సార్ ఒక్కసారి చెప్పండి …
చూసుకో చెప్తున్నా… ఇంటి నంబరు 420, వీధి నంబరు 210, పీతగుంట్ల పాలెం, చాలామ్మ…
సార్ సారీ సార్ ఒక్కసారి మీ నంబర్ ఇదేనా చూడండి… **********
అమ్మా నా నంబర్ అది కాదు, ముందు నంబర్ సరిగ్గా చూసుకొని చేసుకోండి ఫోన్లు.. ఇంత సేపూ నా బుర్ర తినేసి ఇప్పుడు సారి అంటావా… పెట్టెహె సోది…..
ఇక లాభం లేదనుకొని ఫోన్ తీసుకొని తప్పు చేసాననుకొన్నాడు పానా. ఇంతలో మళ్ళీ ఫోన్ రింగ్ అయ్యింది కానీ పానా కి ఫోన్ తీయాలనిపించలేదు. ఫోన్ అంటే నే విరక్తి వచ్చేసింది పాపం. కానీ మళ్ళీ ఏదో చిన్న ఆశ ఈ సారైనా సరైన కాల్ వస్తుందేమో అని… ఆ ఆశతో మళ్ళీ ఫోన్ తీసాడు, హలో అన్నాడు…
హలో యాదయ్యా నేను ఇక్కడ సికింద్రాబాదు లో వున్నాను, కుకట్ పల్లి వెళ్ళాలి అర్జెంట్ గా ఆటో తీసుకొని వస్తావా…??
ఏందయ్యా నువ్వెవరూ…. ఈ యాదయ్య ఎవరూ…… ఈ ఆటో గోల ఏంది……
హలో నువ్వు యాదయ్యవి కావా….?? ఇది చిలకలగూడా కాదా….??
కాదు ఇది పీతగుంట్ల పాలెం…. నేను యాదయ్యను కాను…. పెట్టెయ్ ఫోన్..
ఆ ఫోన్ పెట్టీపెట్టక ముందే మళ్ళీ ఫోన్ రింగ్……. పానా కి ఫోన్ ఎత్తికొట్టాలన్నంత కోపం వచ్చింది.. కానీ ఆఫోన్ కి పెట్టిన డబ్బులు కనపడ్డాయి కళ్ళముందు.. ఏమి చెయ్యలేక మళ్ళీ ఫోన్ తీసి హలో అన్నాడు ఏడుపు మొహం తో…
అవతలి వ్యకి హడావిడిగా… సార్ సార్ మీరు అర్జెంటుగా బయలుదేరి ఇక్కడికి రావాలి.
పానా గుండెలు జారి పోయాయి ఆ వ్యక్తి హడావిడి చూసి.. యవరయ్యా నువ్వు ఏమయింది…? యాడికి రావాల నేను…?
సార్ ఇక్కడ మీ ఆవిడకి పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. తొందరగా రండి మీరు…….
మా ఆవిడకా … యాక్సిడెంటా…..
అవునండి, ఆవిడ ప్రాణాపాయ స్తితిలో వున్నారు. అపోలోలో చేర్చాము, ఆవిడ బ్యాగులో మీ నంబర్ చూసి మీకు ఫోన్ చేస్తున్నాను మీరు తొందరగా రండి…
నీ అబ్బరేయి… నాకింకా పెళ్ళే కాలేదురా. నంబర్ చూసుకొని చెయ్యండిరా. పెట్టెయి ఫోన్….
దాంతో పానా ఒకటే నిశ్చయించుకున్నాడు. తెల్లారగానే మొబైల్ తీసుకెళ్ళి ఆ జక్రయ్యకి గిఫ్ట్ గా ఇద్దామని. అప్పుడు కాని వాడి తిక్క కుదరదని అనుకొని మళ్ళి ఆ ఫోన్ ని బీరువాలో పెట్టాడు. అంతకు ముందు నుండి పొయ్యిమీద మసిలి పోతున్న నీటిని తీసుకొని హాయిగా స్నానం చేసి, బువ్వ తిని బజ్జున్నాడు… 🙂

జూలై 28, 2008

పధకం శ్రీ…

Filed under: Uncategorized — pavani5 @ 11:56 ఉద.

మన ప్రభుత్వం మనకి ఈమద్య చాలా పధకాలు ప్రకటిస్తోంది వాటిలో కొన్ని …
ఆంధ్రరాష్ట్ర్ర ప్రజల ఆరోగ్యదృష్ట్యా ఆరోగ్య  శ్రీ…(చాలా ఆరోగ్యంగా వున్నారు ప్రజలు డెంగ్యూ, మలేరియాలతో…)
పేదప్రజల కోసం చౌక  శ్రీ … (ఇంతకు ముందు ముప్పై రూపాయలు వుండే కంది పప్పు ఇప్పుడు నలభై నాలుగురూపాయలు ఎంత చౌకో…)
గూడు లేని ప్రజల కోసం రాజీవ్ శ్రీ…(రాజీవ్ గృహకల్ప …. కట్టడం ఎప్పటికయ్యోనో…)
రైతుల కోసం మందు శ్రీ …(మందులు చేల కన్నా రైతులు ఎక్కువగా వాడుతున్నారు…)
పిల్లల కోసం చదువు  శ్రీ…(ఈపధకం వల్ల తల్లిదండ్రులకి బాగా ఖర్చుపెట్టే అవకాశం ఎంతో…)
శ్రామికుల కోసం సారా శ్రీ …(దీనివల్ల తాగి తూగటం తప్ప ఉపయోగం  ఏమిటో…)
మహిళల కోసం పావలా శ్రీ…(ఈ పావలా వెనక కధ ఉహు…)
వృద్దుల కోసం పింఛను శ్రీ…(ఈపధకం కోసం తిరిగి తిరిగి వృద్దుల    పాట్లు ఎన్నని…)
ప్రయాణీకులకోసం ఆటో శ్రీ…(మార్చిన ఆటో మీటర్ల వల్ల ఎవరికి లాభం…)
యువతకోసం పబ్బు శ్రీ…(పబ్బు కల్చర్ అసలు అర్దం కావట్లేదు…)
ప్రతిపక్షాల కోసం తిట్లు శ్రీ…(ఇవి మాత్రం అక్షయ పాత్రలాగ ఎప్పటికి అయిపోవు…)
కేంద్రంకోసం రుణం శ్రీ…(కేంద్రానికి రుణం ఇస్తారని కాదు తీసుకుంటారని…)
వంటింటికోసం గ్యా శ్రీ…(బుక్ చేసాక నెల రోజులకి వస్తే గ్రేటే…)
కరెంటు కోసం వరుణ శ్రీ(అబ్బో ఎన్నియాగాలో….)
ఇన్నిపధకాలు మన కోసం పంచి తన కోసం  పదవిశ్రీ ని మాత్రమే ఉంచుకొన్న మహానుభావుల్ని అభినందిస్తూ…..ఈపధకాలు అన్ని కూడ వాడుకుంటు మనం మాత్రం మన ఓటుశ్రీ ని వారికే వేసి గెలిపిద్దాం….
ఇది ఎవరిని కించపరుస్తూ రాసిందికాదు జస్ట్  ఫన్ కోసం

Older Posts »

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.